మంగళవారం 19 జనవరి 2021
Warangal-rural - Dec 28, 2020 , 00:07:37

యాసంగికి పెట్టుబడి

యాసంగికి పెట్టుబడి

  • నేటి నుంచి రైతుబంధు సాయం
  • బ్యాంకు ఖాతాల్లో జమకానున్న నగదు
  • అర్హులందరికీ అందనున్న పెట్టుబడి సాయం
  • ఈసారి పోస్టాఫీసుల ద్వారా నగదు పొందే అవకాశం
  • ఆనందంలో అన్నదాతలు

యాసంగి సాగుకోసం రైతన్నకు పెట్టుబడి సాయం అందనుంది. సోమవారం నుంచి  వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేయనుండగా, వచ్చే నెల 7వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనున్నది. కొవిడ్‌ నేపథ్యంలో ఈసారి బ్యాంకులకు వెళ్లకుండా పోస్టాఫీసుల్లోనూ నగదు పొందే అవకాశం కల్పించింది. రైతుబంధు పథకంలో భాగంగా ప్రతి సంవత్సరం వానకాలం, యాసంగి సీజన్‌లో ఎకరానికి రెండు విడుతల్లో రూ.10వేల ఆర్థిక సాయం అందిస్తుండగా ఈసారి కొత్తగా మరికొందరు అర్హులకు లబ్ధిచేకూరనుండడంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. 

- వరంగల్‌ రూరల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, నమస్తే తెలంగాణ/వరంగల్‌ సబర్బన్‌

వరంగల్‌ రూరల్‌/జయశంకర్‌ భూపాలపల్లి, నమస్తే తెలంగాణ/వరంగల్‌ సబర్బన్‌ : రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతుబంధు సాయం పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. సోమవారం నుంచి నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో పంట పెట్టుబడి డబ్బులు జమకానున్నాయి. ఈ ప్రక్రియ వచ్చే నెల 7వ తేదీ వరకు కొనసాగనుంది. ముందుగా చిన్న రైతుల నుంచి మొదలుకొని వారం రోజుల్లో రైతులందరికీ డబ్బులు అందించనున్నారు. ప్రతి సంవత్సరం ప్రభు త్వం ఈ పథకం ద్వారా వానకాలం, యా సంగి సీజన్ల కోసం ఎకరానికి రెండు విడతల్లో రూ.10 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నది. ఈ ఏడాది తొలి విడుత వానకాలం పంట పెట్టుబడి సాయాన్ని ఇప్పటికే అందించిన ప్రభుత్వం, యాసంగి సీజన్‌ కోసం రెండో విడుత పంట పెట్టుబడి సాయం ఈ నెల 28 నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఇందుకోసం రూ.7,300 కోట్ల నిధులను విడుదల చేసింది. రాష్ట్రంలోని రైతులందరికీ పెట్టుబడి సాయం నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సమీక్షలో సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. దీంతో రెవెన్యూ అధికారులు ఇచ్చిన కొత్త రైతుల డాటా ఆధారంగా వ్యవసాయ శాఖ అధికారులు అర్హుల జాబితాను రూపొందించారు. ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం యాసంగి సాగు పనులు జరుగుతున్నాయి. మంచి అదునులో ప్రభుత్వం రైతుబంధు సాయం అందిస్తుండడంతో అన్నదాతల్లో ఆనందం వెల్లి విరుస్తున్నది.

కొవిడ్‌ నేపథ్యంలో రైతుబంధు డబ్బుల కోసం రైతులు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోస్టల్‌ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నేరుగా రైతులకు పెట్టుబడి డబ్బులు అందించేందుకు ముందుకొచ్చింది. గతం లో పోస్టల్‌ శాఖ ప్రవేశ పెట్టిన మైక్రో ఏటీఎం విధానం ద్వారా డబ్బులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. రైతులకు ఏ బ్యాంకులో ఖాతా ఉన్నా ఆధార్‌ అనుసంధాన మై ఉంటే చాలు.., కేవలం వేలిముద్రలతో నేరుగా రూ.పది వేల వరకు నగదును పొందవచ్చు. 

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 119 గ్రామాల్లో మొత్తం 95,526 మంది రైతులను రైతు బంధు కోసం అర్హులుగా గుర్తించారు. వీరికి రూ.99,29,16,111 నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. 

వరంగల్‌ రూరల్‌ జిల్లాలో.. 

వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 271 గ్రామాలకు చెందిన 1,76,602 మంది రైతులకు ఎకరానికి రూ.5 వేల చొప్పున రూ.170,42,15,753 పంట పెట్టుబడి సా యం అందనుంది. రైతుబంధు ద్వారా లబ్ధి పొందే రైతు ల సంఖ్యలో రాయపర్తి మండలం జిల్లాలో అగ్రభాగాన ఉంటే, ఆ తర్వాత స్థానంలో సంగెం మండలం ఉంది.

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో....

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని 11 మండలాల పరిధిలో 1,06,301 మంది రైతులకు పెట్టుబడి సా యం అందనుంది. ఇందుకోసం ప్రభుత్వం జిల్లాకు రూ.114,29,42,266 నిధులు కేటాయించింది. అత్యధికంగా రేగొండ మండలంలో 17,129మందికి, అత్యల్పంగా పలిమెల మండలంలో 1942 మంది రైతులకు పెట్టుబడి డబ్బులు అందనున్నాయి.

ములుగు జిల్లాలో..

ములుగులో 9 మండలాల పరిధిలో 73,434 మం ది  రైతులు ఉండగా, రైతుబంధు పథకం కింద ప్రభు త్వం రూ.79,30,89,436 నిధులు కేటాయించింది. ములుగు మండలంలో అత్యధికంగా 15,900మందికి, కన్నాయాగూడెం మండలంలో అత్యల్పంగా 4,530 మంది రైతులకు సాయం అందనుంది.