అన్నదాతలకు అండగా కదిలిన దండు

- కదంతొక్కిన టీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వివిధ సంఘాల నేతలు
- బీజేపీ సర్కారుపై కన్నెర్ర
- అంతటా రహదారుల దిగ్బంధం
- మోదీ దిష్టిబొమ్మల దహనం
- రోడ్లపై వంటావార్పు
- తిరగని బస్సులు..
- తెరుచుకోని దుకాణాలు
- ఉమ్మడి జిల్లాలో ‘భారత్ బంద్' సక్సెస్
- ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ప్రదర్శన
- పలుచోట్ల ఉరితాళ్లతో నిరసన
- రైతు వ్యతిరేక చట్టాలు
- రద్దు చేయాలని డిమాండ్
- పలువురు నేతల అరెస్ట్.. విడుదల
- కార్యక్రమాల్లో పాల్గొన్న
- మంత్రులు ఎర్రబెల్లి, ఈటల, సత్యవతి, ఎంపీలు, ఎమ్మెల్సీలు
- నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు
- అన్నం పెట్టే రైతన్నలకు బీజేపీ సున్నం..
- మోదీ తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలు రైతులకు ఉరితాళ్లు..
- రైతుల నడ్డి విరిచే చట్టాలు మాకొద్దు..
- రైతును ముంచే చట్టాలను రద్దు చేయాలి
- రైతు వ్యతిరేకి బీజేపీ నశించాలి..
- రైతులు కావాలా..? కార్పొరేట్ శక్తులు కావాలా?..
- రాష్ట్రంలో విద్యుత్ బోర్డులపై కేంద్ర పెత్తనం ఎందుకు?..
.. అంటూ కేంద్రంలోని బీజేపీ సర్కారుపై టీఆర్ఎస్తోపాటు వామపక్ష పార్టీలు,వివిధ సంఘాల నేతలు ధ్వజమెత్తారు. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేలా ఉన్న కేంద్రం చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌తో మంగళవారం చేపట్టిన ‘భారత్ బంద్'కు సంపూర్ణ మద్దతు తెలిపి రైతులకు అండగా నిలిచి దండులా కదిలివచ్చారు. ఉమ్మడి జిల్లాలో రహదారులను దిగ్బంధించి వంటావార్పు నిర్వహించారు. పలుచోట్ల ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దహనం చేసి, ఉరితాళ్లు మెడకు వేసుకుని నిరసన తెలిపారు. రైతులతో కలిసి ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో భారీ ప్రదర్శనలిచ్చారు. కార్యక్రమాల్లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఈటల రాజేందర్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొని కేంద్రం తీరుపై మండిపడ్డారు. ఉదయం నుంచి షాపులన్నీ మూత పడగా, బస్సులు ఎక్కడా రోడ్డెక్కలేదు.
- వరంగల్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ
కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు ఎర్రబెల్లి, ఈటల, సత్యవతి, ఎంపీలు, ఎమ్మెల్సీల
నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలుటీఆర్ఎస్ ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో భారీగా నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేపట్టారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆధ్వర్యంలో వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిలోని మడికొండలో ధర్నా నిర్వహించగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పాల్గొన్నారు. పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తిలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎడ్లబండ్ల ర్యాలీలో, తొర్రూరు జాతీయ రహదారి దిగ్బంధనంలో మంత్రి దయాకర్‌రావు పాల్గొనగా, తొర్రూరులో మంత్రిని పోలీసులు అరెస్టు చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఎమ్మెల్యే శంకర్‌నాయక్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ధర్నాలో గిరిజన సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేసి కాసేపటి తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. వరంగల్-ఖమ్మం రహదారిపై వర్ధన్నపేటలో జరిగిన ధర్నాలో మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే అరూరి రమేశ్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్‌లో జరిగిన రైతు నిరసనలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని వరంగల్-ఖమ్మం రహదారిలో ఉన్న నాయుడు పంపు జంక్షన్లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో రోడ్డు దిగ్బంధనం చేయగా రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్, టీఆర్ఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు గుండు సుధారాణి పాల్గొన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోనూ భారత్ బంద్ విజయవంతమైంది. జనగామలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ పీ సంపత్‌రెడ్డి పాల్గొన్నారు. వరంగల్ పశ్చిమ నియోజవర్గంలోని ములుగు రోడ్డులో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య హాజరయ్యారు. డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ ఆధ్వర్యంలో మరిపెడలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రంలో జరిగిన బైక్ ర్యాలీలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీ అధ్యక్షుడు సంపత్‌రెడ్డి, రాష్ట్ర వికలాంగుల సంస్థ చైర్మన్ కే వాసుదేవరెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో పరకాలలో, వరంగల్-భూపాలపట్నం జాతీయ రహదారిపై గూడెప్పాడ్ వద్ద భారీ ధర్నా చేశారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, జడ్పీ అధ్యక్షురాలు జక్కు శ్రీహర్షిణి పాల్గొన్నారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో నర్సంపేట, నెక్కొండ, చెన్నారావుపేటలో బంద్ విజయవంతమైంది. హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి, భీమదేవరపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వీ సతీశ్‌కుమార్, వరంగల్ అర్బన్ జిల్లా జడ్పీ చైర్మన్ ఎం సుధీర్‌కుమార్ పాల్గొన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో జడ్పీ చైర్మన్ కే జగదీశ్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ధర్నా చేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమాలకు టీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ర్యాలీలు, కేంద్ర వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు.
- కదంతొక్కిన టీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ,
- సీపీఎం, వివిధ సంఘాల నేతలు
(వరంగల్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ)
వ్యవసాయరంగాన్ని నిర్వీర్యం చేసేలా ఉన్న కేంద్ర ప్రభుత్వ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌తో మంగళవారం చేపట్టిన ‘భారత్‌బంద్' ఉమ్మడి జిల్లాలో విజయవంతమైంది. అన్నదాతలకు అండగా అన్ని వర్గాల వారు నిరసనల్లో పాల్గొన్నారు. వర్తక, వ్యాపార, ఉద్యోగ, కార్మిక సంఘాలు తోడుగా నిలిచాయి. టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆందోళన చేశారు. ఉమ్మడి జిల్లాలో జాతీయ, రాష్ట్ర రహదారులను దిగ్బంధించారు. రోడ్లపైనే వంటావార్పు చేశారు. పలుచోట్ల ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. మెడకు ఉరితాళ్లలో నిరసన తెలిపారు. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో బంద్ సంపూర్ణంగా జరిగింది. నగరంలో దుకాణాలన్నీ మూతపడ్డాయి. వామపక్ష పార్టీలు, కాంగ్రెస్, కార్మిక సంఘాల నేతలు ప్రత్యక్షంగా నిరసనల్లో పాల్గొన్నారు.