సోమవారం 08 మార్చి 2021
Warangal-rural - Jan 16, 2021 , 01:38:21

వైభవంగా సంక్రాంతి వేడుకలు

వైభవంగా సంక్రాంతి వేడుకలు

  • ముత్యాల ముగ్గులతో మెరిసిన లోగిళ్లు

  • పతంగుల పంపిణీ.. పశువులకు పూజలు

ఖిలావరంగల్‌, జనవరి 15 : సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే మకర సంక్రాంతి వేడుకలను జిల్లాలో వైభవంగా జరుపుకున్నారు. ముత్యాల ముగ్గులు, నట్టింట బొమ్మల కొలువులు, పిండి వంటల ఘుమఘుమలు, గగనాన విహరించే పతంగులతో  పండుగ సందడి నెలకొంది. సంక్రాంతి పర్వదినాన్ని గుర్తు చేసే రథం ముగ్గులు వేసి ఆడపడుచులు సంబురపడ్డారు. ముత్యా ల ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలను పెట్టి వాటిపై నవధాన్యాలు, పండ్లు పోసి ప్రదక్షిణ చేశారు. పలు ప్రాంతాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించడంతోపాటు చిన్నారులకు పతంగులను పంపిణీ చేశారు. 

 గంగిరెద్దుల విన్యాసాలు..

ఉత్తరాయణ పుణ్యకాలంలో దేవతలు దివి నుంచి భువికి దిగి వస్తారని పురాణాలు, శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఇదేక్రమంలో దేవతలు ఇళ్లలోకి వస్తారని హిందువుల నమ్మకం. దీంతో ఇళ్లను సర్వాంగ సుందరంగా అలంకరించారు. గంగిరెద్దులను శివుడి నంది స్వరూపాలుగా, హరిదాసును విష్ణు స్వరూపంగా భావించి వారికి ధాన్యాన్ని దానంగా సమర్పించారు. హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు ప్రతిఒక్కరినీ ఆకట్టుకున్నాయి. సాయంత్రం చిన్నాపెద్దా తేడా లేకుండా   పతంగులను ఎగురవేసి సంబురాలు చేసుకోవడం ప్రతి గల్లీలో కనిపించింది. 

 రద్దీగా మారిన ఆలయాలు..

ఉత్తరాయణ పుణ్యకాలంలో నదీస్నానాలు, సముద్రస్నానాలతోపాటు ఇష్ట దేవతలను దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో ఆలయాలకు భక్తుల తాకిడి పెరిగింది. దీంతో జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేశారు. మరికొంత మంది ఎడ్ల బండి ద్వారా జాతరలకు వెళ్లారు.

రైతులు కొలిచే కనుమ పండుగ

కనుమ అంటే పశువు అని అర్థం. సంక్రాంతి పండుగను సుఖ సంతోషాలతో రైతులు జరుపుకోవడం వెనుక పశువుల కష్టం ఉంటుంది. కావున రైతులు పశువులను కడిగి పసుపు, కుంకుమతో అలంకరించారు. రోజంతా పశువులతో పనిచేయించకుండా విశ్రాంతినిచ్చారు. అలాగే, కనుమ రోజున పితృదేవతలకు పూజలు కూడా చేశారు. 

  పిండి వంటల తయారీ

సంక్రాంతి వేడుకులకు వారం ముందు నుంచే పిండి వంటలు తయారు చేయడంలో మహిళలు నిమగ్నమయ్యారు. సకినాలు, గారెలు, మడుగులు, అరిసెలు, మురుకులు, పూస చేసుకున్నారు. ముందస్తుగా తయా రు చేసుకున్న పిండి వంటలను తమ బంధువులు, మిత్రులకు పంపించి ఆత్మీయతను చాటుకున్నారు. 

రామన్నపేటలో ముగ్గుల పోటీలు..

మట్టెవాడ :  వరంగల్‌ రామన్నపేటలోని  మోక్షారామం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గురువారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఫౌండేషన్‌ ద్వారా ముగ్గులకు అవసరమైన రంగులు పంపిణీ చేశారు. ఫౌండేషన్‌ ప్రతినిధులు ముగ్గులను  పరిశీలించి విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.  

20వ డివిజన్‌లో..

కరీమాబాద్‌ : సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మహిళలు ఇళ్ల ఎదుట ముగ్గులు వేశారు. కార్పొరేటర్‌ మేడిది రజిత తమ పిల్లలతో కలిసి ముగ్గులు వేశారు. 20వ డివిజన్‌ శాంతినగర్‌ సేవా సమితి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు టీఆర్‌ఎస్‌ నాయకుడు ముష్కమల్ల సుధాకర్‌ బహుమతులు అందజేశారు. శాంతినగర్‌ సేవా సమితి సభ్యులు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 

 జై భారత్‌ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో..

కాశీబుగ్గ : లేబర్‌కాలనీలోని అమరవీరుల స్తూపం, అబ్బనికుంట, గాంధీనగర్‌, శాలినీనగర్‌, ఎస్‌ఆర్‌టీ, టీఆర్‌టీ, చెన్నారెడ్డి కాలనీల్లో జై భారత్‌ యూత్‌ అసోసియేషన్‌ బాధ్యులు ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. జై భారత్‌ యూత్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆరుగొండ అరుణ్‌ ప్రధాన కార్యదర్శి కొడిమల అభిలాశ్‌, వస్కుల బాబు, మామిడాల రమేశ్‌బాబు, డాక్టర్‌ మోహన్‌బాబు, వీరగోని మనోహర్‌, ఏకాంబరం పాల్గొన్నారు. 

 సంస్కృతీసంప్రదాయాలు కాపాడాలి..

హసన్‌పర్తి : సంస్కృతీసంప్రదాయాలు కాపాడాలని టీఆర్‌ఎస్‌ 56వ డివిజన్‌ అధ్యక్షుడు పావుశెట్టి శ్రీధర్‌ అన్నారు. మండల కేంద్రంలోని గాంధీనగర్‌లో గురువారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు శ్రీధర్‌ బహుమతులు ప్రదానం చేశారు. మార్కెట్‌ డైరెక్టర్‌ చకిలం రాజేశ్వర్‌రావు, డీకొండ భిక్షపతి, నల్ల కిరణ్‌, ఓంప్రకాశ్‌, అరవింద్‌ పాల్గొన్నారు. అదేవిధంగా రాజరాజేశ్వర దేవస్థానంలో విప్రో కంపెనీ, లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. విప్రో కంపెనీ సేల్స్‌ మేనేజర్‌ మోహన్‌, సంతూర్‌ డిస్ట్రిబ్యూటర్‌ కట్కూరి కిరణ్‌, లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు తోట సంపత్‌, డాక్టర్‌ అజిత్‌, బొల్లం శ్రీను, యాదగిరి దేవస్థానం చైర్మన్‌ చంద్రమోహన్‌ పాల్గొన్నారు.

కొత్తవాడలో పతంగుల పంపిణీ

పోచమ్మమైదాన్‌ : శ్రీనన్న కాకతీయ జనసైన్యం అధ్యక్షుడు జమన్‌జ్యోతి ఈశ్వర్‌ ఆధ్వర్యంలో కొత్తవాడలో వందమంది చిన్నారులకు పతంగులు పంపిణీ చేశారు. స్థానిక మాజీ కార్పొరేటర్‌, కుడా అడ్వైజర్‌ కమిటీ మెంబర్‌ యెలుగం శ్రీనివాస్‌, చేనేత సంఘాల ప్రతినిధులు దువ్వల రాజేందర్‌, అడిగొప్పుల సంపత్‌, ఎన్‌ఎన్‌ఆర్‌ సేవా సమితి అధ్యక్షుడు హరికృష్ణ పటేల్‌, ఉపేంద్ర, ఆడెపు నాగరాజు, రాధిక, నంబి మురళి, బొందుగుల ప్రశాంత్‌, తుల రాజమల్లు, రాజయ్య, సాంబయ్య, రఘుపతి పాల్గొన్నారు.

  విశ్వనాథకాలనీలో ..

 ఖిలావరంగల్‌ : శంభునిపేట విశ్వనాథకాలనీలో అభయాంజనేయస్వామి ఆలయ చైర్మన్‌ కర్నె రవీందర్‌ పిల్లలకు పతంగులు పంపిణీ చేశారు. అలాగే, 18వ డివిజన్‌ శివనగర్‌లో కార్పొరేటర్‌ శామంతుల ఉషశ్రీ, శ్రీనివాస్‌ పతంగులు ఎగురవేశారు.  

 కాశీబుగ్గలో..

కాశీబుగ్గ : వివేకానంద విద్యా కేంద్రం ఆధ్వర్యంలో కాశీబుగ్గలో చిన్నారులకు పతంగులు పంపిణీ చేశారు. అలాగే, శ్రీకాశీవిశ్వేశ్వర రంగనాథస్వామి దేవాలయ మైదానంలో పతంగుల పోటీలు నిర్వహించారు. 

  అభయాంజనేయస్వామి ఆలయంలో పూజలు

 గ్రేటర్‌12వ డివిజన్‌ ఎన్టీఆర్‌నగర్‌లోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అభివృద్ధి కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో వచ్చి గోమాతను పూజించి, మంగళహారతులతో స్వాగతం పలికారు. ప్రధాన అర్చకుడు తాళ్లూరు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.  

ఎల్కతుర్తిలో..

ఎల్కతుర్తి : సంక్రాంతి వేడుకలను మండల ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచే ఇండ్ల ఎదుట మహిళలు రంగురంగుల ముగ్గులు మహిళలు వేశారు. భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి జాతరకు భారీగా ఎడ్లబండ్లలో తరలివెళ్లారు. పిండి వంటలు చేసుకుని ఆరగించారు. సంక్రాంతి సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

  కమలాపూర్‌లో..

కమలాపూర్‌  : మండల కేంద్రం, ఉప్పల్‌, శనిగరం, గూడూరు, అంబాల, మర్రిపెల్లిగూడెం, వంగపల్లి, భీంపల్లి, కన్నూరు, శ్రీరాములపల్లి, కానిపర్తి, శంభునిపల్లి, నేరెళ్ల తదితర గ్రామాల్లో సంక్రాతి  వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఇండ్ల   వాకిళ్లలో రంగు రంగుల ముగ్గులు వేశారు. గొబ్బెమ్మలు పెట్టి నవధాన్యాలు పోశారు. ఉదయం నుంచి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. పంగిడిపల్లి గ్రామంలో మన గ్రోమోర్‌ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.   

VIDEOS

logo