మంగళవారం 19 జనవరి 2021
Warangal-rural - Jan 06, 2021 , 01:13:43

శ్రమశక్తి సంఘాల్లో.. మార్పులకు శ్రీకారం

శ్రమశక్తి సంఘాల్లో.. మార్పులకు శ్రీకారం

  • పది కంటే తక్కు సభ్యులు ఉన్న వాటికి స్వస్తి
  • ఉత్తర్వులు జారీ చేసిన గ్రామీణాభివృద్ధి శాఖ

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పని చేస్తున్న శ్రమశక్తి/దివ్యాంగుల సంఘాల్లో మార్పులకు శ్రీకారం చుట్టారు. పది కంటే తక్కువ సభ్యులు(కుటుంబాలు) ఉన్న వాటిని జనరల్‌ శ్రమశక్తి సంఘాల్లోకి మార్చాలని రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్‌ తాజాగా మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ నెల 15లోగా కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. 

- శాయంపేట, జనవరి 5

ఒక్కో శ్రమశక్తి సంఘంలో 20 నుంచి 40 మంది సభ్యులు ఉండాలి. అయితే, సంఘాల్లో పేర్లు నమోదు చేసుకున్న సభ్యుల్లో చాలామంది పనిలోకి రావడం లేదని గుర్తించారు. దీనివల్ల కొన్ని సంఘాల్లో పది కంటే తక్కువ సభ్యులు చేరారు. ఈ నేపథ్యంలో సంఘాలను బలోపేతం చేసేందుకు కూలీలకు వీలుగా మార్పులు చేర్పులకు అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు. కొన్నేండ్లుగా సంఘాల్లో మార్పులు లేకపోవడంతో రాష్ట్రంలో 38,622 శ్రమశక్తి సంఘాల్లో పది కంటే తక్కువ సభ్యులున్నారు. ఈ క్రమంలో వీరు వేరే సంఘాల్లోకి వెళ్లేందుకు, తాత్కాలిక సంఘాల్లో ఉన్న సభ్యులను జనరల్‌ సంఘాల్లోకి వెళ్లేందుకు అవకాశం కల్పించాలని కూలీల నుంచి అభ్యర్థనలు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో శ్రమశక్తి సంఘాల్లో మార్పులకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఇవీ మార్గదర్శకాలు..

ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం.. ప్రస్తుతం జనరల్‌ శ్రమశక్తి సంఘాల్లో ఉండి పది మంది కంటే తక్కువ సభ్యులు ఉన్న సంఘాలకు మాత్రమే మార్పులు, చేర్పులు వర్తిస్తాయని స్పష్టం చేశారు. దీని తర్వాత పది మంది కంటే తక్కువ సభ్యులు ఉన్న శ్రమశక్తి సంఘాల ఉండవు. అందువల్ల సంఘాల్లో ఒక్కరు కూడా తప్పిపోకుండా అందరినీ జనరల్‌ శ్రమశక్తి సంఘాల్లోకి మార్చాలి. తాత్కాలిక శ్రమశక్తి సంఘాల్లో ఉండి ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదు రోజులు పని చేసిన సభ్యులుంటే వారిని కచ్చితంగా జనరల్‌ సంఘంలోకి మార్చాలి. ఒక సంఘంలో 20 మంది సభ్యులకు తగ్గకుండా 40 మంది సభ్యులకు మించకుండా మార్పులు చేర్పులు చేయాలని పేర్కొన్నారు. ఏ శ్రమశక్తి సంఘంలో మార్పులు చేయాలో ఆ సంఘాన్ని మండల కంప్యూటర్‌ కేంద్రంలో సంఘం పునఃనిర్మాణ రిపోర్టు నుంచి ఎంపిక చేయాలి. శ్రమశక్తి సంఘాల్లో సభ్యులు చనిపోతే వారి పేరు తీసేయాలి. సంఘంలో మార్పులకు సమావేశం ఏర్పాటు చేసుకుని అందరి ఆమోదం మేరకు చేయాలి. సభ్యుడి అనుమతి లేకుండా మార్పులు చేర్పులు జరిగితే సంబంధిత అధికారిపై చర్యలు తీసుకుంటారు. సంఘాల్లో మార్పులకు మండల కంప్యూటర్‌ కేంద్రాలకు సాఫ్ట్‌వేర్‌ అందిస్తారని తెలియజేశారు.

జిల్లాలో గ్రూపులు ఇలా..

జిల్లాలో 16 మండలాలు, 369 జీపీలు ఉన్నాయి. అందులో 2,737 శ్రమశక్తి సంఘా లు ఉన్నాయి. ఇందులో 45,298 వేజ్‌ సీకర్స్‌ రిజిస్టరై ఉన్నారు. అయితే, 28,470 మంది సభ్యులు మాత్రమే గుర్తింపు పొందారు. అలాగే, జిల్లాలో జనరల్‌ శ్రమశక్తి గ్రూపులు 210 గ్రామ పంచాయతీల్లో 675 ఉన్నాయి. వీటిలో 2,035 వేజ్‌ సీకర్స్‌ రిజిస్టరై ఉండగా, 1609 మంది మాత్రమే అర్హులుగా ఉన్నట్లు గుర్తించారు.

మేట్ల ఎంపిక ఇలా..

శ్రమశక్తి సంఘాలకు మేట్ల ఎంపికకు కూడా మార్గదర్శకాలు ఇచ్చారు. సంఘంలో 20 మందికి మించి ఉంటారో ఆ సంఘాలకు మాత్రమే మేట్‌ను నియమించుకోవాలి. ప్రతి సంఘానికి ఒక మేట్‌ ఉండేలా చూడాలి. లేకపోతే ఎంసీసీలో సంఘాల నమోదుకు అంగీకరించరు. కనీసం సగానికిపైగా శ్రమశక్తి సంఘాలకు మహిళలు మేట్లుగా ఎంపిక చేయాలి. ఎస్సీ, ఎస్టీ సభ్యులు సగానికి పైగా ఉంటే వారి నుంచి ఎంపిక జరగాలి. మేట్లు కార్యక్రమాల అమలులో అక్రమాలకు పాల్పడితే సోషల్‌ ఆడిట్‌లో నిరూపితమైతే వారి జాబ్‌కార్డును ఏడాది నుంచి మూడు సంవత్సరాలు నిషేధిస్తారని స్పష్టం చేశారు.