బుధవారం 27 జనవరి 2021
Warangal-rural - Dec 05, 2020 , 01:43:34

కల్లాల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి

కల్లాల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి

  • ఏవో అడిదెల సంపత్‌రెడ్డి
  • పలు గ్రామాల్లో కల్లాల పనులు ప్రారంభం

నెక్కొండ: పంట కల్లాల నిర్మాణ పనుల్లో రైతులు వేగం పెంచాలని ఏవో అడిదెల సంపత్‌రెడ్డి కోరారు. పత్తిపాకతండా, గాంగ్యతండా, చిన్నకొర్పోలులో కల్లాల నిర్మాణ పనులను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. మండలంలో 229 కల్లాల నిర్మాణ పనులకు అనుమతులు లభించినట్లు చెప్పారు. 15 రోజుల్లో పనులు పూర్తి చేయాలని కోరారు.

ప్రతి రైతు కల్లం నిర్మించుకోవాలి

వర్ధన్నపేట: పంట ఉత్పత్తులను ఆరబెట్టుకోవడానికి ప్రతి రైతు విధిగా కల్లం నిర్మించుకోవాలని ఏవో రాంనర్సయ్య సూచించారు. మండలంలోని ఇల్లంద, దమ్మన్నపేట, ఉప్పరపల్లి తదితర గ్రామాల్లో కల్లాల నిర్మాణాలకు ముగ్గు పోయించారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు ఏటా పరదాలు కొనుగోలు చేస్తూ నష్టపోతున్నారన్నారు. పరదాల్లో ధాన్యం కూడా సరిగా ఆరడం లేదన్నారు. రైతులు సీసీతో కల్లాలు నిర్మించుకుంటే ధాన్యం నాణ్యంగా ఉంటుందన్నారు. తద్వారా మద్దతు ధర లభిస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు పూర్తిగా ఉచితంగా, ఇతర రైతులు 10 శాతం చెల్లిస్తే పూర్తిస్థాయిలో కల్లాలను ప్రభుత్వమే నిర్మిస్తుందని తెలిపారు. ఇందులో రూ. 55 వేలు, రూ. 65 వేలు, రూ. 85 వేల విలువ చేసే కల్లాలను నిర్మిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.

ఉత్పత్తులను ఆరబెట్టేందుకు కల్లాలు దోహదం   

నర్సంపేట రూరల్‌: పంట ఉత్పత్తులను ఆరబెట్టేందుకు కల్లాలు దోహదం చేస్తాయని చంద్రయ్యపల్లి ఎంపీటీసీ పెద్ది శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గ్రామంలో కల్లం నిర్మాణ పనులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు కల్లాల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు బరిగెల కిశోర్‌, డబ్బ రాజు, దేవేందర్‌, రమేశ్‌, రవి, తిరుపతిరెడ్డి, సాంబరెడ్డి, టీఏలు భద్రు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

కల్లాలను వినియోగించుకోవాలి 

నల్లబెల్లి: రైతులు కల్లాలను వినియోగించుకోవాలని ఏవో పరమేశ్వర్‌ అన్నారు. రాంపూర్‌లో కల్లాల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పంట ఉత్పత్తులు నాణ్యంగా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతులకు కల్లాలను మంజూరు చేసిందన్నారు. మండలానికి 212 కల్లాలు మంజూరయ్యాయని తెలిపారు. మేడపల్లి 3, నల్లబెల్లి 8, గోవిందాపూర్‌ 5, అర్శనపల్లి 2, నారక్కపేటలో ఒకటి కలిపి మొత్తం 19 కల్లాల పనులు ప్రారంభమైనట్లు వెల్లడించారు. ఏఈవో శ్రీకాంత్‌, రైతులు పాల్గొన్నారు.


logo