భక్త జన జాతర

- కిటకిటలాడిన కొత్తకొండ, ఐనవోలు ఆలయాలు
- కనుల పండువగా త్రిశూలస్నానం
- ఆకట్టుకున్న వీరశైవుల విన్యాసాలు
- నేడు అగ్నిగుండాలు, స్వామి వారి గ్రామ పర్యటన
- ముగియనున్న వీరన్న బ్రహ్మోత్సవాలు
- పట్నాలు, బోనాలతో సందడిగా మల్లన్న సన్నిధి
భక్తజనంతో జాతరలు పోటెత్తాయి. ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలిరావడంతో కొత్తకొండ వీరభద్రస్వామితో పాటు ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయాలు సందడిగా మారాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా వీరన్న సన్నిధిలో త్రిశూలస్నానం కనులపండువగా నిర్వహించగా వీరశైవుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. సోమవారం అగ్నిగుండాలు, స్వామివారి గ్రామ పర్యటనతో కొత్తకొండ బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. అలాగే మల్లన్న ఆలయంలో ఒగ్గు పూజారులు పట్నాలు వేయగా భక్తులు బోనం వండి నైవేద్యం సమర్పించారు.
- భీమదేవరపల్లి/ఐనవోలు, జనవరి 17
భీమదేవరపల్లి, జనవరి 17 : కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం త్రిశూలస్నానం కనులపండువగా జరిగింది. గణపతిపూజ, గవ్యాంతం, మహాపూర్ణాహుతి, కలశోద్వాసన, మహాకుంభాభిషేకం, అవభృతం తదితర కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. ఆ తర్వాత స్వామివారి ఉత్సవమూర్తులను పల్లకీలో తీసుకురాగా, ఆలయ ఈవో రజినీకుమారి, ప్రధాన అర్చకులు తాటికొండ వీరభద్రయ్య, మాజీ వైస్ ఎంపీపీ మాడిశెట్టి కుమారస్వామి, ఉపసర్పంచ్ సిద్దమల్ల కృష్ణ, ఆలయ మాజీ చైర్మన్ మారుపాటి మహేందర్‌రెడ్డి కలశాలను ఎత్తుకున్నారు. మంగళవాయిద్యాల మధ్య ఏపీలోని కర్నూలు జిల్లా రాయదుర్గానికి చెందిన వీరశైవులు వీరభద్ర పల్లెరం చేశారు. వీరశైవులు విన్యాసాలు చేయగా, ఉత్సవమూర్తులను, త్రిశూల కలశాలను పవిత్ర కోనేరు వద్దకు తీసుకెళ్లి స్నపనం నిర్వహించారు. అనంతరం భక్తులు పెద్ద ఎత్తున కోనేటిలో పవిత్రస్నానాలు ఆచరించారు.
కిక్కిరిసిన క్యూలైన్లు
ఆదివారం సెలవుదినం కావడంతో స్వామివారి బ్రహ్మోత్సవాలకు భక్తజనం పోటెత్తారు. ఆలయంలో క్యూలైన్లు కిక్కిరిసి పోయాయి. రద్దీ ఎక్కువ కావడంతో వీరభద్రుడి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి వేచిచూశారు. భక్తులు కోడెలు కట్టి ప్రదక్షిణలు చేశారు. గుమ్మడికాయ మొక్కులు చెల్లించారు. గండాలు పోవాలని గండదీపం వద్ద నూనె పోశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో సర్కస్, రంగుల రాట్నంతో పాటు ఆలయ పరిసరాలు, దుకాణాలు సందడిగా మారాయి.
నేటితో ముగియనున్న ఉత్సవాలు..
జాతరలో భాగంగా సోమవారం వేకువజామున అగ్నిగుండాలు నిర్వహిస్తారు. శరభ శరభ.. అంటూ భక్తులు నిప్పుకణికలపై భక్తిపారవశ్యంతో నడుస్తారు. సాయంత్రం స్వామి వారి గ్రామ పర్యటనతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఈవో తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో భాస్కర్, ఎంపీవో భాస్కర్, టీఆర్ఎస్ నాయకులు ఎర్రోజు వినయ్, అర్చకులు మొగిలిపాలెం రాంబాబు, తాటికొండ వినయ్, రాజయ్య, రమేశ్, సిబ్బంది జగన్, హంసారెడ్డి, సందీప్ పాల్గొన్నారు.
ఐనవోలులో..
ఐనవోలు జనవరి 17 : ఐలోని మల్లన్న సన్నిధి భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరాగా, మేలుకొలుపు తర్వాత ఉదయం 6గంటల నుంచే స్వామివారి దర్శనం ప్రారంభమైంది. ఆలయ అర్చకులు మల్లన్నకు విశేష అభిషేకాలు, కల్యాణం, రుద్రాభిషేకాలు నిర్వహించారు. భక్తులు పట్నాలు వేసి బోనం వండి స్వామి వారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఒగ్గు పూజారులు పట్నాలు వేసి కోరిన కోర్కెలు తీర్చాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు భక్తులు ఒడిబియ్యం, వస్ర్తాలు, ముత్తయిదు సామగ్రిని ముట్టజెప్పారు. మరికొందరు రథ సేవ నిర్వహించారు. రథంలో ఉత్సవ విగ్రహాలను పెట్టి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. భక్తుల కోసం చైర్మన్ మునిగాల సంపత్‌కుమార్, ఈవో నాగేశ్వర్రావు, డైరెక్టర్లు, ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు.