సోమవారం 18 జనవరి 2021
Warangal-rural - Dec 22, 2020 , 00:16:06

ఆయిల్‌పామ్‌ కు తొలిఅడుగు

ఆయిల్‌పామ్‌ కు తొలిఅడుగు

 • ఉమ్మడి జిల్లాలో సాగు అంచనా94,182 హెక్టార్లు 
 • సాగు కోసం కంపెనీకో జిల్లా కేటాయింపు
 • ఎంవోయూ కుదుర్చుకునే పనిలో కంపెనీలు
 • మొక్కల పెంపకం కోసం త్వరలో జిల్లాకో నర్సరీ
 • ప్రాసెసింగ్‌ కోసం ప్రతి జిల్లాలో ఓ ఫ్యాక్టరీ 

ఆయిల్‌పామ్‌ సాగుకు తొలిఅడుగు పడింది. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 94,182 హెక్టార్ల సాగుకు అవకాశమున్నట్లు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ రంగంలో అనుభవమున్న కంపెనీలను జిల్లాలవారీగా ఇటీవల ఖరారు చేసింది. ఈమేరకు సదరు సంస్థల ప్రతినిధి బృందం రంగంలోకి దిగగా ఉద్యానశాఖతో త్వరలో ఒప్పందం చేసుకోనుంది. ఇందులో భాగంగా మొక్కల పెంపకం కోసం ముప్పై ఎకరాల్లో ప్రతి జిల్లాకో నర్సరీతో పాటు ప్రాసెసింగ్‌ ప్లాంట్‌నూ నిర్మించనుంది. నియంత్రిత సాగులో భాగంగా మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటల సాగును ప్రోత్సహిస్తున్న సర్కారు మూడు దశాబ్దాల పాటు దిగుబడి, లాభాలనిచ్చే ఆయిల్‌పామ్‌కు ఊతమివ్వడంతో రైతాంగం ఆసక్తి చూపుతోంది.

- వరంగల్‌ రూరల్‌, నమస్తే తెలంగాణ

 • జిల్లాలవారీగా పొటెన్షియల్‌ ఏరియా గుర్తింపు
 • ఉమ్మడి జిల్లాలో 94,182 హెక్టార్లు అంచనా
 • సాగు కోసం కంపెనీకో జిల్లా కేటాయింపు
 • ఎంవోయూ కుదుర్చుకునే పనిలో కంపెనీలు
 • మొక్కల పెంపకానికి త్వరలో జిల్లాకో నర్సరీ
 • ప్రాసెసింగ్‌ కోసం ప్రతి జిల్లాలో ఓ ఫ్యాక్టరీ 

ఆయిల్‌ పామ్‌ సాగుకు తొలి అడుగు పడింది. ఈ పంట సాగుకు అనువైన జిల్లాలు, ఆయా జిల్లాల్లో పొటెన్షియల్‌ ఏరియాను ప్రభుత్వం నోటిఫై చేసింది. జిల్లాల వారీగా కంపెనీలను కూడా ఖరారు చేసింది. దీంతో సదరు కంపెనీల ప్రతినిధులు రంగంలోకి దిగారు. ఉద్యాన శాఖతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుని నర్సరీలను ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలే రైతులు సాగు చేసేలా ప్రభుత్వం ఈ ఏడాది నియంత్రిత సాగు విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో రైతులను ఆయిల్‌ పామ్‌ సాగులో ప్రోత్సహించాలని నిర్ణయించింది. దీనిపై ఇటీవల సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌లో ఉద్యానశాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. అనువుగా ఉన్న పొటెన్షియల్‌ ఏరియాలో ఆయిల్‌ పామ్‌ సాగు చేపట్టాలని ఆదేశించారు. దీంతో ఒకసారి మొక్కలు నాటితే మూడు దశాబ్దాల పాటు దిగుబడులు, లాభాలు వచ్చే అవకాశమున్న ఆయిల్‌ పామ్‌ సాగుకు ఉద్యానశాఖ అధికారులు పక్కా ప్రణాళిక రూపొందించారు. కాగా, ఆయిల్‌ పామ్‌ సాగుకు ప్రభుత్వం నోటిఫై చేసిన 25 జిల్లాల్లో వరంగల్‌ ఉమ్మడి జిల్లాకు చెందిన ఆరు జిల్లాలు ఉండడం విశేషం. 

94,182 హెక్టార్లు

ఆయిల్‌ పామ్‌ సాగు కోసం ప్రభుత్వం ఆరు జిల్లాల్లో 94,182 హెక్టార్ల పొటెన్షియల్‌ ఏరియాను నోటిఫై చేసింది. ఇందులో అత్యధికంగా మహబూబాబాద్‌ జిల్లాలో 28,164 హెక్టార్లు ఉంది. ఆ తర్వాత వరంగల్‌రూరల్‌ జిల్లాలో 23,118 హెక్టార్లు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 19,900, ములుగు జిల్లాలో 10,000, జనగామ జిల్లాలో 7,400, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 5,600 హెక్టార్ల విస్తీర్ణాన్ని ప్రభుత్వం పొటెన్షియల్‌ ఏరియాగా నోటిఫై చేసింది. ఆయా జిల్లాల్లో నోటిఫై చేసిన ఏరియా మొత్తం ఒకే సంవత్సరం కాకుం డా, ఏడాదికి కొంత ఏరియాలో ఆయిల్‌ పామ్‌ సాగు చేసేవిధంగా అధికారులు ప్లాన్‌ చేస్తున్నారు.తొలి విడుత ఈ ఏడాది ఆయా జిల్లాలో సాగు చేయనున్న ఏరియాను త్వరలో ఉద్యాన శాఖ అధికారులు ఖరారు చేసే అవకాశం ఉంది. లాభదాయకమైన పంట కావడంతో రైతులు ఆయిల్‌ పామ్‌ సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాల్లో రైతులు అధికారులకు దరఖాస్తులు అందజేశారు. నిబంధనల ప్రకారం ఆయిల్‌ పామ్‌ సాగుకు అధికారులు ఎంపిక చేసిన ఏరియా రైతులకు ప్రభుత్వం మొక్కల నుంచి మొదలుకుని ఎరువుల వరకు వివిధ దశల్లో సబ్సిడీలను అందజేయనుంది. 

ఖరారైన కంపెనీలివే..

అర్హత గల కంపెనీలను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఆయిల్‌ పామ్‌ రంగంలో అనుభవం ఉన్న కంపెనీలను గుర్తించి ఒక్కో జిల్లాను ఒక కంపెనీకి కేటాయించింది. మహబూబాబాద్‌ జిల్లాను గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌ లిమిటెడ్‌ దక్కించుకుంది. వరంగల్‌రూరల్‌ జిల్లా రామ్‌చరణ్‌ ఆయిల్‌ ఇండస్ట్రీస్‌, భూపాలపల్లి జిల్లా జీఎం రెడ్డి కాటన్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌, ములుగు జిల్లా చిద్రుపి ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌, జనగామ జిల్లా త్రీఎఫ్‌ ఆయిల్‌ పామ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, వరంగల్‌ అర్బన్‌ జిల్లా కేఎన్‌ బయోసైన్సెస్‌ (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌కు దక్కింది. షరతుల ప్రకారం ఆయా కంపెనీల ప్రతినిధులు ప్రభుత్వానికి ఈఎండీ చెల్లించి జనవరి ఆరో తేదీలోగా ఉద్యానశాఖతో ఎంవోయూ చేసుకోవాల్సి ఉంది. అనంతరం ప్రభుత్వం తమకు కేటాయించిన జిల్లాలో ఆయా కంపెనీ 20 నుంచి 30ఎకరాల్లో నర్సరీని ఏర్పాటు చేయనుంది. సౌత్‌ అమెరికా నుంచి మొలకెత్తిన విత్తనాలు (టెనెరా హైబ్రిడ్‌) దిగుమతి చేసుకుని నర్సరీల్లో మొక్కలను పెంచనుంది. ఆరేడు నెలల్లో అంటే వచ్చే వానకాలం సీజన్‌లో రైతులకు ఈ నర్సరీల నుంచి మొక్కలను అందజేసే అవకా శం ఉంది. రైతులకు మొక్కలు ఇచ్చిన సమయం నుం చి మూడేళ్లలోపు ప్రాసెసింగ్‌ యూనిట్‌ (ఫ్యాక్టరీ)ని నెలకొల్పనుంది. ఇలా ప్రతి జిల్లాలో ఎంవోయూ కుదుర్చుకున్న కంపెనీ తొలుత నర్సరీ, ఆ తర్వాత ఫ్యాక్టరీ ఏర్పా టు చేయనుంది. ఎంవోయూ కుదుర్చుకునేందుకు సమాయత్తమవుతున్న కంపెనీల ప్రతినిధులు ఆయా జిల్లాల్లో నర్సరీ ఏర్పాటుకు అనువైన స్థలం కోసం అన్వేషిస్తున్నట్లు తెలిసింది. నర్సరీని ఆయిల్‌ పామ్‌ సాగు చేసే రైతులందరికీ అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.