శుక్రవారం 05 మార్చి 2021
Warangal-rural - Jan 16, 2021 , 01:38:19

ఘనంగా లింగగిరి జాతర

ఘనంగా లింగగిరి జాతర

  • స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్న భక్తులు
  • ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
  • జాతరకు పోటెత్తిన భక్తజనం

చెన్నారావుపేట, జనవరి 15 : ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా మండలంలోని లింగగిరి గ్రామంలో నిర్వహించే శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి జాతరకు భక్తులు పోటెత్తారు. గురు, శుక్రవారాల్లో స్వామికి ప్రధాన అర్చకుడు సముద్రాల సుదర్శనాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో గుట్ట పైకి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు.  మండలంలోని 30 గ్రామాల ప్రజలే కాకుండా నెక్కొండ, గూడూరు, ఖానాపురం, దుగ్గొండి, నల్లబెల్లి, పర్వతగిరి, సంగెం, కేసముద్రం, నర్సంపేట తదితర మండలాల నుంచి కూడా ప్రజలు, భక్తులు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, ఆటోలు ఇతర వాహనాల్లో పెద్ద ఎత్తున తరలివచ్చారు. వాహనాలతో గుట్టచుట్టూ ప్రదక్షిణలు నిర్వహించారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి జాతరకు హాజరై స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.  ఆయన వెంట నర్సంపేట ఏసీపీ ఫణీందర్‌, జడ్పీటీసీ బానోత్‌ పత్తినాయక్‌, చెన్నారావుపేట సొసైటీ చైర్మన్‌ ముద్దసాని సత్యనారాయణరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బాల్నె వెంకన్న, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు కుండె మల్లయ్య, టీఆర్‌ఎస్‌ మండల నాయకుడు కంది కృష్ణచైతన్య, మాజీ జడ్పీటీసీ జున్నుతుల రాంరెడ్డి,  సర్పంచ్‌ మాదారపు భాస్కర్‌, ఎంపీటీసీ పర్కాల లక్ష్మీ, రాజన్న, ఉప సర్పంచ్‌ బూర్గు రాజశేఖర్‌, ఆలయ ఇన్‌చార్జి రాకం సాంబయ్య ఉన్నారు. కాగా, జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నెక్కొండ సీఐ పుప్పాల తిరుమల్‌ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. 

ఫంక్షన్‌హాల్‌ ప్రారంభం 

లింగగిరి గ్రామంలో చెన్నకేశవ స్వామి గుట్ట పక్కన అదే గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఆలయ నిర్మాణ దాత దొడ్డ మోహన్‌రావు రూ.50లక్షలతో నూతనంగా నిర్మించిన ఫంక్షన్‌ హాల్‌ను ఎమ్మె ల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామస్తుల కోసం దొడ్డ మోహన్‌రావు గతంలో రూ.2కోట్లతో  గుడిని నిర్మించారన్నారు. ఇప్పుడు రూ.50లక్షలతో ఫంక్షన్‌హాల్‌ను నిర్మించడం అభినందనీయమన్నారు. దీన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

VIDEOS

logo