మంగళవారం 19 జనవరి 2021
Warangal-rural - Dec 28, 2020 , 00:07:35

ప్రాజెక్టులను అడ్డుకుంటున్న కేంద్రం

ప్రాజెక్టులను అడ్డుకుంటున్న కేంద్రం

  • తెలంగాణ రైతాంగానికి నష్టం చేసే కుట్ర
  • రేపు కలెక్టరేట్‌ ఎదుట శాంతియుత ధర్నా 
  • ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు

దామెర: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ, దేవాదుల ఎత్తిపోతల మూడో దశ పనులను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటున్నదని ఎంపీపీ కాగితాల శంకర్‌, టీఆర్‌ఎస్‌ దామెర మండల అధ్యక్షుడు నేరెళ్ల కమలాకర్‌ ధ్వజమెత్తారు. మండలకేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ పనులు చేపట్టకుండా కేంద్రం కుటిల ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. దేవాదుల మూడో దశ, కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ పనులు ఆగితే పంట పొలాలకు నీరు రాదని, దీంతో పంటలు పండక రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 29న హన్మకొండలోని అంబేద్కర్‌ విగ్రహం నుంచి రూరల్‌ కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం చేపట్టే రైతు నిరాహార దీక్షకు మద్దతుగా రైతులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వైస్‌ ఎంపీపీ జాకీర్‌ అలీ, ఎంపీటీసీ పోలం కృపాకర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ బొల్లు రాజు, ఏఎంసీ డైరెక్టర్‌ ఆరె వెంకట్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు పున్నం సంపత్‌, దామెరుప్పుల శంకర్‌, గరిగె కృష్ణమూర్తి, సిలివేరు నర్సయ్య, బత్తిని రాజు, కన్నెబోయిన రమేశ్‌ పాల్గొన్నారు.

కలెక్టరేట్‌ ముట్టడికి రైతులు మద్దతివ్వాలి

నడికూడ: కలెక్టరేట్‌ ముట్టడికి రైతులు మద్దతివ్వాలని ఎంపీపీ మచ్చ అనసూర్య అన్నారు. మండలకేంద్రంలోని రైతు వేదిక భవనంలో నిర్వహించిన సమావేశంలో ఎంపీపీ మాట్లాడుతూ కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు నష్టం కలిగించేలా ఉన్నాయన్నారు. మంగళవారం ఉదయం పరకాల అంబేద్కర్‌ విగ్రహం నుంచి రూరల్‌ కలెక్టరేట్‌ వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా చేస్తామని తెలిపారు. సమావేశంలో సర్పంచ్‌ ఊర రవీందర్‌రావు, రైతుబంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్‌ బొల్లె భిక్షపతి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు భీమిడి నాగిరెడ్డి, జడ్పీటీసీ పాడి కల్పన, తిప్పర్తి సాంబశివారెడ్డి, దుప్పటి పవన్‌, నాయకుడు రవీందర్‌ పాల్గొన్నారు.

ధర్నాను విజయవంతం చేయాలి 

 ఆత్మకూరు: కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 29న కలెక్టరేట్‌ ఎదుట జరిగే ధర్నాను విజయవంతం చేయాలని టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు లేతాకుల సంజీవరెడ్డి పిలుపునిచ్చారు. మండలకేంద్రంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులను ఆపాలనే నిర్ణయాన్ని కేంద్రం వెంటనే విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో గూడెప్పాడ్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కాంతాల కేశవరెడ్డి, రైతుబంధు మండల కోఆర్డినేటర్‌ రవీందర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు మార్క రజినీకర్‌, కక్కెర్ల రాజు, బొల్లోజు కుమారస్వామి, బయ్య రాజు, నత్తి సుధాకర్‌, అర్షం వరుణ్‌గాంధీ, ఎండీ అంకుస్‌, టీఆర్‌ఎస్‌ గ్రామ అధ్యక్షుడు బాషబోయిన పైడి, వార్డు సభ్యుడు రేవూరి ప్రవీణ్‌రెడ్డి పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సరికాదు

గీసుకొండ: కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ఫేజ్‌-3 నిర్మాణ పనులను ఆపాలన్న కేంద్రం నిర్ణయం సరికాదని టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పోలీసు ధర్మారావు అన్నారు. ఈ నెల 29న కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆయన వెంట సర్పంచ్‌లు జైపాల్‌రెడ్డి, అంకతి నాగేశ్వర్‌రావు, మల్లారెడ్డి, ప్రకాశ్‌, నాయకులు చిన్ని, రమేశ్‌ ఉన్నారు.

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

సంగెం: రైతు వ్యతిరేక చట్టాలను కేంద్రం వెంటనే రద్దు చేయాలని జడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మండలకేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 29న చేపట్టే కలెక్టరేట్‌ ఎదుట  ధర్నాను టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ కందకట్ల నరహరి, వైస్‌ ఎంపీపీ బుక్క మల్లయ్య, మార్కెట్‌ డైరెక్టర్‌ దోపతి సమ్మయ్య యాదవ్‌, సంగెం ఎంపీటీసీ మల్లయ్య, మాజీ ఎంపీపీ వీరాచారి, కోడూరి సదయ్య, సంగెం సొసైటీ మాజీ చైర్మన్‌ వేల్పుల కుమారస్వామి, కోఆప్షన్‌ సభ్యుడు మన్సూర్‌ అలీ, కోడూరి సంపత్‌, తోట ప్రభాకర్‌ పాల్గొన్నారు.

రైతులను ఇబ్బందులు పెట్టడం సరికాదు

వర్ధన్నపేట: రైతులకు ఇబ్బందికరంగా ఉన్న రైతు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఈనెల 29న కలెక్టరేట్‌ ఎదుట రైతులు చేపడుతున్న ధర్నాను విజయవంతం చేయాలని జడ్పీటీసీ మార్గం భిక్షపతి పిలుపునిచ్చారు. క్యాంపు కార్యాలయంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో సాగునీటి ప్రాజెక్టులకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అరుణ, వైస్‌ చైర్మన్‌ ఎలేందర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్‌ ఏ మోహన్‌రావు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, రైతుబంధు సమితి కోఆర్డినేటర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.