మంగళవారం 19 జనవరి 2021
Warangal-rural - Dec 31, 2020 , 01:34:47

‘ప్రగతి’ పనుల్లో వేగం పెంచాలి

‘ప్రగతి’ పనుల్లో వేగం పెంచాలి

  • ప్రతి పట్టణంలో తొలుత రెండేసి పట్టణ ప్రకృతి వనాల ఏర్పాటు
  • జనవరి 10లోగా పూర్తి చేయాలి
  • మొక్కల కోసం నర్సరీల్లో సీడ్‌ పెట్టాలి
  • వైకుంఠధామాల్లో వసతులు కల్పించాలి
  • అదనపు కలెక్టర్‌ మహేందర్‌రెడ్డి

వరంగల్‌ రూరల్‌, నమస్తే తెలంగాణ: పట్టణప్రగతి పనుల్లో వేగం పెంచాలని అదనపు కలెక్టర్‌ ఆర్‌ మహేందర్‌రెడ్డి మున్సిపాలిటీల కమిషనర్లను ఆదేశించారు. తొలి విడుతలో ప్రతి పట్టణంలో రెండేసి పట్టణప్రకృతి వనాలను ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. హన్మకొండలోని తన కార్యాలయంలో బుధవారం ఆయన నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట మున్సిపాలిటీల కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. ఆయా పురపాలక సంఘం పరిధిలో పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా చేపట్టిన వివిధ అభివృద్ధి పనులపై సమీక్షించారు. వార్డుకో పట్టణ ప్రకృతి వనం ఏర్పాటులో భాగంగా తొలుత ప్రతి మున్సిపాలిటీ పరిధిలో రెండు పెద్ద పార్కుల నిర్మాణ పనులను జనవరి పదో తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రకృతి వనంలో ప్లాంటేషన్‌ ఏర్పాటు చేయాలని, వాకింగ్‌ ట్రాక్‌ నిర్మించాలని, చుట్టూ ఫెన్సింగ్‌, బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే ఫెన్సింగ్‌, బోర్డులు ఏర్పాటు చేసిన పట్టణ ప్రకృతి వనాల్లో వెంటనే ప్లాంటేషన్‌, వాకింగ్‌ ట్రాక్‌ నిర్మాణం చేపట్టాలని సూచించారు. కొద్ది నెలల్లో నిర్వహించే హరితహారం కోసం ఆయా మున్సిపాలిటీ పరిధిలోని నర్సరీల్లో నిర్దేశిత లక్ష్యం మేరకు మొక్కలు పెంచాలన్నారు. బ్యాగ్‌ ఫిల్లింగ్‌ పూర్తయిన నర్సరీల్లో వెంటనే సీడ్‌ కూడా పెట్టాలని చెప్పారు. ప్రతి పట్టణంలో తొలి విడుతలో అన్ని వర్గాల వారికి ఉపయోగపడేలా ఒక వైకుంఠధామాన్ని అందుబాటులోకి తేవాలన్నారు. నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట పట్టణాల్లో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్లపై దృష్టి సారించాలని, వెజ్‌తో పాటు నాన్‌వెజ్‌ మార్కెట్‌ ఉండేలా పనులు చేపట్టాలని అదనపు కలెక్టర్‌ కమిషనర్లను ఆదేశించారు.

ప్రారంభానికి సిద్ధం

నర్సంపేట, పరకాల పట్టణాల్లో నిర్మాణాలు పూర్తయిన పబ్లిక్‌ టాయిలెట్స్‌ను ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్‌ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. నర్సంపేటలో పబ్లిక్‌ టాయిలెట్లు ప్రారంభానికి రెడీ ఉండగా, పరకాలలో మరో వారం రోజుల్లో సిద్ధం చేయొచ్చని చెప్పారు. నర్సంపేట, పరకాలలో స్థలాల గుర్తింపు జరిగినందున పబ్లిక్‌ హెల్త్‌ అధికారులను కలిసి డంపింగ్‌ యార్డుల నిర్మాణ పనులను సాధ్యమైనంత త్వరలో ప్రారంభించాలన్నారు. 

రుణ లక్ష్యాన్ని వందశాతం పూర్తి చేయాలి

వీధి వ్యాపారులకు రుణాల పంపిణీ లక్ష్యాన్ని వందశాతం పూర్తి చేయాలని మహేందర్‌రెడ్డి ఆదేశించారు. నర్సంపేటలో 700, పరకాలలో 400, వర్ధన్నపేటలో 130 మంది వీధి వ్యాపారులకు రుణాలు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన టీఎస్‌ బీపాస్‌ ద్వారా ఇళ్ల నిర్మాణానికి అనుమతుల కోసం ప్రజలు చేసే దరఖాస్తులను 21 రోజుల్లో క్లియర్‌ చేయాలని కమిషనర్లకు సూచించారు. కమిషనర్లు విద్యాధర్‌, యాదగిరి, రవీందర్‌ పాల్గొన్నారు.