మెరుగైన వైద్యానికి హోమియోపతి

- అల్లోపతికి దీటుగా వైద్యం
- పలు రకాల వ్యాధులకు అందుబాటులో చికిత్స
- ఆసక్తి చూపుతున్న ప్రజలు
వైద్యశాస్త్రంలో రోగాలకు పలు రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో హోమియోపతి వైద్యవిధానం ఒకటి. అల్లోపతి వైద్యానికి దీటుగా ఈ హోమియోపతి వైద్యం కూడా ప్రాచుర్యంలో ఉంది. చాలా కాలం నుంచే హోమియోపతి చికిత్సా విధానం మన దేశంలో అందుబాటులో ఉంది. ప్రస్తుతం హోమియోపతిలో మెరుగైన వైద్యం అందుతుండడంతో ప్రజలు దీనిపై ఆసక్తి చూపుతున్నారు. హోమియోపతిలో కీళ్లవాతం, పక్షవాతం, తెల్లమచ్చలు, అర్షమొలలు, అలెర్జీస్, సోబి మచ్చలు, హిమరైస్, జుట్టు రాలడం, డయాబెటిస్, స్త్రీలలో గర్భసంచి వాపు, తెల్లబట్ట సమస్యలు, కిడ్నీల్లో రాళ్లు వంటి పలు రకాల వ్యాధులకు మెరుగైన వైద్యం అందుబాటులో ఉంది. రోగులకు వ్యాధి లక్షణాల ఆధారంగానే హోమియోపతి వైద్యం అందిస్తారు. ఈ చికిత్సా విధానంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు అంటూ ఏమీ ఉండవు. సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉండవు. అందుకే ఈ వైద్య చికిత్సను అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం హోమియోపతి వైద్యశాలలనుప్రారంభించింది. ప్రజలకు ఉచితంగా వైద్య సేవలను అందిస్తున్నది.
- వేలేరు
అందుబాటులో హోమియోపతి వైద్యం
వేలేరు మండల కేంద్రంలోని ప్రభుత్వ హోమియోపతి వైద్యశాల అల్లోపతికి దీటుగా వైద్యసేవలు అందిస్తున్నది. దీన్ని నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో 2008లో ఇక్కడ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి మండల ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నది. పలు రకాల రోగాలకు హోమియోపతి విధానంలో మెరుగైన చికిత్సలు ఉన్నాయి. దీంతో మండలంలోని 14 గ్రామాల ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడకు వచ్చి, హోమియోపతి చికిత్స పొందుతున్నారు.
మెరుగైన వైద్యం అందిస్తున్నాం
పలు రకాల వ్యాధులకు హోమియోపతి విధానంలో మెరుగైన చికిత్స అందిస్తున్నాం. వేలేరులో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. రోజూ 15 నుంచి 25 మంది వరకు ఓపీలో వైద్యసేవలు పొందుతున్నారు. చర్మవ్యాధులు, కిడ్నీలో రాళ్లు వచ్చిన వారు, కీళ్ల వాతం ఉన్నవారు ఎక్కువగా ఈ హోమియోపతి చికిత్స తీసుకోవడానికి వస్తున్నారు.
- మమత, హోమియోపతి వైద్యురాలు
కీళ్ల నొప్పులు తగ్గినయ్
హోమియోపతి చికిత్సతో నా కీళ్ల నొప్పులు తొందరగా తగ్గినయ్. కొన్ని రోజులుగా కీళ్ల నొప్పులు, నడుం నొప్పితో బాధపడుతున్నా. నెల రోజుల నుంచి హోమియోపతి మందులు వాడుతున్నా. డాక్టర్ ఆరు నెలలు మందులు వాడాలన్నారు. కానీ, నెల రోజులకే నొప్పులు తగ్గాయి.
- పొడిశెట్టి ప్రభుదాసు, దేవునూరు