మంగళవారం 19 జనవరి 2021
Warangal-rural - Dec 19, 2020 , 00:27:13

కానుకలు రెడీ!

కానుకలు రెడీ!

  • నర్సంపేట డివిజన్‌కు వెయ్యి గిఫ్ట్‌ ప్యాక్‌లు
  • తహసీల్దార్‌ కార్యాలయాలకు చేరిన కాటన్లు
  • సిద్ధం చేసిన రెవెన్యూ అధికారులు
  • క్రిస్టియన్లకు పంపిణీ చేయనున్న పెద్ది

నర్సంపేట రూరల్‌, డిసెంబర్‌ 18: తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నది. అన్ని మతాలకు సముచిత స్థానాన్ని కల్పిస్తున్నది. రంజాన్‌, బతుకమ్మ, క్రిస్మస్‌ పండులను పేదలు సైతం ఘనంగా జరుపుకునేందుకు ఏటా కానుకలు అందజేస్తున్నది. ఇందులో భాగంగా క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకుని క్రిస్టియన్లకు కానుకలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ప్రతి నియోజకవర్గానికి క్రిస్మస్‌ కానుకలు వచ్చాయి. నర్సంపేట డివిజన్‌లో రూ. రెండు లక్షల విలువ గల వెయ్యి గిఫ్ట్‌ ప్యాక్‌లు ఇప్పటికే సంబంధిత తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకున్నాయి. ఈ గిఫ్ట్‌ ప్యాక్‌లను డివిజన్‌లోని చెన్నారావుపేట, నర్సంపేట, నల్లబెల్లి, నెక్కొండ, ఖానాపురం, దుగ్గొండి మండలాల్లోని క్రిస్టియన్లకు పంపిణీకి చేసేందుకు అధికారులు సిద్ధం చేశారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి చేతుల మీదుగా ఈ గిఫ్ట్‌ప్యాక్‌లను క్రిస్టియన్లకు అందించనున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన గిఫ్ట్‌ ప్యాక్‌లను తహసీల్‌లో రెవెన్యూ అధికారులు భద్రపరిచారు.

ఏర్పాట్లలో అధికారులు

గిఫ్ట్‌లను అర్హులైన క్రిస్టియన్లకు అందించేందుకు రెవెన్యూ అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. రెండు మూడు రోజుల్లో డివిజన్‌లోని ఆరు మండలాల్లో ఉన్న అన్ని గ్రామాల క్రిస్టియన్లకు గిఫ్ట్‌లను పంపిణీ చేయనున్నారు. సంబంధిత రెవెన్యూ అధికారుల సమక్షంలో కానుకలను పారదర్శకంగా అందించేందుకు సిద్ధమయ్యారు.

పంపిణీకి సిద్ధం

క్రిస్మస్‌ గిఫ్ట్‌ ప్యాక్‌లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. అన్ని తహసీల్దార్‌ కార్యాలయాల్లో గిఫ్ట్‌ ప్యాక్‌ల కాటన్లను రెవెన్యూ అధికారులు భద్రపరిచారు. ఆరు మండలాల్లో పంపిణీ చేసేందుకు రూ. 2 లక్షల విలువైన వెయ్యి గిఫ్ట్‌లను సిద్ధం చేశారు. ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి చేతుల మీదుగా త్వరలోనే క్రిస్టియన్లకు పంపిణీ చేయనున్నారు.

రూ. 2 లక్షల విలువైన గిఫ్ట్‌లు..

వెయ్యి గిఫ్ట్‌ ప్యాక్‌ల్లో నర్సంపేట పట్టణంతో పాటు మండలానికి రూ. 80 వేల విలువైన 300 గిఫ్ట్‌ ప్యాక్‌లు, చెన్నారావుపేటకు రూ. 26 వేల విలువైన 160, నెక్కొండకు రూ. 26 వేల విలువైన 160, ఖానాపురం మండలానికి రూ. 21 వేల విలువైన 110, నల్లబెల్లికి రూ. 21 వేల విలువైన 110, దుగ్గొండి మండలానికి రూ. 26 వేల విలువైన 160 గిఫ్ట్‌ ప్యాక్‌లు వచ్చాయి.