గురువారం 25 ఫిబ్రవరి 2021
Warangal-rural - Jan 20, 2021 , 02:10:07

దళిత రైతు కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటు

దళిత రైతు కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటు

  • పాడి గేదెల ఎంపికకు నాగపూర్‌ టూర్‌
  • ఆర్థిక స్వావలంబన దిశగా సర్కారు చర్యలు
  • జడ్పీఫ్లోర్‌ లీడర్‌ పెద్ది స్వప్న

 నర్సంపేట, జనవరి 19: రాష్ట్రంలోనే మొదటిసారిగా నర్సంపేట నియోజకవర్గంలోని దళిత రైతు కుటుంబాలకు పాడి గేదెల పంపిణీ పథకాన్ని అమలు చేస్తున్నట్లు జడ్పీఫ్లోర్‌ లీడర్‌ పెద్ది స్వప్న అన్నారు. నియోజకవర్గంలోని పాడి రైతులు మంగళవారం ఆర్టీసీ బస్సులో మహారాష్ట్రలోని నాగపూర్‌కు బయల్దేరారు. ఈ సందర్భంగా ఆమె జెండా ఊపి బస్సును ప్రారంభించి మాట్లాడారు. గతంలోనే పాడి గేదెల పంపిణీ పథకానికి పైలట్‌ ప్రాజెక్టుగా నర్సంపేట ఎంపికైందన్నారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కృషి ఫలితంగా ఇప్పుడు నియోజకవర్గానికి పాడి గేదెలు అందుతున్నాయని వివరించారు. 

గేదెలను ఎంపిక చేసుకునే వెసులుబాటు

సొంత ఖర్చులతో ప్రభుత్వమే రైతులను తీసుకెళ్లి స్వయంగా పాడి గేదెలను ఎంపిక చేసుకునే వీలు కల్పించిందన్నారు. నియోజకవర్గానికి 658 యూనిట్లు మంజూ రు కాగా, మొదటి విడుతలో చెన్నారావుపేట మండలంలో 100 మంది లబ్ధిదారులకు అందిస్తామన్నారు. ఒక్కో కుటుంబానికి నాలుగు గేదెల చొప్పున ఒక్కో గేదెకు రూ. లక్ష.. మొత్తం రూ. 26.32 కోట్ల విలువైన గేదెలను ప్రభు త్వం అందిస్తున్నదని వివరించారు. గేదెల సంరక్షణ, పాలఉత్పత్తి, విక్రయాలపై ఉచితంగా శిక్షణ ఇస్తున్నామన్నారు.

లబ్ధిదారులపై భారం పడకుండా..

లబ్ధిదారులపై ఎలాంటి భారం పడకుండా 60 శాతం సబ్సిడీ ఇచ్చి.. పాల ఉత్పత్తి అమ్మకానికి సంబంధించి విజయ డెయిరీ అనుసంధానంతో లీటర్‌కు అదనంగా రూ. 4 చొప్పున ఉత్పత్తిదారులకు చెల్లిస్తారని పెద్ది స్వప్న తెలిపారు. బ్యాంకుల చుట్టూ తిరిగే బాధ లేకుండా ఎమ్మెల్యే పెద్ది చొరవ తీసుకుని విజయ డెయిరీతో ఒప్పందం చేసి 40 శాతం రుణం మంజూరు చేశారని తెలిపారు. నిరుపేద దళిత కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే ధ్యేయంగా పాడి గేదెల పంపిణీ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందన్నారు. కార్యక్రమంలో నర్సంపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుంటి రజినీకిషన్‌, జడ్పీటీసీ పత్తినాయక్‌, ఎంపీపీ విజేందర్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బాల్నె వెంకన్న, సర్పంచ్‌ మల్లయ్య పాల్గొన్నారు.

VIDEOS

logo