మంగళవారం 26 జనవరి 2021
Warangal-rural - Dec 28, 2020 , 00:07:32

ట్రాన్స్‌పోర్టు చీటింగ్‌..!

ట్రాన్స్‌పోర్టు చీటింగ్‌..!

ధాన్యం ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లు కొందరు రైతులను చీటింగ్‌ చేస్తున్నారు. అన్నదాతలు తమ ధాన్యాన్ని సొంత వాహనాల్లో రైస్‌ మిల్లులకు చేర్చుతుండగా, తామే ట్రాన్స్‌పోర్ట్‌  చేసినట్లు కాంట్రాక్టర్లు ప్రభుత్వం నుంచి రవాణా చార్జీలు నొక్కేస్తున్నారు. వీరికి అధికారులు సహకరిస్తుండడంతో పలు సెక్టార్లలో ఇదే కొనసాగుతున్నది. దీంతో కర్షకులు ఇదేమిటని ప్రశ్నిస్తున్నారు.       

-వరంగల్‌రూరల్‌, నమస్తే తెలంగాణ

సొంత వాహనాల్లో ధాన్యాన్ని మిల్లులకు చేర్చుతున్న రైతులు ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లకు రవాణా చార్జీల చెల్లింపుసహకరిస్తున్న కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జిలు ఇదేమిటని ప్రశ్నిస్తున్న కర్షకులు కాంట్రాక్టర్ల నుంచి ఇప్పిస్తం.. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని సొంత వాహనాల ద్వారా రైస్‌మిల్లులకు చేరవేసే రైతులకు ట్రాన్స్‌పోర్టు చార్జీలను కాంట్రాక్టర్ల నుంచి ఇప్పిస్తం. స్థానిక సెక్టార్‌లోని రేట్ల ప్రకారం రవాణా చార్జీలు ఇవ్వాలని కాంట్రాక్టర్లకు చెబుతం. అయితే సొంత వాహనాల్లో  ధాన్యాన్ని రైస్‌మిల్లులకు ట్రాన్స్‌పోర్టు చేసిన రైతులు కచ్చితంగా సంబంధిత కొనుగోలు కేంద్రం ఇన్‌చార్జి నోటీసులో పెట్టాలి. ఎందుకంటే ఆయా సెంటర్లలో ఏ రైతు నుంచి ఎంత ధాన్యం కొన్నాం?, అందులో రైస్‌మిల్లులకు తరలించింది ఎంత? అనే వివరాలు ఇన్‌చార్జిల వద్దే ఉంటాయి. ఆ ప్రకారమే ట్రక్‌షీట్లు జారీ అవుతాయి.

-భాస్కర్‌రావు, జిల్లా మేనేజర్‌, పౌరసరఫరాల సంస్థ

రైతులకు మద్దతు ధర దక్కాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం వానకాలం, యాసంగి ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటున్నది. ఇందుకోసం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్నది. రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్‌ మిల్ల్‌డ్‌ రైస్‌(సీఎంఆర్‌) విధానంపై రైస్‌మిల్లులకు కేటాయిస్తున్నది. దీన్ని కొనుగోలు కేంద్రాల నుంచి రైస్‌మిల్లులకు రవాణా చేసేందుకు ఏటా టెండర్‌ పద్ధతిలో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లను ఖరారు చేస్తున్నది. సెక్టార్‌ వారీగా టెండర్‌ దక్కించుకున్న ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లు పౌరసరఫరాల సంస్థతో అగ్రిమెంటు చేసుకుంటున్నారు. రైతుల నుంచి కొన్న ధాన్యాన్ని  తమ వాహనాల ద్వారా రైస్‌మిల్లులకు తరలించిన ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లకు ప్రభుత్వం 5 స్లాబుల్లో రవాణా చార్జీలు చెల్లిస్తున్నది. మొద టి స్లాబు 0-8 కి.మీ, 9- 20కి.మీ రెండో స్లాబు, 21- 40, 41- 80, ఆపై కిలోమీటర్లకు వరసగా మూడు, నాలుగు, ఐదు స్లాబుల్లో ట్రాన్స్‌పోర్టు టెండర్లను ఖరారు చేసింది. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు రైతుల ధాన్యం తూకం వేశాక రైస్‌మిల్లుకు తరలించే ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లకు ట్రక్‌ షీట్లు ఇస్తారు. ఇందులో ధాన్యం రైతుల పేర్లు, బస్తాలు ఎన్ని, క్వాంటిటీ ఎంత.? అనే వివరాలు రాస్తారు. ఈట్రక్‌ షీట్లను కాంట్రాక్టర్లు తమకు అందజేసిన తర్వాత వాటిలో వివరాల ప్రకారం పౌరసరఫరాల సంస్థ అధికారులు రవాణా చార్జీలు చెల్లిస్తారు. 

జరుగుతుందేమిటంటే

రైతుల నుంచి నేరుగా కొంటున్న ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాల నుంచి రైస్‌మిల్లులకు రవాణా చేయడానికి ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ల వద్ద సరిపడ వాహనాలు ఉండడం లేదు. అద్దె వాహనాల కోసం వెతుకుతున్నారు. సీజన్‌లో అద్దె వాహనాలు సైతం అందుబాటులో లేకపోవడంతో పలు సందర్భాల్లో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లు ధాన్యం రవాణాను రైతులకే అప్పగిస్తున్నారు. దీంతో కొనుగోలు కేంద్రాల వద్ద ఉండొద్దని రైతులు తమ ధాన్యాన్ని సొం త వాహనాల ద్వారా రైస్‌మిల్లులకు చేరవేస్తున్నారు. ప్రధానంగా ఈ ఏడాది మె జార్టీ కొనుగోలు కేం ద్రాల నిర్వాహకులు వానకాలం ధాన్యాన్ని కల్లం నుంచి సెంటర్‌ కు కాకుండా నేరుగా రైస్‌మిల్లులకే తీసుకురావాలని చెబుతున్నా రు. చేసేదేమిలేక రైతు లు తమకు ఇచ్చే గన్నీ సంచుల్లో ధాన్యం నింపి కల్లాల నుంచి ధాన్యాన్ని సొంత వాహనాల ద్వారా రైస్‌మిల్లులకు తరలిస్తున్నారు. సొంత వాహనం లేని రైతులు ట్రాక్టర్లను అద్దెకు తీసుకుని ధాన్యాన్ని రైస్‌మిల్లులకు చేరవేస్తున్నారు. ఈ ధాన్యాన్ని సెంటర్లలో తూకం వేయకుడా ఏకంగా రైస్‌మిల్లుల్లోని వేబ్రిడ్జిలపైకి ఎక్కిస్తున్నారు. వేబ్రిడ్జి బిల్లు ఆధారంగా తమ ట్యాబ్‌ల్లో రైతుల వివరాలు, క్వాంటిటీ ఎంట్రీ చేస్తున్నారు. ట్రక్‌షీట్లలోనూ ఈ వివరాలు పేర్కొంటున్నారు. వీటిని ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లు సేకరించి ఎంచక్కా రవాణా చార్జీలను మింగేస్తున్నారు. ఈ వ్యవహారంలో సెంటర్ల ఇన్‌చార్జిలు, పౌరసరఫరాల సంస్థ అధికారులు ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లకు సహకరిస్తున్నారు. పెద్ద మొత్తంలో తమ ట్రాక్టర్ల ద్వారా ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించిన రైతులు కొందరు ట్రాన్స్‌పోర్టు చార్జీల కోసం కాంట్రాక్టర్లు, అధికారులను నిలిదీసిన సంఘటనలూ ఉన్నాయి. 


logo