సోమవారం 25 జనవరి 2021
Warangal-rural - Jan 05, 2021 , 01:12:40

మైండ్‌గేమ్‌లో వండర్‌ కిడ్‌

మైండ్‌గేమ్‌లో వండర్‌ కిడ్‌

  • చదరంగంలో సత్తాచాటుతున్న పల్లెటూరి బిడ్డ
  • జాతీయ, అంతర్జాతీయస్థాయి పోటీల్లో మెరుపులు 
  • ఎత్తుకు పైఎత్తులతో ప్రత్యర్థులను చిత్తుచేస్తున్న బాలిక
  • గ్రాండ్‌ మాస్టర్‌ కావడమే లక్ష్యమంటున్న సరయు
  • జాతీయ, అంతర్జాతీయస్థాయి పోటీల్లో మెరుపులు 
  • ఎత్తుకు పైఎత్తులతో ప్రత్యర్థులను చిత్తుచేస్తున్న బాలిక
  • గ్రాండ్‌ మాస్టర్‌ కావడమే లక్ష్యమంటున్న సరయు సరయు విజయాలు..

చదరంగం అంటేనే ఓ మైండ్‌గేమ్‌. ఈ మైండ్‌గేమ్‌లో సత్తాచాటుతున్న ఓ పల్లెటూరి చిన్నారి. ఎత్తుకు పై ఎత్తులతో ప్రత్యర్థులను చిత్తు చేస్తున్నది. అత్యద్భుత ప్రతిభతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నది. చెస్‌తో తాను పుట్టిన ఊరిని ప్రపంచ దేశాలకు పరిచయం చేసింది వరంగల్‌ రూరల్‌ జిల్లా సంగెం మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన వేల్పుల సరయు. చిన్నతనంలో తండ్రి ఒడిలో చదరంగంలో ఓనమాలు నేర్చుకున్న సరయు, ఇప్పుడు ప్రపంచ స్థాయి క్రీడాకారిణిగా ఎదిగింది. చెస్‌లో గ్రాండ్‌ మాస్టర్‌ కావాలన్నదే తన లక్ష్యమని చెబుతోంది.

- సంగెం, జనవరి 01

వరంగల్‌ రూరల్‌ జిల్లా సంగెం మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ వేల్పుల సంపత్‌, రజిత దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు (కవలలు) సరయు, శరణ్య ఉన్నారు. ఆడపిల్లలే కదా అని ఆ తల్లిదండ్రులు వారిని నిర్లక్ష్యం చేయలేదు. వారిలో ఉన్న ప్రతిభను వెలికితీసే ప్రయత్నం చేశారు. సంపత్‌ ఇంట్లో తన స్నేహితులతో కలిసి చెస్‌ ఆడుతుండగా తన కూతురు సరయు చూస్తూ ఉండేది. తాను కూడా చెస్‌ నేర్చుకోవాలనే తపనతో తండ్రితో ఆడడం మొదలు పెట్టి, తండ్రినే ఓడించేది. ఇలా సరయులో ఉన్న చెస్‌ ప్రతిభను గుర్తించిన తండ్రి కోచ్‌ బొల్లం సంపత్‌ వద్ద ప్రత్యేక శిక్షణ ఇప్పించాడు. ఇక అప్పటినుంచి సరయు మైండ్‌గేమ్‌లో వండర్‌ కిడ్‌గా అద్భుత విజయాలు సాధిస్తున్నది. జిల్లాస్థాయి నుంచి అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించింది. అండర్‌-11, అండర్‌-13, అండర్‌-14తోపాటు ఓపెన్‌ టు ఆల్‌లో విజయాలు ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నది. 2019లో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణంలో నిర్వహించిన జాతీయస్థాయి టోర్నీలో అండర్‌-13 విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచింది. 11రౌండ్లలో తొమ్మిది పాయింట్లు సాధించి, ప్రపంచ చాంపియన్‌షిప్‌, ఏషియన్‌, కామన్‌వెల్త్‌ అంతర్జాతీయ టోర్నమెంట్లకు అర్హత సాధించింది. ముంబైలో జరిగిన ఓ టోర్నమెంట్‌లో ఓపెన్‌లో మంచి పాయింట్లు సాధించడంతో చెస్‌ ప్రపంచ చాంపియన్‌ విశ్వనాథ్‌ ఆనంద్‌ రూ.లక్ష నగదు బహూకరించారు. సరయుకు మంచి భవిష్యత్‌ ఉందంటూ అభినందించారు. చెస్‌లో రాణిస్తున్న సరయు విషయాన్ని స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆమె ఘనంగా సన్మానించారు. మరిన్ని విజయాలు సాధించి దేశానికి, రాష్ర్టానికి పేరు తీసుకురావాలని ఆశీర్వదించారు. అనంతరం ఆయన సరయును మంత్రి కేటీఆర్‌, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వద్దకు తీసుకెళ్లగా, ప్రభుత్వ పరంగా సాయమందిస్తామని హామీ ఇచ్చారు.

అంతర్జాతీయ స్థాయిలో.. 

  • 2018 : థాయ్‌లాండ్‌లో నిర్వహించిన ఏషియన్‌ యూత్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ టీం విభాగంలో ప్రథమ స్థానం
  • 2018: ఏషియన్‌ యూత్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ స్టాండర్డ్‌ విభాగంలో ఐదో స్థానం 

కోనేరు హంపి స్ఫూర్తి

చదరంగంలో మా నాన్న ఓనమాలు నేర్పించారు. ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతోనే చెస్‌ క్రీడలో రాణిస్తున్నా. గ్రాండ్‌ మాస్టర్‌ కోనేరు హంపి స్ఫూర్తితో చెస్‌లో గ్రాండ్‌ మాస్టర్‌ను అవుతా. గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ అన్న సూచనలు, సలహాలు తీసుకుంటూ, ఆన్‌లైన్‌లో గేమ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నా. వారి స్ఫూర్తితో తప్పకుండా గ్రాండ్‌మాస్టర్‌ అవుతా.

- సరయు, అంతర్జాతీయ స్థాయి చెస్‌ క్రీడాకారిణి

ఉన్నత శిక్షణ ఇస్తే గ్రాండ్‌ మాస్టర్‌ గ్యారంటీ 

సరయుకు ఉన్నత శిక్షణ ఇప్పిస్తే గ్రాండ్‌మాస్టర్‌ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, ఆమెది నిరుపేద కుటుంబం. తగిన వసతులు కల్పించడంతోపాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయి టోర్నమెంట్లకు తీసుకెళ్లడానికి డబ్బులు లేక ఆ కుటుంబం ఇబ్బందులు పడుతున్నది. ప్రభుత్వం ఆర్థికంగా సహకారం అందించాలని సరయు తండ్రి సంపత్‌ వేడుకుంటున్నాడు. ప్రస్తుతం సరయు ఇంటి వద్దనే ఆన్‌లైన్‌లో గేమ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నది.

జాతీయ స్థాయిలో..

2019: విశాఖపట్టణంలో జరిగిన జాతీయస్థాయి పొటీలో అండర్‌-13 విభాగంలో ప్రథమ స్థానం

2019(ఏప్రిల్‌): రాయ్‌పూర్‌లో జరిగిన జాతీయ టోర్నీలో 3వ స్థానం 

2019: ఢిల్లీలో నిర్వహించిన ఢిల్లీ ఇంటర్నేషనల్‌ టోర్నీలో 5వ స్థానం 

2018 (డిసెంబర్‌): భోపాల్‌లో నిర్వహించిన 

జీఎం టోర్నమెంట్‌లో ప్రథమ స్థానం 

2017 (జనవరి): మహారాష్ట్రలో అండర్‌-11విభాగంలో 5వ స్థానం

2017(జూన్‌):పంజాబ్‌లో జరిగిన అండర్‌-13 విభాగంలో 4వ స్థానం 

2017 (నవంబర్‌): పుణె జరిగిన అండర్‌-13 విభాగంలో 2వ స్థానం నిలిచి అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించింది.logo