గురువారం 04 మార్చి 2021
Warangal-rural - Jan 17, 2021 , 02:02:03

శ్రీరామ రక్ష

శ్రీరామ రక్ష

  • యాసంగి సాగుకు ఎస్సారెస్పీ జలాలు
  • నీటితో కళకళలాడుతున్న కెనాల్‌
  • హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు

దుగ్గొండి, జనవరి 16: యాసంగి సాగుకు సమృద్ధిగా సాగునీరు అందించాలనే సంకల్పంతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు జలాలను డీబీఎం-38 ద్వారా మండలానికి నీటిని విడుదల చేయడంతో రైతులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఢోకా లేదంటూ కాల్వ ఆయకట్టు కింద వరి సాగు చేసిన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు సుకినె రాజేశ్వర్‌రావు ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పటాకులు కాల్చి.. మిఠాయిలు పంచిపెట్టారు. మూడు రోజుల క్రితం గీసుగొండ మండలం కోనాయిమాకులలోని ఎస్సారెస్పీ మెయిన్‌ కాల్వ వద్ద డీబీఎం-38కు నర్సంపేట ఎమ్మెల్యే పెది సుదర్శన్‌రెడ్డి నీటిని విడుదల చేయడంతో గోదావరి జలాలు మండలానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా మండలంలోని నాచినపల్లి బిక్కాజిపల్లి, మహ్మదాపురం, మర్రిపల్లి, రేఖంపల్లి, వెంకటాపురం, చంద్రాయ్యపల్లి, గుడ్డేలుగులపల్లి, మల్లంపల్లి  గ్రామాల రైతులు ఆనందంతో మిఠాయిలు పంచారు. ఎస్సారెస్పీ జలాలను డీబీఎం-38 ద్వారా మండలానికి విడుదల చేయడంతో యాసంగిలో వేసిన రెండో పంటకు సమృద్ధిగా నీరు అందుతుందని ఆర్‌బీఎస్‌ డైరెక్టర్‌ కర్రు రమేశ్‌ తెలిపారు.

గలగలా.. గోదావరి!

శాయంపేట: యాసంగి సాగుకు శ్రీరాంసాగర్‌ జలాలు శాయంపేట మండలానికి చేరుకున్నాయి. డీబీఎం-31 ప్రధాన కాల్వకు చేరి మూడు రోజులుగా గలగలా పారుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డీబీఎం ప్రధాన కాల్వ నుంచి 1ఆర్‌ ఉప కాల్వ వరకూ వందలాది ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. ఇప్పటికే వరినార్లు పోసుకుని నాట్లకు సిద్ధంగా ఉన్న రైతులకు ఎస్సారెస్పీ జలాలు ఎంతో ఊరటనిచ్చాయి. సాగర్‌ జలాలు ఓ పక్క చెరువులను నింపుతూనే.. మరోపక్క పొలాలను తడుపుతున్నాయి. దీంతో వరి నాట్లను రైతులు వేగవంతం చేస్తున్నారు. కొన్నేళ్లుగా తెలంగాణ సర్కారు యాసంగికి ఎస్సారెస్పీ నీటిని అందిస్తుండడంతో బీడు భూములను సైతం రైతులు సాగులోకి తెచ్చారు. గతంలో బావులు, నీరున్నచోట మాత్రమే యాసంగిలో నాట్లు వేసేవారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎండకాలంలోనూ పొలాలన్నీ పచ్చగా మారుతున్నాయి.


VIDEOS

logo