గురువారం 21 జనవరి 2021
Warangal-rural - Dec 18, 2020 , 03:17:11

ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేస్తాం

ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేస్తాం

నర్సంపేట, డిసెంబర్‌ 17 : రైతుల ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని వరంగల్‌ రూరల్‌ జిల్లా  అదనపు కలెక్టర్‌ మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం నర్సంపేట వ్యవసాయ మార్కెట్‌ ఆవరణలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తెచ్చిన ధాన్యాన్ని జాప్యం చేయకుండా వెంటనే కాంటాలు వేయించాలన్నారు.  మద్దతు ధర ప్రకారం డబ్బులు అకౌంట్లలో వేయించేలా చూడాలని అధికారులకు సూచించారు. తూకంలో పొరపాట్లు లేకుండా చూడాలన్నారు.    అలాంటివి ఉంటే రైతులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులకు కొనుగోలు కేంద్రాల్లో సరైన సౌకర్యాలను కల్పించాలన్నారు.  ప్రతి రైతు మాస్క్‌ ధరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.  కార్యక్రమంలో ఆర్డీవో పవన్‌కుమార్‌, సివిల్‌ సప్లయ్‌ డీఎం భాస్కర్‌రావు, మార్కెట్‌ ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రసాదరావు, ఏవో, ఏఈవో అశోక్‌, గ్రేడ్‌ కార్యదర్శి సోమశేఖర్‌, సూపర్‌వైజర్‌ ఎండీ సలీం, సెంటర్‌ ఇన్‌చార్జి రజిత పాల్గొన్నారు.

రైతులకు నష్ట పరిహారం అందిస్తాం

గీసుగొండ : రైల్వే మూడో లైన్‌ నిర్మాణం కోసం రైతులు భూములు ఇవ్వాలని ఆర్డీవో మహేందర్‌జీ కోరారు. మండలంలోని శాయంపేట, వంచనగిరి గ్రామాల రైతులతో రెవెన్యూ అధికారులు నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులు భూమికి ఎంత నష్ట పరిహారం కావాలో చెప్పాలని సూచించారు. ప్రభుత్వం రైతులు అడిగిన పరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. రైతులు ఎలాంటి గొడవలకు వెళ్లకుండా రైల్వే లైన్‌ నిర్మాణం కోసం భూములను ఇవ్వాలని ఆయన కోరారు.  ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రెండు గ్రామాల్లో రైతులు కోల్పోతున్న భూముల వివరాలను అయన తెలిపారు. రైల్వేలైన్‌ నిర్మాణంలో ఎంత భూమి పోతుందో అధికారులు పూర్తిగా సర్వే చేయాలని సూచించారు. సమావేశంలో రైల్వే డీఎం సూర్యనారాయణ, ఆర్‌ఐ అర్జున్‌, సర్వేయర్‌ గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు.


logo