శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Warangal-rural - Jan 22, 2021 , 00:42:41

డ్రైనేజీల నిర్మాణం కోసం సమగ్ర సర్వే

డ్రైనేజీల నిర్మాణం కోసం సమగ్ర సర్వే

  • మూడు నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళికలు   
  • వర్ధన్నపేట అభివృద్ధికి రూ. 30 కోట్ల నిధులు

వర్ధన్నపేట, జనవరి 21: పట్టణంలో 40 ఏళ్ల క్రితం నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించడంతో పాటు కొత్త మురుగు కాల్వలను నిర్మించేందుకు అధికారులు, మున్సిపాలిటీ పాలక మండలి సభ్యులు సమగ్రంగా సర్వే నిర్వహించారు. రెండు రోజుల క్రితం అధికారులు, మున్సిపాలిటీ పాలక మండలి సభ్యులతో ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ సమీక్షించారు. పట్టణంలోని పురాతన డ్రైనేజీలను ఆధునీకరించడం కోసం డీపీఆర్‌లు తయారు చేయాలని ఆదేశించారు. దీంతో పాలక మండలి సభ్యులు, అధికారులు గురువారం పట్టణంలోని జఫర్‌గఢ్‌-వర్ధన్నపేట రహదారి, ఖమ్మం-వరంగల్‌ జాతీయ రహదారి వెంట ఉన్న పురాతన డ్రైనేజీలను కొలతలు వేశారు. అలాగే, పట్టణంలోని అన్ని వీధుల్లో మురుగు కాల్వలు నిర్మించేందుకు అధికారులు సర్వే చేశారు. పట్టణానికి రెండు వైపులా ఆకేరు, సంగెం వాగులు ఉండడంతో వాగు సమీపం వరకూ డ్రైనేజీల నీరు వెళ్లేలా అధికారులు నిర్మాణాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పురాతన డ్రైనేజీ కావడంతో మురుగునీరు నిలుస్తుండడం వల్ల పట్టణ ప్రజలు అపరిశుభ్ర వాతావరణంతో ఇబ్బందులు పడుతున్నారు. పట్టణ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రూ. 30 కోట్ల నిధులు మంజూరు చేయడంతో మూడు నెలల్లో పనులు పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆంగోతు అరుణ, వైస్‌ చైర్మన్‌ కోమాండ్ల ఎలేందర్‌రెడ్డి, కమిషనర్‌ గొడిశాల రవీందర్‌, పాలక మండలి సభ్యులు రాజమణి, రామకృష్ణ, సుధీర్‌, రవీందర్‌, అనిత, సుజాత పాల్గొన్నారు.

VIDEOS

logo