శుక్రవారం 22 జనవరి 2021
Warangal-rural - Dec 07, 2020 , 02:12:46

సబ్‌ సెంటర్లలోనూ టెస్టులు

 సబ్‌ సెంటర్లలోనూ టెస్టులు

  • సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో సర్కారు నిర్ణయం
  • ఇక కరోనా వైరస్‌ పరీక్షలు విస్తృతం
  • లక్ష్యాలు పెంచిన వైద్య ఆరోగ్యశాఖ
  • లక్షణాలు లేని వారికీ పరీక్షలు

కరోనా సెకండ్‌ వేవ్‌ కలవరపెడుతున్న క్రమంలో విస్తృతంగా పరీక్షలు నిర్వహిం చాలని ప్రభుత్వం ఆదేశించింది. మహ మ్మారిని ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని సీఎం కేసీఆర్‌ ప్రక టించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈమేరకు వైద్యారోగ్య శాఖ సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలతో పాటు తాజాగా సబ్‌ సెంటర్లలోనూ టెస్టులు చేస్తోంది. ప్రతి ఉప కేంద్రంలో రోజుకు పది పరీక్షలు చేయాలని లక్ష్యం విధించడం తో పాటు అవసరమైతే ఇంటింటికీ వెళ్లాలని సిబ్బందికి స్పష్టంచేసింది.

-వరంగల్‌ రూరల్‌, నమస్తే తెలంగాణ

  • సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో సర్కారు నిర్ణయం
  • ఇక కరోనా వైరస్‌ పరీక్షలు విస్తృతం
  • లక్ష్యాలు పెంచిన వైద్య ఆరోగ్యశాఖ
  • ప్రతి ఉప కేంద్రంలో రోజు 10 టార్గెట్‌
  • లక్షణాలు లేని వారికీ పరీక్షలు
  • అవసరమైతే ఇంటింటికీ వెళ్లి టెస్టులు

వరంగల్‌ రూరల్‌, నమస్తే తెలంగాణ : కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. పరీక్షలు విస్తృతం చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ ఆర్టీ పీసీఆర్‌, ర్యాపిడ్‌ యాంటీబాడీ టెస్టుల సంఖ్య పెంచింది. కేవలం కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌(సీహెచ్‌సీ)లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రా(పీహెచ్‌సీ)ల్లోనే పరీక్షలు చేస్తుండగా తాజాగా , అధికారులు సబ్‌ సెంటర్లలో ర్యాపిడ్‌ యాంటీబాడీ టెస్టులు చేస్తున్నారు. ఇన్నాళ్లు సీహెచ్‌సీల్లో ఆర్‌టీపీసీఆర్‌తోపాటు ర్యాపిడ్‌ యాంటీబాడీ టెస్టులు చేయగా, పీహెచ్‌సీల్లో కేవలం ర్యాపిడ్‌ యాంటీబాడీ టెస్టులు నిర్వహించారు. అదికూడా లక్షణాలు ఉన్న వారికే పరీక్షలు చేశారు. అనుమానం వ్యక్తం చేసిన వారికి చేసేవారు కాదు. గ్రామాల్లో అయితే వైరస్‌ లక్షణాలు కనిపించిన వారికి ఆయా పీహెచ్‌సీల నుంచి మెడికల్‌ ఆఫీసర్‌ అనుమతితో ఏఎన్‌ఎంలు, హెల్త్‌ అసిస్టెంట్లు, సూపర్‌వైజర్లు వెళ్లి ర్యాపిడ్‌ యాంటీబాడీ టెస్టులు నిర్వహించారు. ఆర్‌టీపీసీఆర్‌ టెస్టు అవసరమైతే అందుబాటులో ఉన్న సీహెచ్‌సీలకు పంపారు. ఇలా వరంగల్‌ రూరల్‌ జిల్లాలో ఇప్పటివరకు సీహెచ్‌సీలు, పీహెచ్‌సీల్లో 60వేలకు పైగా ఆర్‌టీ పీసీఆర్‌, ర్యాపిడ్‌ యాంటీబాడీ టెస్టులు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

ప్రతి సబ్‌ సెంటర్‌కు టార్గెట్‌

ప్రభుత్వ ఆదేశాలతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రతిరోజు కరోనా వైరస్‌ పరీక్షల లక్ష్యాన్ని పెంచారు. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో మూడు సీహెచ్‌సీలు, 17 పీహెచ్‌సీలుండగా వీటిలో ప్రతి రోజు ఒక్కో సీహెచ్‌సీలో ఆర్‌టీపీసీఆర్‌, ర్యాపిడ్‌ యాంటీబాడీ టెస్టులు, పీహెచ్‌సీలో ర్యాపిడ్‌ యాంటీబాడీ టెస్టులు 50 చొప్పున నిర్వహించారు. ఈ లెక్కన జిల్లాలో రోజుకు 1,150 టెస్టులు చేశారు. సెకండ్‌ వేవ్‌ దరిమిలా ఇప్పుడు ప్రతి సబ్‌ సెంటర్‌లో 10 టెస్టులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలోని 17 పీహెచ్‌సీల పరిధిలో 153 సబ్‌ సెంటర్లు ఉన్నాయి. రెండు నుంచి నాలుగు గ్రామాలకు ఒక సబ్‌ సెంటర్‌ పనిచేస్తుంది. ప్రతి సెంటర్‌ పరిధిలో రోజుకు పది ర్యాపిడ్‌ యాంటీబాడీ టెస్టులు చేసేలా టార్గెట్‌ పెట్టుకోవాలని జిల్లాలోని పీహెచ్‌సీ వైద్యాధికారులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి చల్లా మధుసూదన్‌ ఆదేశాలు జారీ చేశారు. సబ్‌ సెంటర్ల లో ఏఎన్‌ఎంలు, హెల్త్‌ అసిస్టెంట్లు, సూపర్‌వైజర్లు కచ్చితంగా ర్యాపిడ్‌ యాంటీబాడీ టెస్టులు చేయాలని, అవసరమైతే సబ్‌ సెంటర్‌కు రాలేని స్థితిలో ఉన్న వృద్ధులు, ఇతరుల ఇళ్లకు వెళ్లి కరోనా పరీక్షలు చేయాలని స్పష్టం చేశారు. పాజిటివ్‌ వచ్చినా కొందరిలో వైరస్‌ లక్షణాలు కనబడకపోతుండడం వల్ల అనుమానంతో పరీక్ష చేయించుకోవడానికి ముందుకొచ్చిన వారికి లక్షణాలు లేకపోయినా ర్యాపి డ్‌ యాంటీబాడీ టెస్టులు నిర్వహించాలని ఆయన మెడికల్‌ ఆఫీసర్లకు చెప్పారు. రెండు మూడు రోజుల నుంచి జిల్లాలోని సబ్‌ సెంటర్లలో ఏఎన్‌ఎంలు, హెల్త్‌ అసిస్టెంట్లు, సూపర్‌వైజర్లు ర్యాపిడ్‌ యాంటీబాడీ టెస్టులు జరుపుతున్నారు. సబ్‌ సెంటర్‌కు రాలేని వారి కోసం ఇంటింటికీ వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

విధిగా మాస్కులు ధరించాలి

కరోనా సెకండ్‌ వేవ్‌ ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. వైరస్‌ సోకిందనే అనుమానంతో ముందుకొచ్చిన వారితోపాటు లక్షణాలు లేని వ్యక్తులకు కూడా ఇప్పుడు టెస్టు లు చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ విధి గా మాస్కులు పెట్టుకోవాలి. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. భౌతిక దూరం పాటించాలి. వ్యాక్సిన్‌ కోసం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య, ఆరోగ్య సిబ్బంది వివరాలను ప్రభుత్వానికి పంపాం. వ్యాక్సిన్‌ రాగానే మొదట హెల్త్‌ స్టాఫ్‌కు ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచన.

- చల్లా మధుసూదన్‌, డీఎంహెచ్‌వో, వరంగల్‌ రూరల్‌logo