మంగళవారం 19 జనవరి 2021
Warangal-rural - Jan 04, 2021 , 00:29:03

మూడు చెరువుల్లో రొయ్యలు

మూడు చెరువుల్లో రొయ్యలు

  • పైలట్‌ ప్రాజెక్టు కింద పెంపకం
  • మైలారం, ఎల్గూరురంగంపేట, మాదన్నపేట చెరువుల ఎంపిక
  • నెల్లూరు నుంచి జిల్లాకు చేరిన నీలకంఠ రొయ్య పిల్లలు
  • మత్స్యకారులకు నూరుశాతం సబ్సిడీపై ప్రభుత్వం సరఫరా
  • 68 మత్స్య సహకార సంఘాలకు పూర్తయిన ఎన్నికలు
  • ‘నమస్తేతెలంగాణ’తో జిల్లా మత్స్యశాఖ అధికారి పీ నరేశ్‌కుమార్‌నాయుడు

‘మార్కెట్‌లో రొయ్యలకు డిమాండ్‌ ఉంది. లోకల్‌గా వీటి ధర కిలోకు రూ. 250 పలుకుతున్నది. ఈ నేపథ్యంలో రొయ్యల పెంపకంలో మత్స్యకారులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధి రంగంలో మరింత ఊతమిచ్చేందుకు వారికి నూరుశాతం సబ్సిడీపై రొయ్య పిల్లలను సరఫరా చేసింది. పైలట్‌ ప్రాజెక్టుగా ఈ ఏడాది జిల్లాలోని మూడు చెరువుల్లో రొయ్యల పెంపకం చేపట్టాం’ అని మత్స్యశాఖ జిల్లా అధికారి(డీఎఫ్‌వో) పీ నరేశ్‌కుమార్‌నాయుడు అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా కొన్నేళ్ల నుంచి ఏటా మత్స్యకారులకు నూరుశాతం సబ్సిడీపై చేప పిల్లలను ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈ సంవతర్సం తొలిసారి ఉచితంగా రొయ్య పిల్లల సరఫరా చేపట్టింది. పైలట్‌ ప్రాజెక్టు కింద ఇటీవల ప్రతి జిల్లాలో కొన్ని చెరువులను ఎంపిక చేసి వాటిలో రొయ్య పిల్లలను వదిలింది. ఇందులో భాగంగా జిల్లాలో సబ్సిడీ రొయ్యల సరఫరా, పెంపకంపై నరేశ్‌కుమార్‌నాయుడు ‘నమస్తేతెలంగాణ’తో మాట్లాడారు.

- వరంగల్‌ రూరల్‌, జనవరి 3 (నమస్తేతెలంగాణ)నమస్తే: రొయ్యల పెంపకానికి పైలట్‌ ప్రాజెక్టు కింద జిల్లాలో ఎన్ని చెరువులను గుర్తించారు?

డీఎఫ్‌వో: తొలిసారి పైలట్‌ ప్రాజెక్టు కింద ప్రతి జిల్లాలో మూడు నాలుగు చెరువులను ఎంపిక చేసి వాటిలో రొయ్య పిల్లల పెంపకం చేపట్టింది. జిల్లాలో రాయపర్తి మండలంలోని మైలారం రిజర్వాయర్‌, సంగెం మండలంలోని ఎల్గూరురంగంపేట చెరువు, నర్సంపేట మండలంలోని మాదన్నపేట చెరువు. ఈ మూడు కూడా పెద్ద చెరువులే.

నమస్తే: ఎంపిక చేసిన చెరువుల్లో ఈ ఏడాది ఎన్ని రొయ్య పిల్లలు వదిలారు?

ఎఫ్‌డీవో: మూడింటిలో 4.50 లక్షల నీలకంఠ రొయ్య పిల్లలను వదిలాం. వీటి విలువ రూ. 9.46 లక్షలు. మైలారం రిజర్వాయర్‌లో 2.28, ఎల్గూరురంగంపేట చెరువులో 1.13, మాదన్నపేట చెరువులో 1.14 లక్షల రొయ్య పిల్లలు పోశాం. ప్రభుత్వం వంద శాతం సబ్సిడీతో వీటిని మత్స్యకారులకు సరఫరా చేసింది. ఆయా రిజర్వాయర్‌, చెరువు మత్స్యకారుల సహకారం సంఘం ఆధ్వర్యంలో గత నవంబర్‌, డిసెంబర్‌లో ఈ రొయ్య పిల్లలను వదిలినం. వీటిని కాంట్రాక్టర్‌ ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా నుంచి తెచ్చాడు. మత్స్యకారులు నాలుగు నెలల్లో ఈ రొయ్యలను పట్టి అమ్ముకోవచ్చు. మార్చి, ఏప్రిల్‌ వరకు ఒక్కో రొయ్య ఎదుగుదల 80 నుంచి 100 గ్రాములు ఉంటుంది. అడుగున ఉండేవి కావడం వల్ల చెరువులు నీటితో నిండి మత్తడి దుంకినా ఈ రొయ్యలు బయటకు వెళ్లే అవకాశం లేదు.

నమస్తే: కిసాన్‌ క్రెడిట్‌ కార్డు పథకం కింద జిల్లాలో ఎంత మంది మత్స్యకారులకు రుణ పంపిణీ జరిగింది?

ఎఫ్‌డీవో: ఈ పథకం కొత్తగా అమల్లోకి వచ్చింది. ఒక్కో మత్స్యకారుడు బ్యాంకు నుంచి రూ. 25 వేల రుణం పొందే అవకాశం ఉంది. ఈ రుణం తీసుకునే మత్స్యకారులు కచ్చితంగా మత్స్య సహకార సంఘాల్లో సభ్యులై ఉండాలి. వారికి బ్యాంకులో క్రాప్‌ లోన్‌ ఉండొద్దు. తీసుకున్న రుణాన్ని రూపాయి వడ్డీతో చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో ఈ ఏడాది నాలుగు వేల మంది మత్స్యకారులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డు పథకం నుంచి రుణాలు ఇవ్వాలనేది లక్ష్యం. మత్స్య సహకార సంఘాలన్నింటికీ దీనిపై సమాచారం ఇచ్చాం. నెల రోజుల నుంచి ఇప్పటివరకు సుమారు ఐదు వందల మంది ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకున్నారు.

నమస్తే: జిల్లాలో ఎన్నికలు నిర్వహించేందుకు గుర్తించిన మత్స్య సహకార సంఘాలు ఎన్ని?

ఎఫ్‌డీవో: జిల్లావ్యాప్తంగా 205 మత్స్య సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో 17,650 మంది సభ్యులు ఉన్నారు. ఒక్కో సంఘం పాలకవర్గం పదవీకాలం గడువు ఐదేళ్లు. పదవీకాలం గడువు ముగిసిన 108 సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని సహకార శాఖకు ఇటీవల ప్రతిపాదనలు పంపాం. వీటిలో ఇప్పటివరకు సహకార శాఖ అధికారులు 68 సంఘాలకు ఎన్నికలు నిర్వహించారు. మిగతా సంఘాలకు ఎన్నికల నిర్వహణ ప్రక్రియ జరుగుతున్నది. ప్రతి సంఘంలో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, ఆరుగురు డైరెక్టర్లు ఇలా మొత్తం తొమ్మిది మంది ఉంటారు. కొత్తగా ఎన్నికైన వారు ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు.