వైకల్య బాధితులకు భరోసా..

- సహాయ పరికరాలతో దివ్యాంగులకు ఆసరా
- భవిత కేంద్రాల ద్వారా చిన్నారులకు పంపిణీ
- లోపాలను సరిచేసేందుకు అవసరమైన వైద్యం
- ఆత్మవిశ్వాసం నింపుతున్న సర్కారు చర్యలు
వైకల్య బాధిత చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలువడమే గాక వారి లోపాలు సరిచేసేలా వైద్యం అందిస్తూ కొత్త వెలుగులు నింపుతోంది. ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు ట్రైసైకిళ్లు, అంధులకు బ్రెయిలీ లిపి, మూగ చెవిటి వారికి వినికిడి యంత్రాలు.. కర్రలు ఇలా సహాయ పరికరాలను భవిత కేంద్రాల ద్వారా అందిస్తూ భరోసా కల్పిస్తోంది. ఫలితంగా వారి విద్యాభివృద్ధికీ తోడ్పడుతూ ఆత్మవిశ్వాసం నింపుతోంది.
- నర్సంపేట రూరల్
చిన్నారుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుంది. మండల కేంద్రాల్లోని భవిత కేంద్రాలకు ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు కావాల్సిన సహాయ పరికరాలను అందిస్తూ పుట్టుకతో వచ్చిన లోపాలను సరిచేసేందుకు కృషిచేస్తున్నది. ఏటా దివ్యాంగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలను అమలుచేస్తుండడంతో ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగుతున్నారు. ఇందుకుగాను అధికారులు ప్రత్యేక సదరం క్యాంప్లు నిర్వహించి వైద్య పరీక్షలు చేసి ఆ తర్వాత ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారు. గతేడాది నుంచి ఇప్పటివరకు వరంగల్ రూరల్ జిల్లాలో గ్రహణమొర్రితో బాధపడుతున్న ఏడుగురు చిన్నారులకు ఉచితంగా శస్త్ర చికిత్సలు చేశారు. అలాగే ముగ్గురికి ఆర్థో ఆపరేషన్లు చేశారు. వైకల్యాన్ని గుర్తించి ఆలిమ్కో స్వచ్ఛంద సంస్థ సౌజన్యంతో వీల్చైర్లు, ట్రై సైకిళ్లు, చంక కర్రలు, వినికిడి యంత్రాలు, చేతి కర్రలు ఉచితంగా అందిస్తున్నారు. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఆరేళ్లలోపు వారికి అవసరమైన వైద్యం అందించి వైకల్యాన్ని శాశ్వతంగా దూరం చేస్తున్నారు.
జిల్లాలో 4 భవిత కేంద్రాలు..
వరంగల్ రూరల్ జిల్లాలో 4 భవిత కేంద్రా లు (నర్సంపేట, నెక్కొండ, పరకాల, వర్ధన్నపేట) ఉన్నాయి. ఇవిగాక మరో 12 నాన్ ఐఈఆర్సీ కేంద్రాలు నడుస్తున్నాయి. ప్రతి మండలంలో 100 నుంచి 150 మంది ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులు విద్యా బుద్ధులు నేర్చుకుంటున్నారు. ఈ చిన్నారులకు సమీకృత విద్యతో పాటు వైకల్యం నుంచి బయటపడేందుకు అవసరమైన సాంకేతిక, వైద్య సహాయం అందిస్తున్నారు. వైకల్యం కలిగిన వారికి సర్వశిక్షా అభియాన్ ద్వారా వీల్చైర్లు, ట్రై సైకిళ్లు(మూడు చక్రాల బండి), చంక కర్రలు, మూగ, చెవిటి వారికి వినికిడి యంత్రాలు, అంధులకు చేతికర్ర, బ్రెయిలీ పలక, టేప్ రికార్డర్లు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. వీటి ద్వారా వికలాంగులు తోటి వారితో కలిసి పోయి ఉంటున్నారు. గ్రహణమొర్రి, అంగుళి చీలిక, మెల్లకన్ను లాంటి శస్త్ర చికిత్సలు ఉచితంగా చేయిస్తున్నారు. సెల్ఫ్, హెల్ప్ స్కిల్స్, వినికిడి, భాషణ లోపం ఉన్న వారికి ఆడిటరీ, స్పీచ్ థెరపీ, రివాల్వింగ్ స్టూల్, స్టాండింగ్ స్టెప్ స్టూల్స్, స్పీచ్ ఆడియో మిషన్ సిస్టమ్, ఫిజియోథెరపీ లాంటి కార్యక్రమాలు భవిత కేంద్రా ల్లో నిర్వహిస్తున్నారు.
జిల్లాకు వచ్చిన పరికరాలు ఇవే..
జిల్లాకు 21 వీల్ చైర్స్, 64 జతలు శ్రవణ యంత్రాలు, 61 ఎంఆర్ కిట్లు, 5 ట్రై సైకిళ్లు, 21 రోలేటర్లు, ఒక ఉడెన్ బోర్డు, ఒక సీపీ చైర్, 3 బ్రైయిలీ కిట్లు, 30 క్యాలీపర్స్, 2 క్రర్చర్స్ ఎల్బో వచ్చినట్లు అధికారులు తెలిపారు. 2018-2019 సంవత్సరానికి గాను వచ్చిన పరికరాలను అన్ని భవిత కేంద్రాలకు చేరవేయగా ఇప్పటికే నర్సంపేట, రాయపర్తి, చెన్నారావుపేట, ఖానాపురం మండలాల్లో దివ్యాంగులకు అందజేశారు. మిగిలిన 12 మండలాలకు త్వరలో పంపిణీ చేయనున్నారు. అలాగే 2019-2020, 2020-21 సంవత్సరాలకు గాను పరికరాల కోసం 50శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే డిపాజిట్ చేసింది.
అర్హతను బట్టి ఇస్తున్నాం..
అన్ని మండలాల్లోని పిల్లలకు అవసరమైన సహాయ పరికరాలను అందిస్తున్నాం. దివ్యాంగుల్లో పుట్టుకతో ఉన్న లోపాలను సరిచేసేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతాయి. వీటిని చిన్నారులు సద్వినియోగం చేసుకుంటున్నారు. గతంలో సదరం క్యాంపులకు హాజరై పరీక్షలు చేయించుకున్న వారికి అర్హత ఆధారంగా పరికరాలు ఇస్తున్నాం.
- డీ వాసంతి, జిల్లా విద్యాశాఖ అధికారి, వరంగల్ రూరల్
తాజావార్తలు
- జైళ్ల సిబ్బంది, ఖైదీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి
- దివ్యాంగులకు కొత్త జీవితం
- సంద చెరువు సుందరీకరణ
- విశ్వ నగరానికిప్రాంతీయ బాట
- తడిచెత్తతో సేంద్రియ ఎరువు
- ఫలక్నుమా ఆర్ఓబీ వద్ద ట్రాఫిక్ మళ్లింపు
- ఉద్యోగ అవకాశాలు కల్పించేది టీఆర్ఎస్సే..
- దోమల నివారణకు చర్యలు
- వేసవి దృష్ట్యా నీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు
- కార్యకర్తలే పార్టీకి పునాదులు