మంగళవారం 26 జనవరి 2021
Warangal-rural - Dec 30, 2020 , 00:29:18

కోనారెడ్డి చెరువుకు మహర్దశ

కోనారెడ్డి చెరువుకు మహర్దశ

  • శాశ్వత మరమ్మతులకు సీఎం కేసీఆర్‌ ఆదేశం
  • రూ. 13.53 కోట్లతో జలవనరుల శాఖ ఎస్టిమేట్స్‌ 
  • చెరువు కట్ట విస్తరణ, ఫోర్‌షోర్‌ బండ్‌, మూడు తూముల నిర్మాణం
  • ఫీడర్‌ చానల్‌ పునరుద్ధరణ, మత్తడి వద్ద కొత్తగా రెండు రెగ్యులేటర్లు
  • ప్రభుత్వానికి అంచనాల నివేదిక

వరంగల్‌ రూరల్‌, నమస్తే తెలంగాణ: వర్ధన్నపేటలోని కోనారెడ్డి చెరువుకు మహర్దశ పట్టనుంది. శాశ్వత మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా జలవనరుల శాఖ ఇంజినీర్లు ఎస్టిమేట్స్‌ వేసి రూ. 13.53 కోట్ల అంచనాలతో ప్రభుత్వానికి పంపారు. నిధుల కేటాయింపు జరిగిన వెంటనే పనులు చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. గత ఆగస్టులో భారీ వర్షాలకు చెరువు కట్ట తెగడం వల్ల వరంగల్‌-ఖమ్మం జాతీయ రహదారిలోని వర్ధన్నపేట వద్ద సంగెం వాగు వంతెన అప్రోచ్‌ రోడ్డు కొట్టుకుపోయింది. ఎన్‌హెచ్‌ అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేసి రాకపోకలను పునరుద్ధరించారు. ఇక జలవనరుల శాఖ ఇంజినీర్లు కోనారెడ్డి చెరువు ఆయకట్టుపై దృష్టి సారించారు. రికార్డుల ప్రకారం ఈ చెరువు కింద నిర్దేశిత ఆయకట్టు 1,727 ఎకరాలు ఉంది. రైతులు గత వానకాలం పూర్తిస్థాయి ఆయకట్టు సాగు చేశారు. దీనికి సరిపడా నీటిని కోనారెడ్డి చెరువులో నిల్వ చేసేందుకు జలవనరుల శాఖ ఇంజినీర్లు రూ. 50 లక్షలతో తాత్కాలికంగా 80 మీటర్ల పొడవున రింగ్‌బండ్‌ను యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ శాశ్వత మరమ్మతులు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన సీఎం శాశ్వత మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో జలవనరుల శాఖ ముఖ్య అధికారులతో నిర్వహించిన సమావేశంలోనూ కేసీఆర్‌ కోనారెడ్డి చెరువు అంశాన్ని ప్రస్తావించారు. దీంతో జలవనరుల శాఖ అధికారులు శాశ్వత మరమ్మతులు చేపట్టేలా కసరత్తును వేగవంతం చేశారు.

ప్రభుత్వానికి ఎస్టిమేట్స్‌

ప్రభుత్వ ఆదేశాలతో జలవనరుల శాఖ ఇంజినీర్లు కొద్ది రోజుల క్రితం కోనారెడ్డి చెరువు శాశ్వత మరమ్మతుల కోసం ఎస్టిమేట్స్‌ వేశారు. రూ. 13.53 కోట్లతో అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. గత ఆగస్టులో తెగిన కట్టను 80 మీటర్ల పొడవున పటిష్టం చేయడంతో పాటు మొత్తం చెరువు కట్టను 2.40 కిలోమీటర్లు విస్తరించేందుకు, ప్రస్తుతం ఉన్న మూడు తూముల (స్లూయిస్‌ల) స్థానంలో కొత్తగా మూడు తూములు, చెరువులో ఏడు కిమీ ఫోర్‌షోర్‌ బండ్‌ నిర్మాణానికి, 11.9 కి.మీ. ఫీడర్‌ చానల్‌ పునరుద్ధరణ, చెరువు మత్తడి వద్ద నూతనంగా రెండు రెగ్యులేటర్లను నిర్మించాలని నివేదికలో ప్రతిపాదించారు. గత ఆగస్టులో భారీ వర్షాలకు కోనారెడ్డి చెరువులోకి వచ్చిన వరదనీరు మత్తడి ద్వారా సరిగా బయటకు వెళ్లకపోవడం వల్లే కట్టకు గండి పడిందని గుర్తించిన జలనవరుల శాఖ ఇంజినీర్లు.. శాశ్వత మరమ్మతుల్లో భాగంగా చెరువులోకి వరద నీరు బాగా వచ్చిన సమయంలో బయటకు పంపేందుకు కొత్తగా రెండు రెగ్యులేటర్ల ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు తెలిసింది. తూములు శిథిలావస్థకు చేరినందున మరమ్మతులకు బదులు వీటి స్థానంలో కొత్తవి నిర్మించేందుకు అంచనాలు వేశారు. కట్ట విస్తరణ, ఫోర్‌షోర్‌ బండ్‌ నిర్మాణం, ఫీడర్‌ చానల్‌ ఇన్‌స్పెక్షన్‌ పాత్‌ పునరుద్ధరణ, రెగ్యులేటర్ల నిర్మాణంతో కోనారెడ్డి చెరువుకు శాశ్వత మరమ్మతులు చేసే దిశలో ఎస్టిమేట్స్‌ తయారు చేశారు. అంచనాలను ప్రభుత్వానికి పంపినట్లు జలవనరుల శాఖ జిల్లా అధికారి శ్రవణ్‌కుమార్‌ చెప్పారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన వెంటనే టెండర్ల ప్రక్రియ నిర్వహించి కోనారెడ్డి చెరువు శాశ్వత మరమ్మతులు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. స్వయంగా సీఎం కేసీఆర్‌ ఆదేశించిన నేపథ్యంలో కోనారెడ్డి చెరువు శాశ్వత మరమ్మతుల అంచనాలకు సాధ్యమైనంత త్వరలో ప్రభుత్వ ఆమోదం లభించే అవకాశం ఉంది.


logo