ప్రాజెక్టులు ఆపితే రూరల్ జిల్లా ఎడారే

- దేవాదుల మూడోదశ, కాళేశ్వరం మూడో టీఎంసీ పనులను కేంద్రం అడ్డుకుంటోంది
- లేఖలు ఉపసంహరించుకునేదాకా కేంద్రంపై పోరాటం
- కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేలా వ్యవసాయ చట్టాలు
- 29న రూరల్ కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష చేస్తాం
- ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్‌రెడ్డి
వరంగల్‌రూరల్-నమస్తేతెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటున్నదని వరంగల్‌రూరల్ జిల్లా ఎమ్మెల్యేలు మండిపడ్డారు. జే చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు మూడో దశ, కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు మూడో టీఎంసీ పనులు ఆపాలనే ఆదేశాలను కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరిసిస్తూ ఈ నెల 29న వరంగల్‌రూరల్ కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష చేస్తామని ప్రకటించారు. పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్‌రెడ్డి గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేసిన కొత్త వ్యవసాయ చట్టాలపై ధ్వజమెత్తారు. ఈ చట్టాలు కార్పొరేట్ సంస్థలకు, అంబానీ, అదానీల వంటి పెట్టుబడిదారులకు మాత్రమే మేలు చేసేలా ఉన్నాయన్నారు. వాటిని రద్దు చేయాలని రైతులు నెల రోజుల నుంచి ఢిల్లీలో ఆందోళన కొనసాగిస్తుంటే కేంద్రం పట్టించుకోకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ రైతులను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో వ్యవసాయాన్ని పండుగలా మార్చుతున్నారని చెప్పారు. ఇందులో భాగంగానే 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలు తెచ్చారని, ఎరువుల కొరత లేకుండా చేశారని గుర్తుచేశారు. గతేడాది నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో చెరువులు నింపుతున్నారని, దేవాదుల ప్రాజెక్టు మూడోదశ నుంచి నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట, ములుగు, భూపాలపల్లి తదితర నియోజకవర్గాలకు సాగు, తాగు నీరందుతుందని చెప్పారు. దేవాదుల మూడోదశలో భాగంగా చారిత్రక రామప్ప చెరువు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా మారిందని, ఎత్తిపోతలతో రామప్ప చెరువులోకి వస్తున్న దేవాదుల నీరు వరంగల్ రూరల్ జిల్లాలోని పాకాల, రంగాయ ప్రాజెక్టులకు, ములుగు జిల్లాలోని లక్నవరం, భూపాలపల్లి జిల్లాలోని గణపసముద్రం చెరువులోకి చేరుతుందని తెలిపారు. ఇదే దేవాదుల మూడోదశలో బ్యాలెన్సింగ్ రిజర్వాయరైన చలివాగు ప్రాజెక్టు నుంచి దేవాదుల నీటిని మిషన్ భగీరథ పథకం ద్వారా పరకాల వంటి పట్టణానికి సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. దేవాదుల మూడో దశ, కాళేశ్వరం మూడో టీఎంసీ పనులు ఆపాలని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ మొదట ఆగస్టు 7న సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారని, ఈ ప్రాజెక్టులకు సంబంధించి సీఎం కేసీఆర్ సమాచారం ఇచ్చినా కేంద్ర జలశక్తి మంత్రి తిరిగి ఈ నెల 11న మళ్లీ లేఖ రాశారని, పనులు ఆపకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి తన లేఖలో పేర్కొన్నారని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఈ ప్రాజెక్టుల పనులపై కమిషన్ వేయాలి లేదా విచారణ జరపాలి గానీ పనులు ఆపాలని ఆదేశాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గోదావరిలో వృథాగా పోతున్న జలాలను వాడుకుంటే తప్పేమిటన్నారు. దేవాదుల మూడోదశ, కాళేశ్వరం మూడో టీఎంసీ పనులు ఆపితే వరంగల్‌రూరల్ జిల్లా ఎడారిలా మారే ప్రమాదముందని, రైతులకు కష్టాలు తప్పవని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ఆదేశాలను ఉప సంహరించుకునే దాకా రైతుల పక్షాన పోరాడుతామని, ఇప్పటికే నర్సంపేట నియోజకవర్గంలో దీనిపై ఉత్తర యుద్ధం నడుస్తున్నదని, రోజూ 40వేల లేఖలను ప్రజలు కేంద్రానికి పంపుతున్నారని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా 29న వరంగల్‌రూరల్ కలెక్టరేట్ ఎదుట జరిగే నిరాహారదీక్షలో రైతులు సహా అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కేంద్ర వైఖరిపై నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో రైతులతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సీహెచ్ సదానందం, టీఆర్ఎస్ ముఖ్యనేతలు నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, సోదా రామకృష్ణ, సురేందర్‌రావు, జాకీర్ అలీ, రమణారెడ్డి పాల్గొన్నారు.