బుధవారం 27 జనవరి 2021
Warangal-rural - Jan 10, 2021 , 01:32:10

మహిళలకు భరోసా..

మహిళలకు భరోసా..

  • జిల్లాలో కొత్త ఎస్‌హెచ్‌జీలకు శ్రీకారం
  • ఓటరు జాబితా ఆధారంగా సర్వే
  • కొత్త సంఘాలకు రూ.60వేల గ్రాంటు

శాయంపేట, జనవరి 9 : మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తెలంగాణ సర్కార్‌ చర్యలు చేపట్టింది. పేదరికాన్ని నిర్మూలించేందుకు స్వయం సహాయక సంఘా(ఎస్‌హెచ్‌జీ)లను విస్తృతం చేస్తున్నది. అర్హురాలైన ప్రతి మ హిళ సంఘంలో ఉండేలా రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. సం ఘాల ద్వారా రుణాలు అందించి చిరు వ్యాపారాలతో పాటు మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా తోడ్పాటు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఓటరు జాబితా ఆధారంగా 18 నుంచి 58 ఏండ్ల మహిళలపై సర్వే చేపట్టారు. ఇప్పటికే జిల్లాలో 13,749 ఎస్‌హెచ్‌జీలు ఉన్నాయి. వీటి ల్లో లక్షా 55వేల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. 58 ఏండ్లకు పైబడిన, మృతిచెందిన, ఇతర జిల్లాల్లో ఉన్నవారు పోను ఇంకా 7,298 మంది సంఘాల్లో లేరని గుర్తించి వారిని చేర్పించేందుకు చర్యలు చేపట్టారు. ఇలా కొత్త సంఘాల ఏర్పాటు ప్రక్రియను ఈ నెలాఖరుకు పూర్తి చేయనున్నారు. అయితే ఈసారి కొత్త సంఘాలకు ప్రభుత్వం రూ.60 వేలు గ్రాంటు ఇవ్వనుంది. 10 నుంచి 15 మందితో ఉండే సంఘాలకు బ్యాంకు లింకేజీ కింద రూ.7.50లక్షల రుణం అందిస్తున్నారు. అలాగే స్త్రీనిధి నుంచి ఏగ్రేడ్‌ అయితే రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు ఒక్కొక్కరికి అప్పుగా ఇస్తున్నారు. ఈ సొమ్ముతో కిరా ణం, పాలవ్యాపారం, వ్యవసాయ మోటర్ల కొనుగోలు, వ్యవసాయ పెట్టుబడులు, పైపులైన్‌, ఫెస్టిసైడ్లు, రకరకాలుగా వినియోగించుకుంటున్నారు. అలాగే ఒక్కొక్కరికి క్యాష్‌ క్రెడిట్‌ లిమిట్‌ కింద రూ. లక్ష వరకు ఇస్తున్నారు.  

కొత్తగా 576 ఎస్‌హెచ్‌జీలు..

కొత్త ఎస్‌హెచ్‌జీల ఏర్పాటు ప్రక్రియ జిల్లాలో చురుగ్గా సాగుతోంది. ఈ నెల 6 వరకు 576 కొత్త సంఘాలను ఏర్పాటు చేసి, 5,843 మందిని సభ్యులుగా తీసుకున్నారు. 106 సంఘాలకు ఖాతాలను కూడా తెరిచారు. అలాగే జిల్లాలో మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సెర్ప్‌ ఆధ్వర్యంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. సూపర్‌మార్కెట్‌లు, దాల్‌మిల్లులు, న్యాప్కిన్‌ ఉత్పత్తులు, చిల్లీ పౌడర్‌ తయారీ తదితర యూనిట్లకు ఇప్పటికే ప్రతిపాదనలు పంపించారు. అనుమతులు రాగానే ప్రారంభం కానున్నాయి. 

నెలాఖరుకు కొత్త సంఘాల ఏర్పాటు పూర్తి..

ప్రభుత్వం నిర్దేశించిన మేరకు కొత్త ఎస్‌హెచ్‌జీలను ఏర్పాటు చేస్తున్నాం. ఈ నెలాఖరుకు ప్రక్రియ పూర్తి చేస్తాం. కొత్త సంఘాలకు ఈసారి రూ.60వేలు గ్రాంటుగా అందుతున్నది. దీంతో మరింత ఆర్థిక తోడ్పాటు లభిస్తున్నది. ప్రాసెసింగ్‌ యూనిట్లనూ నెలకొల్పేందుకు ప్రతిపాదనలు పంపించాం. మహిళా సంఘాల బలోపేతానికి ప్రయత్నిస్తున్నాం. రూ. 50లక్షలు గ్రాంటుగా వచ్చాయి. వీటితో మార్కెటింగ్‌ చేసి అన్ని రకాలుగా అభివృద్ధి చెందేలా సెర్ప్‌ కృషి చేస్తున్నది. 

-దయాకర్‌, ఐకేపీ డీపీఎం


logo