ఆదివారం 24 జనవరి 2021
Warangal-rural - Dec 11, 2020 , 01:29:33

మిర్చికి తెగుళ్ల బెడద

మిర్చికి తెగుళ్ల బెడద

  • జిల్లాలో దెబ్బతింటున్న మిర్చి పంటలు
  • తోటలపై విలయతాండవం చేస్తున్న వైరస్‌
  • ఆందోళనలో రైతులు

నర్సంపేట రూరల్‌: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తోడు వివిధ రకాల తెగుళ్లు సోకడంతో మిర్చి తోటలు దెబ్బతింటున్నాయి. వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి పంట సాగు చేయగా చేతికందే దశలో మిర్చి పంటకు వింత తెగుళ్లు, వైరస్‌ సోకి ఎండిపోతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని పరకాల, వర్ధన్నపేట నియోజకవర్గాల కంటే నర్సంపేట నియోజకవర్గంలోనే ఎక్కువ రైతులు మిర్చి పంట సాగు చేస్తున్నారు. ఈ సీజన్‌లో జిల్లాలో 8,913 హెక్టార్లలో 11,256 మంది రైతులు మిర్చి సాగు చేశారు. చపాట (దేశవాళి) మిర్చికి నర్సంపేట డివిజన్‌ పెట్టింది పేరు. డివిజన్‌లోని నర్సంపేట, నల్లబెల్లి మండలాల్లోనే చపాట మిర్చిని పెద్ద మొత్తంలో రైతులు పండిస్తున్నారు. చెన్నారావుపేట, నెక్కొండ, శాయంపేట, పరకాల, గీసుగొండ, ఆత్మకూరు మండలాల్లో కూడా రైతులు కొంత మేర మిరప సాగు చేపట్టారు. నర్సంపేట డివిజన్‌లో పండించిన చపాట మిర్చిని ముంబై, నాగ్‌పూర్‌, అహ్మదాబాద్‌, జలగాం తదితర ప్రాంతాల్లో విక్రయిస్తుంటారు. ఈ సంవత్సరం మిర్చి పంటకు వేరుకుళ్లు తెగుళ్లు సోకి కొమ్మ ఎండి పోతూ పూతరాలిపోవడంతో పాటు కాయలను పురుగులు తింటున్నాయి. తెగుళ్ల నివారణకు ఎన్ని మందులు పిచికారీ చేసినా ఫలితం ఉండడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చపాట మిర్చికి కేరాఫ్‌..

చపాట మిర్చి అనగానే నర్సంపేట డివిజన్‌ గుర్తుకు వస్తుంది. ఇక్కడ నాణ్యమైన చపాట మిర్చిని పండిస్తుంటారు. ఈ నేపథ్యంలో భారీ వర్షాలకు తోడు నకిలీ విత్తనాలు, వైరస్‌, వేరుకుళ్లు తెగుళ్లు సోకడంతో ఈ ఏడాది మిర్చి రైతుల ఆశలు అడియాసలవుతున్నాయి. వేలాది రూపాయల పెట్టుబడి పెట్టామని, ప్రస్తుత పరిస్థితిని చూస్తే అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నర్సంపేట మండలంలో దాసరిపల్లి, కమ్మపల్లి, భాంజీపేట, చంద్రయ్యపల్లి, నాగుర్లపల్లి, మాదన్నపేట, పర్శనాయక్‌తండా, ఆకులతండా, ముత్తోజిపేట, మహేశ్వరం, సీతారాంతండా, భోజ్యానాయక్‌తండా, చక్రంతండా, ఇటుకాలపల్లి, గురిజాల, లక్నేపల్లిలో రైతులు అధికంగా మిర్చి సాగు చేశారు. ఎకరాకు ఇప్పటి వరకు పెట్టుబడి రూపంలో రూ. 35 వేల నుంచి రూ. 40 వేల వరకు ఖర్చు అయినట్లు రైతులు చెబుతున్నారు. పంట బాగా వస్తే ఎకరాకు 18 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి వచ్చేదని, ప్రస్తుతం 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి రావడం కష్టమేనని వాపోతున్నారు. రైతులకు నిత్యం అందుబాటులో ఉండి మిర్చి పంట సాగుబడిలో సలహాలు, సూచనలు అందించాల్సిన ఉద్యానశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

8,913 హెక్టార్లలో సాగు ..

జిల్లాలోని 11,256 మంది రైతులు 8,913 హెక్టార్లలో మిర్చి సాగు చేశారు. నర్సంపేట మండలంలో 1881 హెక్టార్లు, నల్లబెల్లిలో 1671 హెక్టార్లు, ఆత్మకూరులో 212 హెక్టార్లు, చెన్నారావుపేటలో 659 హెక్టార్లు, దామెరలో 308 హెక్టార్లు, దుగ్గొండిలో 821 హెక్టార్లు, గీసుగొండలో 231 హెక్టార్లు, ఖానాపురంలో 79 హెక్టార్లు, నెక్కొండలో 515 హెక్టార్లు, పరకాలలో 802 హెక్టార్లు, పర్వతగిరిలో 158 హెక్టార్లు, రాయపర్తిలో 331 హెక్టార్లు, సంగెంలో 324 హెక్టార్లు, శాయంపేటలో 830 హెక్టార్లు, వర్ధన్నపేటలో 91 హెక్టార్లలో మిర్చి పంట సాగైనట్లు ఆయా డివిజన్ల హార్టికల్చర్‌ అధికారులు తెలిపారు.

రూ. 35 వేల పెట్టుబడి అయింది

పన్నెండేళ్లుగా చపాట మిర్చి సాగు చేస్తున్నాం. ఎకరాకు రూ. 35 వేల పెట్టుబడి అయింది. అధిక దిగుబడి, నాణ్యమైన ఉత్పత్తి కోసం బిందు సేద్యం చేస్తున్నాం. ఈ ఏడు వింత తెగుళ్లు, వైరస్‌ సోకి పెట్టుబడి చేతికి రావడం కష్టంగా మారింది.

- భూక్యా వీరూనాయక్‌, భాంజీపేట రైతు

ఉద్యాన శాఖ అధికారుల జాడలేదు

మిర్చి పంట సాగులో రైతులకు సరైన సలహాలు ఇచ్చేందుకు ఉద్యాన శాఖ అధికారులు గ్రామాలను సందర్శించిన దాఖలాలు లేవు. ఈసారి మిర్చి తోటకు వింత తెగుళ్లు, వైరస్‌ సోకింది. అధికారులు ఏ ఒక్క రోజు తోటలను పరిశీలించలేదు.

- మారపాక అనిత, మహిళా రైతు 

ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి

విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న ఉద్యానశాఖ అధికారులపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. ఈ దఫా ఆశించిన దిగుబడి రావడం కష్టంగా మారింది. మిర్చి సాగు చేసినప్పటి నుంచి ఏ అధికారి పరిశీలించకపోవడం బాధాకరం.

- ఆకుల వీరస్వామి, మాదన్నపేట రైతు


logo