ప్రారంభోత్సవాలకు ముహూర్తం ఖరారు..?

- నిర్మాణ పనులు పూర్తి చేశాం
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశాలతో రైతువేదిక భవన నిర్మాణ పనులను గడువులోగా పూర్తి చేయించాం. నూతన హంగులు, సకల సౌకర్యాలతో నిర్మించాం. ప్రజా ప్రతినిధులు, అధికారులు రైతువేదికను ప్రారంభిస్తే రైతు సేవలకు భవనాన్ని అప్పగిస్తాం.
-బాషబోయిన సుధాకర్, పెర్కవేడు
రైతు వేదిక గుత్తేదారు
రాయపర్తి : రైతాంగ సంక్షేమం కోసం సమీక్షలు, సమావేశాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.కోట్ల వ్యయంతో మండలంలోని 39 గ్రామ పంచాయతీల పరిధిలో గల 5 వ్యవసాయ క్లస్టర్లలో చేపట్టిన నూతన రైతువేదిక భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. ఉపాధి హామీ పథకం-రాష్ట్ర వ్యవసాయశాఖ సంయుక్త నిర్వహణలో సుమారు 95 శాతం పనులు పూర్తి చేసినట్లు గుత్తేదారులు ఇటీవల మంత్రి దయాకర్‌రావుకు తెలిపారు. ఈ క్రమంలో నిర్మాణ పనులు పూర్తి చేయించిన విద్యుత్ సబ్ స్టేషన్ల ప్రారంభోత్సవాలు, సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అంతేగాక మండల కేంద్రం లో గ్రామ పంచాయతీ నేతృత్వంలో సర్పంచ్ గారె నర్సయ్య సారథ్యంలో ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో చేపట్టిన షాపింగ్ కాంప్లెక్స్, పెర్కవేడు గ్రామంలో నూతనంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ భవన నిర్మాణ పనులు తుది దశకు చేరాయి. ఈ భవనాలను కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
20న ముహూర్తం ఖరారు..?
మండలంలోని 5 వ్యవసాయ క్లస్టర్ల పరిధిలో నిర్మించిన రైతువేదిక భవనాలు, పలు గ్రామాల్లో విద్యుత్ సబ్స్టేషన్లు, రాయపర్తి, పెర్కవేడు గ్రామాల్లోని గ్రామ పంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్‌లు, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఈ నెల 20వ తేదీన ప్రారంభించనున్నట్లు సమాచారం. మండలంలో పర్యటించి అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.