అతివేగం ప్రాణగండం

ఉమ్మడి జిల్లాను కుదిపేస్తున్న వరుస ప్రమాదాలు
నిర్లక్ష్య ధోరణితో డ్రైవింగ్
ట్రాఫిక్ నిబంధనలు బేఖాతరు
గాల్లో కలుస్తున్న ప్రాణాలు
15రోజుల్లోనే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 30పైగా మరణాలు
సగటున రోజుకు ఇద్దరు
ఉమ్మడి జిల్లాలో రోజూ ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వాహనాలను అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపడం, ఇష్టారీతిన ఓవర్టేక్ చేయడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం మూలంగానే 90శాతం ప్రమాదాలు జరుగుతున్నట్లు పోలీసుల రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాకుండా మద్యం మత్తులో వాహనాలతో రోడ్డెక్కి ప్రమాదం బారిన పడడంతో వారి ప్రాణాలే కాకుండా, పాదచారుల ప్రాణాలు కూడా గాల్లో కలుస్తున్నాయి. అతివేగం కారణంగా రోడ్డు దాటే సామాన్యులతో పాటు ఏ తప్పూ చేయని వాహనదారులు సైతం బలవుతున్నారు. 15 రోజుల్లోనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 30మందికిపైనే రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు. అంటే సగటున రోజుకు ఇద్దరు మృత్యువాత పడుతున్నారు. ఒక్క క్షణం నిదానంగా వెళ్తే ఇన్ని మరణాలు జరిగి ఉండేవి కావు. - వరంగల్ క్రైం
అతివేగమే ప్రధాన కారణం
ఈ మధ్యకాలంలో వరుస ప్రమాదాలను పరిశీలిస్తే వాహనాలను అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపడమే ప్రధాన కారణమని స్పష్టమవుతున్నది. వేగంగా వెళ్లడం, వాహనాన్ని కంట్రోల్ చేయలేక పడిపోవడం, లేదా ఎదురుగా వచ్చే వాహనాలను ఢీకొని ప్రాణాలు కోల్పోవడం, లేదా ఇతరుల ప్రాణాలు తీయడమే కనిపిస్తున్నది. రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది చనిపోవడమే కాకుండా, అనేక మంది కాళ్లు, చేతులు పోగొట్టుకొని, ఇతర గాయాలతో మంచానికే పరిమితమవుతున్నారు. మెజార్టీ వాహనదారులు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించక ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇష్టారాజ్యంగా ఓవర్టేక్ చేసే క్రమంలో భారీ వాహనాల కింద పడి నలిగిపోతున్నారు. రాంగ్రూట్లో వెళ్లి ఎదురుగా వచ్చే వాహనాలను ఢీకొని చనిపోతున్నారు.
మనస్సు పెట్టని డ్రైవింగ్
కొంతమంది ఏదో ఆలోచిస్తూ వాహనాలతో రోడ్లపైకి వచ్చి ప్రమాదాల బారిన పడుతున్నారు. డ్రైవింగ్‌లో ఉన్నామనే ఆలోచన లేకుండా ఏమరపాటుతో ఉండి ఎదురుగా వచ్చే వారిని ఢీకొనడం, లేదంటే రోడ్డు పక్కగా దూసుకెళ్లి కిందపడి చనిపోవడం కనిపిస్తున్నది. సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాన్ని నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. వాహనం నడుపరాని వ్యక్తులకు, మైనర్లకు వాహనాలు ఇచ్చి పరోక్షంగా వాహన యజమానులు కూడా ప్రమాదాలకు కారకులవుతున్నారు.
అధికారుల పర్యవేక్షణ తప్పనిసరి
ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని చెరువు కట్టలపై, ఇరుకు రోడ్లు, మూలమలుపులు, క్రాస్ రోడ్ల వద్ద పటిష్ట రక్షణ చర్యలు చేపట్టాలి. అవసరమున్న చోట ప్రత్యేకంగా సిబ్బందిని అందుబాటులోకి తెచ్చి వాహనదారులను అప్రమత్తం చేయాల్సిన అవసరముంది. ప్రధాన రహదారుల వెంబడి గ్రామాలున్న చోట ఆయా గ్రామాల పరిధిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి. ప్రమాదాలు జరిగే చోట వేగం తగ్గించాలనే సూచిక బోర్డులుపెట్టాలి. ముఖ్యంగా రాత్రుళ్లు నిఘా పెట్టాలి. కేవలం ముఖ్య కూడళ్లే కాకుండా జన సంచారం లేని ప్రాంతాల్లో నిఘా పెంచాలి.
రోడ్డు ప్రమాదాల్లో కొన్ని..
ఈ నెల 10న ములుగు జిల్లా ఏటూరునాగారంలో సోహెల్(23) అతి వేగంగా గేదెను ఢీకొని తీవ్రగాయాలపాలై హన్మకొండలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చనిపోయాడు.
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మచ్చాపూర్‌కు చెందిన ఏపూరి మల్లారెడ్డి, జవహర్‌నగర్‌కు బైక్‌పై వెళ్లొస్తుండగా కారు ఢీకొని చనిపోయాడు.
ఈ నెల 14 అర్బన్ జిల్లాలోని హన్మకొండ పబ్లిక్‌గార్డెన్ సమీపంలో పుప్పాలగుట్టకు చెందిన పుప్పాల ప్రసన్నకుమార్‌ను ఓ యువతి బైకుతో ఢీకొనడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
కొడకండ్ల మండలం మైదం చెరువు తండాకు చెందిన ధరావత్ సాయి (10), సూర్యాపేట- జనగామ రహదారిపై రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని ఘటనా స్థలంలోనే ప్రాణాలు వదిలాడు.
ఈ నెల 16న సంగెం మండలంలోని చెరువుకట్టపై ఎదురెదురుగా వాహనాలు ఢీకొని హంస సంపత్ (41), హర్షిత్ (4), హరిప్రసాద్ మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
21న ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఎల్లారెడ్డిగూడెంలో బైక్‌పై వెళ్తున్న లింగాల రాజిరెడ్డిని వెనుకాల నుంచి కారు అతివేగంతో ఢీకొనడంతో చనిపోయాడు.
23న హంటర్‌రోడ్డు నీలిమా జంక్షన్లో విద్యుత్‌నగర్‌కు చెందిన బూర్గుల మనోహర్‌రావు బైక్‌పై రోడ్డు దాటుతుండగా కారు అతివేగంతో వచ్చి ఢీకొనడంతో మరణించాడు.
వాహనదారుల్లో మార్పు రావాలి
ప్రమాదంలో ఏదైనా జరిగితే కుటుంబ బాగోగులు ఎవరు చూసుకుంటారనే సోయి వాహనదారులకు ఉండాలి. ఒంట్లో భయం ఉంటే రాష్, స్పీడ్ డ్రైవింగ్ చేయరు. ఓవర్టేక్, రాష్ డ్రైవింగ్ వల్లే 90శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇష్టారాజ్యంగా రోడ్లపై వాహనాలు నడిపి ప్రాణాలు పోగొట్టుకోవడమో, తీయడమో చేస్తున్నారు. ఓవర్టేక్ చేసే ముందు వాహనం సైడ్ ఇచ్చే వరకు వేచిచూడాలి. కూడళ్లలో అడ్డదిడ్డంగా రోడ్డు దాటవద్దు, స్పీడ్‌గా వెళ్లొద్దు. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టబోతున్నం. ఇందుకు కొత్త ప్రొజెక్టర్లు కొనుగోలు చేశాం.
- బాలస్వామి, వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ
తాజావార్తలు
- బీజేపీ బోగస్ మాటలను నమ్మొద్దు : మంత్రి ఎర్రబెల్లి
- గంగానది ప్రశాంతత మంత్రముగ్ధం : ఎమ్మెల్సీ కవిత
- 'విరాటపర్వం' విడుదల తేదీ ఖరారు
- పిల్లల డాక్టరైనా.. విచక్షణ కోల్పోయి..
- కొవిడ్ షాక్ : పసిడి డిమాండ్ భారీ పతనం
- సెంటిమెంట్ ఫాలో అవుతున్న వరుణ్ తేజ్..!
- గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న కార్తీకదీపం ఫేమ్
- ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో.. ఆప్ పోటీ
- వేగంగా కొవిడ్ వ్యాక్సినేషన్ జరుపుతున్న దేశంగా భారత్
- చిల్లరిచ్చేలోపు రైలు వెళ్లిపోయింది... తరువాతేమైందంటే?..