శుక్రవారం 15 జనవరి 2021
Warangal-rural - Jan 08, 2021 , 01:04:32

బాల్య వివాహాన్ని ఆపేందుకు వెళ్లిన అధికారుల అడ్డగింత

బాల్య వివాహాన్ని ఆపేందుకు వెళ్లిన అధికారుల అడ్డగింత

  • డీసీ తండాలో ఉద్రిక్తత
  • పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన అధికారులు

వర్ధన్నపేట, జనవరి 7: బాల్యవివాహం ఆపేందుకు వెళ్లిన అధికారులను గిరిజనులు అడ్డుకున్న సంఘటన వర్ధన్నపేట మున్సిపల్‌ పరిధిలోని డీసీతండాలో జరిగింది. తండాలో బాల్య వివాహం జరుగుతుందనే సమాచారంతో జిల్లా సంక్షేమ అధికారి కే చిన్నయ్య, బాలల పరిరక్షణ అధికారి మహేందర్‌రెడ్డి, సీడీపీవో పద్మ, స్థానిక ఐసీడీఎస్‌ సిబ్బంది, బాలల సంరక్షణశాఖ ప్రతినిధులు బుధవారం రాత్రి 11:30 గంటలకు తండాకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న తండాకు చెందిన గిరిజనులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని అధికారుల వాహనాలను తండాలోకి రాకుండా వరంగల్‌-ఖమ్మం జాతీయ రహదారిపై అడ్డుకున్నారు. యువకులు, మహిళలు అధికారులపై దాడి చేసేందుకు సైతం యత్నించారు. వెంటనే సంక్షేమాధికారి చిన్నయ్య స్థానిక ఎస్సైకి సమాచారం ఇవ్వడంతో ఎస్సై వంశీకృష్ణ సిబ్బందితో కలిసి తండాకు వెళ్లారు. అప్పటికే గిరిజనులు అధికారులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొన్నది. కొందరు మద్యం తాగిన వ్యక్తులు అధికారుల వాహనాలను చేతులతో కొట్టడంతో అవి పాక్షికంగా దెబ్బతిన్నాయి. 

సీడీపీవో పద్మపై కూడా దాడి చేసేందుకు యత్నించడంతో పోలీసులు గిరిజనులను హెచ్చరించారు. గొడవ తీవ్రం కానున్నదని గ్రహించిన అధికారులు అర్ధరాత్రి వెనక్కు వచ్చారు. ఈ విషయాన్ని జిల్లా సంక్షేమాధికారి చిన్నయ్య గురువారం ఉదయం కలెక్టర్‌ హరిత, అడిషనల్‌ కలెక్టర్‌ మహేందర్‌రెడ్డికి వివరించినట్లు చెప్పారు. అలాగే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీడీపీవో పద్మ, బాలల పరిరక్షణ అధికారి మహేందర్‌రెడ్డి, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ హేమలత పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తండాలో బాల్య వివాహం జరుగుతున్నదనే పక్కా సమాచారంతో వెళ్లిన తమను గిరిజనులు అడ్డుకుని భయాందోళనకు గురిచేశారని, విచారణ జరిపి బాలిక వివరాలు తీసుకున్నామన్నారు. తండాకు చెందిన 12 ఏళ్ల బాలికకు ఆమె తల్లిదండ్రులు వివాహం జరిపినట్లు నిర్ధారణ అయిందన్నారు. ఈ విషయంపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి వారికి చట్టపరమైన శిక్ష పడేలా చూస్తామని వారు వివరించారు.