సోమవారం 18 జనవరి 2021
Warangal-rural - Dec 03, 2020 , 01:50:15

పీడీఎస్‌ రైస్‌ కేసులో కీలక నిర్ణయం

పీడీఎస్‌ రైస్‌ కేసులో కీలక నిర్ణయం

  • రైస్‌ పరిశీలన అధికారిగా రూరల్‌ డీఎం
  • పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ ఉత్తర్వులు
  • శాంపిల్‌ తీసి నివేదిక పంపాలని ఆదేశాలు

వరంగల్‌రూరల్‌, నమస్తే తెలంగాణ : దుర్గంపేట పీడీఎస్‌ రైస్‌ కేసులో కీలక నిర్ణయం వెలువడింది. పీడీఎస్‌ రైస్‌గా పోలీసుల దృష్టికి వచ్చిన వరంగల్‌ ఏనుమాములలోని గోడౌన్‌లో గల బియ్యాన్ని పరిశీలించే అధికారి నియామకంపై ఉత్కంఠకు తెరపడింది. గోడౌన్‌లో ఉన్న వివాదాస్పద రైస్‌ నమూనా సేకరించి నివేదిక పంపాలని పౌరసరఫరాల సంస్థ వరంగల్‌రూరల్‌ జిల్లా మేనేజర్‌(డీఎం) భాస్కర్‌రావును ఆదేశిస్తూ బుధవారం పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆత్మకూరు పోలీసు స్టేషన్‌ పరిధి దుర్గంపేట గ్రామం నుంచి వరంగల్‌ అర్బన్‌ జిల్లా కాజీపేట మండలంలోని ఓ రైస్‌మిల్లు యజమాని 135 క్వింటాళ్ల పీడీఎస్‌ రైస్‌ను సీఎంఆర్‌ కింద వరంగల్‌ ఏనుమాములలోని పౌరసరఫరాల సంస్థ గోడౌన్‌లో డెలివరీ చేశాడని, ఈ సంస్థ టెక్నికల్‌ అసిస్టెంట్‌ సదరు రైస్‌ క్వాలిటీ పరిశీలించి గోడౌన్‌లోకి అనుమతించాడని, వీటి క్వాలిటీ క్వాంటిటీపై రైస్‌మిల్లు యజమానికి ఫైనల్‌ ఆక్సప్టెన్సీ కూడా ఇచ్చాడని పోలీసుల విచారణలో తేలడం, ఏనుమాముల గోడౌన్‌లో ఉన్న ఈ బియ్యాన్ని రీఅనాల్సిస్‌ చేసి తమకు రిపోర్టు ఇవ్వాలని పౌరసరఫరాల సంస్థ వరంగల్‌ అర్బన్‌ డీఎంకు పోలీసులు లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై వరంగల్‌ అర్బన్‌ డీఎం కృష్ణవేణి కొద్ది రోజు ల క్రితం వివాదాస్పద రైస్‌ రీఅనాల్సిస్‌ కోసం ప్రత్యేకంగా ఒక టెక్నికల్‌ అసిస్టెంట్‌ను కేటాయించాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ను లేఖ ద్వారా కోరారు. ప్రజా పంపిణీ కోసం చౌకడిపోలకు తరలిపోయే అవకాశం ఉన్నందున ఆత్మకూరు ఇన్‌స్పెక్టర్‌ రంజిత్‌ సమక్షంలో ఆమె నాలుగు రోజుల క్రితం దుర్గంపేట నుంచి వచ్చినట్లుగా పోలీసులు పేర్కొంటున్న బియ్యాన్ని ఏనుమాముల గోడౌన్‌లో ఒక పక్కన పెట్టించారు. ఎవరూ ముట్టుకోకుండా వాటిచుట్టూ మార్కింగ్‌ చేశారు. తాజా పరిణామాలతో పోలీసులు ఈ కేసు విచారణ వేగవంతం చేశారు. 

ఈ క్రమంలో ఏనుమాములలోని గోడౌన్‌లో గల వివాదాస్పద రైస్‌ను రీఅనాల్సిస్‌ చేసే బాధ్యతలను పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ రూరల్‌ డీఎం భాస్కర్‌రావుకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సంస్థ వరంగల్‌ అర్బన్‌ డీఎం, ఆత్మకూరు పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌తో కలిసి సమన్వయంతో గోడౌన్‌లో వివాదాస్పద బియ్యం గల ఏసీకే (270 క్వింటాళ్ల) రైస్‌ను పరిశీలించి శాంపిల్‌ సేకరించాలని కమిషనర్‌ ఉత్తర్వుల్లో భాస్కర్‌రావును ఆదేశించారు. ఈ మేరకు డీఎం భాస్కర్‌రావు ఏనుమాములలోని గోడౌన్‌ సందర్శించి వివాదస్పద రైస్‌ క్వాలిటీ క్వాంటిటీ పరిశీలించి నివేదిక ఇవ్వనున్నారు. దీంతో కేసు విచారణలో మరింత ముందుకు వెళ్లే ఆలోచనలో పోలీసులు ఉన్నట్లు తెలిసింది. నివేదికలో పీడీఎస్‌ రైస్‌ ఉన్నట్లు తేలితే పౌరసరఫరాల సంస్థలో శాఖాపరమైన చర్యలకు ఉన్నతాధికారులు ఉపక్రమించే అవకాశం ఉంది. ఈ కేసులో రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ పాత్రపైనా పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది.