బుధవారం 27 జనవరి 2021
Warangal-rural - Dec 29, 2020 , 00:20:43

మెగా పార్కుకుమరో పెద్ద కంపెనీ

మెగా పార్కుకుమరో పెద్ద కంపెనీ

  • ‘గణేశా ఇకో స్పెర్‌' ఒప్పందం
  • టెక్స్‌టైల్‌ ఇండస్ట్రీ కోసం స్థలం కేటాయింపు
  • టీఎస్‌ఐఐసీకి బిల్డింగ్‌ ప్లాన్‌ ఇచ్చిన కంపెనీ
  • వేర్వేరుగా రెండు ప్లాంట్లతో వస్త్ర పరిశ్రమ
  • ఫైబర్‌ యాన్‌, వాషింగ్‌ లైన్‌ తయారీ యూనిట్లు
  • శరవేగంగా నిర్మాణ పనులు
  • 300 ఎకరాల్లో పరిశ్రమ స్థాపనకు సౌత్‌కొరియా కంపెనీ రెడీ

వరంగల్‌రూరల్‌, నమస్తేతెలంగాణ : పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చే ‘కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు’లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు వివిధ దేశాల వస్త్ర కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. తాజాగా ఇక్కడ వస్త్ర పరిశ్రమ నెలకొల్పేందుకు నార్త్‌ ఇండియాకు చెందిన ‘గణేశా ఇకో స్పెర్‌ లిమిటేడ్‌' ముందుకొచ్చింది. రెండు ప్రొడక్షన్‌ ప్లాంట్ల ఏర్పాటు కోసం దీనికి టెక్స్‌టైల్‌ పార్కులో రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరుగా 50ఎకరాలు కేటాయించింది. ఇటీవల టీఎస్‌ఐఐసీతో అగ్రిమెంట్‌ కుదుర్చుకున్న ఈ కంపెనీ కొద్ది రోజుల క్రితం పార్కులో ప్లాంట్ల నిర్మాణ పనులు చేపట్టింది. సోమవారం తమ బిల్డింగ్‌ ప్లాన్‌ను టీఎస్‌ఐఐసీ అధికారులకు అందజేసింది. ప్రత్యక్షం, పరోక్షంగా సుమారు రెండు లక్షల మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో వరంగల్‌రూరల్‌ జిల్లా గీసుగొండ మండలం శాయంపేటహవేలీ, సంగెం మండలం చింతలపల్లి గ్రామాల మధ్య 1200 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. 2017 అక్టోబరు 22న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇక్కడ పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీన్ని వస్త్ర నగరిగా తీర్చిదిద్దేందుకు తొలి విడత ప్రభుత్వం టీఎస్‌ఐఐసీకి రూ.40 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో పార్కులో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. విద్యుత్‌ సరఫరా కోసం 33/11 కేవీ సబ్‌ స్టేషన్‌ నిర్మించారు. సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టం ద్వారా వీధిదీపాలు ఏర్పాటు చేశారు. మిషన్‌ భగీరథ నీటిని సరఫరా చేసేందుకు పార్కులో పైపులైన్‌, సంపులు, ఓవర్‌హెడ్‌ ట్యాంకు పనులు చేపట్టారు. 

కంపెనీలకు పార్కులో స్థలం

కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కులో వస్త్ర పరిశ్రమలు స్థాపించేందుకు పలు కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఇక్కడ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటున్నాయి. వీటికి టీఎస్‌ఐఐసీ ఈ మెగా టెక్స్‌టైల్‌ పార్కులో పరిశ్రమల ఏర్పాటు కోసం అవసరమైన స్థలం కేటాయిస్తున్నది. ఇటీవల సౌత్‌ కొరియా కంపెనీకి 300 ఎకరాలు కేటాయించింది. దీంతో కంపెనీ ప్రతినిధులు పార్కును సందర్శించి తమకు ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. ఇక్కడ వస్త్ర పరిశ్రమ ఏర్పాటుకు రెడీ అయ్యారు. దీంతో పాటు కొత్తగా గణేశా ఇకో స్పెర్‌ లిమిటేడ్‌ కంపెనీకి పార్కులో వేర్వేరుగా 50ఎకరాలను టీఎస్‌ఐఐసీ కేటాయించింది. సదరు కంపెనీకి చెందిన గణేశా ఇకో పెట్‌ ప్రైవేట్‌ లిమిటేడ్‌కు 30, గణేశా ఇకో టెక్‌ ప్రైవేట్‌ లిమిటేడ్‌కు 20 ఎకరాలు ఒకేచోట ఇచ్చింది. గణేశా ఇకో పెట్‌లో ఫైబర్‌ యాన్‌ లైన్‌, గణేషా ఇకో టెక్‌లో వాషింగ్‌ లైన్‌ తయారీ పరిశ్రమలు నెలకొల్పేందుకు గణేశా ఇకో స్పెర్‌ కంపెనీ టీఎస్‌ఐఐసీతో ఒప్పందం చేసుకుంది. \

జెట్‌ స్పీడ్‌తో పనులు

గణేశా ఇకో స్పెర్‌ లిమిటేడ్‌ కంపెనీ ఇప్పటికే నార్త్‌ ఇండియాలోని వివిధ రాష్ర్టాల్లో వస్త్ర పరిశ్రమలు నడుపుతున్నది. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ర్టాల్లోని టేమ్రా, కాన్పూర్‌, రుద్రపూర్‌తో పాటు నేపాల్‌లో ఈ కంపెనీ వస్త్ర పరిశ్రమలున్నాయి. కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కులో గణేశా ఇకో స్పెర్‌ లిమిటేడ్‌ నెలకొల్పే వస్త్ర పరిశ్రమ ఆరోది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల్లో ఇది మొదటిది కానుంది. 30 ఎకరాల్లో ఫైబర్‌ యాన్‌ లైన్‌ ప్రొడక్షన్‌ ప్లాంటు, 20 ఎకరాల్లో వాషింగ్‌ లైన్‌ ప్రొడక్షన్‌ ప్లాంటు నిర్మాణం కోసం కొద్ది రోజుల క్రితం పనులు కూడా ప్రారంభించింది. ఫైబర్‌ యాన్‌ లైన్‌ ప్రొడక్షన్‌ ప్లాంట్‌లో ఆరు యూనిట్లు, వాషింగ్‌ లైన్‌ ప్రొడక్షన్‌ ప్లాంటులో నాలుగు యూనిట్లను ఈ కంపెనీ ఏర్పాటు చేయనుంది. గణేశా ఇకో స్పెర్‌ లిమిటేడ్‌ కంపెనీ బిల్డింగ్‌ ప్లాన్‌నూ తమకు అందజేసినట్లు టీఎస్‌ఐఐసీ వరంగల్‌ జోనల్‌ మేనేజర్‌ రతన్‌ రాథోడ్‌ చెప్పారు. ఫైబర్‌ యాన్‌ లైన్‌ ప్రొడక్షన్‌ ప్లాంటుకు సంబంధించిన 30 ఎకరాల చుట్టు ప్రహరీ పనులు జెట్‌ స్పీడ్‌తో కొనసాగుతున్నాయి. ఈ స్థలంలో మరి కొద్ది రోజుల్లో పరిశ్రమ భవన నిర్మాణ పనులు మొదలు కానున్నాయి. ఏడాదిలోపు ఈ రెండు ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేసి ప్రొడక్షన్‌ ప్రారంభించాలని సదరు కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నది. 

వేలాది మందికి ఉపాధి

ఈ ప్లాంట్లలో అమర్చే యంత్రాలను ఇప్పటికే గణేశా ఇకో స్పెర్‌ లిమిటేడ్‌ కంపెనీ ఇటలీ, రష్యా, ఫ్రాన్స్‌ తదితర దేశాల్లో కొనుగోలు చేసింది. వాటిని ఇక్కడికి తరలించే ఏర్పాట్లలో ఉంది. ఈ కంపెనీ స్థాపించే ప్లాంట్లతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి దొరకనుంది. హెల్పర్స్‌, ఆపరేటర్లు, టెక్నికల్‌, అడ్మినిస్ట్రేషన్‌, అకౌంట్స్‌, ఫైనాన్స్‌, హెచ్‌ఆర్‌, సెక్యూరిటీ, స్టోర్‌, మెయింటెనెన్స్‌, కాంట్రాక్టు లేబర్‌ ఇలా వివిధ విభాగాల్లో ఫైబర్‌ యాన్‌ లైన్‌ ప్లాంటులో రెండు వేల మంది, వాషింగ్‌ లైన్‌ ప్లాంటులో వెయ్యి మంది పనిచేయనున్నారు. ఈ మూడు వేల మంది కూడా షిప్టు పద్ధతిలో విధులు నిర్వర్తిస్తారు. పరోక్షంగానూ వేలాది మందికి ఉపాధి లభించనుంది. వివిధ కంపెనీలు భారీ పెట్టుబడులతో వస్తున్నందున టీఎస్‌ఐఐసీ ఇక్కడ అభివృద్ధి పనుల్లో వేగం పెంచింది. 


logo