ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Warangal-rural - Jan 18, 2021 , 04:32:05

ఇంటింటికీ గ్యాస్‌!

ఇంటింటికీ గ్యాస్‌!

  • నెరవేరనున్న నర్సంపేటవాసుల కల
  • రాష్ట్రంలోనే మొదటిసారిగా ఇక్కడే అందుబాటులోకి..
  • చకచకా సాగుతున్న పైప్‌లైన్‌ నిర్మాణ పనులు
  • కాలుష్య రహితంగా మారనున్న పట్టణం

నర్సంపేట పట్టణం కాలుష్య రహితంగా మారనుంది. మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటింటికీ గ్యాస్‌ సరఫరా కల నెరవేరే సమయం ఆసన్నమైంది. పీఎన్‌జీ, సీఎన్‌జీ గ్యాస్‌ సరఫరా రాష్ట్రంలోనే మొదటిసారిగా నర్సంపేట పట్టణ ప్రజలకు అందుబాటులో రానుంది. పట్టణంలోని సర్వాపురం శివారులో గ్యాస్‌ పైప్‌లైన్‌ నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి.

- నర్సంపేట రూరల్‌, జనవరి 17

వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేట పట్టణం సర్వాపురం గ్రామ శివారు నర్సంపేట-కొత్తగూడ ప్రధాన రహదారి సమీపంలో పీఎన్‌జీ (పైప్డ్‌ నేచురల్‌ గ్యాస్‌), సీఎన్‌జీ (కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌) పైప్‌లైన్‌ వేస్తున్నారు. 2019 సెప్టెంబర్‌ నెలలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పీఎన్‌జీ, సీఎన్‌జీ కంపెనీ అధికారులతో కలిసి ఈ పైప్‌లైన్‌ నిర్మాణ పనులను ప్రారంభించారు. గత 15 నెలలుగా పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. దాదాపు 60 శాతం పను లు పూర్తయ్యాయి. సర్వాపురం, ద్వారకపేట గ్రామాల మీదుగా పట్టణంలోని పలు వార్డు ల్లో గ్యాస్‌తోపాటు ఇంటర్నెట్‌ సౌకర్యం కోసం ప్రధాన రహదారుల్లో పైప్‌లైన్‌ నిర్మాణ పనులు పూర్తికావొచ్చాయి. ఇంకా కొన్ని వార్డుల్లో పనులు జరుగాల్సి ఉంది. గ్యాస్‌ పైప్‌లైన్‌తోపాటు ఇంటర్నెట్‌ కోసం ప్రత్యేక పైప్‌లైన్‌ వేస్తున్నారు. కలెక్టర్‌ హరిత, ఎమ్మెల్యే పెద్ది సంబంధిత అధికారులతో కలిసి వీటి నిర్మాణ పనులను పరిశీలిస్తూ, అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్‌కు సూచనలు చేస్తున్నారు. 

నర్సంపేట పట్టణ ప్రజలకు ఇప్పటికే ఇంటింటికీ నల్లా సౌక ర్యం ఉంది. అతి త్వరలోనే గ్యాస్‌, ఇంటర్నెట్‌ సౌకర్యం కూడా అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలో మొట్ట మొదటిసారిగా ఈ విధానం నర్సంపేటలో అమలు కావడం పట్టణ ప్రజలు అదృష్టంగా భావిస్తున్నారు. డిస్ట్ట్రిబ్యూషన్‌, స్టోరేజీ సెంటర్‌ పనులు పూర్తికాగా, ప్రస్తుతం పైప్‌లైన్‌ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. 

పట్టణంలోని 24 వార్డుల్లో అవసరముండి దరఖాస్తు చేసుకున్న ప్రతి లబ్ధిదారుడికి అండర్‌ గ్రౌండ్‌ పైప్‌లైన్‌ ద్వారా నేరుగా ఇంట్లో ఉన్న స్టౌవ్‌కు కనెక్షన్‌ ఇవ్వ నున్నారు. గ్యాస్‌ వాడకాన్ని బట్టి వినియోగదారులు బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ గ్యాస్‌ ప్రాజెక్టు కోసం గతంలో జాతీయ స్థాయి లో టెండర్లు పిలువగా రాష్ట్రంలో మెగా కంపెనీ వారు దక్కించుకున్నారు.

కాలుష్యరహిత పట్టణంగా మార్చడమే లక్ష్యం

నర్సంపేట పట్టణాన్ని కాలుష్యరహితంగా మార్చడమే ప్రధాన లక్ష్యం. రాష్ట్రంలోనే మొదటిసారిగా పీఎన్‌జీ, సీఎన్‌జీ నర్సంపేట పట్టణ ప్రజలకు అందుబాటులోకి రానుంది. అవసరముండి దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే అండర్‌ గ్రౌండ్‌ పైప్‌లైన్‌ ద్వారా నేరుగా స్టౌవ్‌కు కనెక్షన్‌ ఇస్తారు.

- పెద్ది సుదర్శన్‌రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే

VIDEOS

logo