మంగళవారం 19 జనవరి 2021
Warangal-rural - Dec 03, 2020 , 01:13:59

8 ఎకరాల భూమికి ఎసరు

8 ఎకరాల భూమికి ఎసరు

  • రూ. కోటి విలువైన ప్రభుత్వ స్థలంపై కన్నేసిన కబ్జారాయుళ్లు
  • భూమిని దున్నుతున్నా పట్టించుకోని అధికారులు
  • డీఆర్వో, తహసీల్దార్‌ పరిశీలించినా ఆగని కబ్జా పర్వం
  • డంపింగ్‌యార్డు, శ్మశాన వాటికల నిర్మాణానికి స్థలం కరువు
  • కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామంటున్న సర్పంచ్‌లు   

నర్సంపేట రూరల్‌ : ఆక్రమణదారులు సర్కారు భూమిని దర్జాగా దున్నేస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో కబ్జారాయుళ్లు యథేచ్ఛగా ప్ర భుత్వ భూములను ఆక్రమిస్తున్నారు. రూ.కోటి విలువైన భూమిని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తుంటే రెవె న్యూ అధికారులు అటువైపు తొంగి చూ డడం లేదు. ఇటీవల నర్సంపేట ఇన్‌చార్జి ఆర్డీవో, డీఆర్వో హరిసింగ్‌,  తహసీల్దార్‌ వాసం రామ్మూర్తి ఈప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. ఐనప్పటికీ ఫలితం లేదు. ఓ వైపు కొందరు ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తుంటే మరోవైపు సంక్షే మ పథకాలైన డంపింగ్‌యార్డు, శ్మశాన వాటికల నిర్మాణానికి ప్ర స్తుతం స్థలం కరువైంది. దాదాపు 8 ఎకరాల భూమిని అప్పనంగా కాజేస్తున్నారు. రెండు నెలల క్రితం రెవెన్యూ అధికారులు ఆక్రమణకు గురైన స్థలాన్ని పరిశీలించినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. 

మండలంలోని భాంజీపేట, భోజ్యానాయక్‌తండా గ్రామ పంచాయతీల శివారు నర్సంపేట నుంచి నల్లబెల్లికి వెళ్లే ప్రధాన రహదారిని అనుకుని సర్వేనంబర్‌ 492లో 12.04 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం భాంజీపేట గ్రామస్తులు ప్రభుత్వ స్థలం చుట్టూ హద్దులు ఏర్పాటు చేశారు. కాగా, ప్రధాన రహదారిని అనుకుని ఉండడంతో ఈ భూమికి మార్కెట్‌లో మంచి ధర పలుకుతున్నది. 3 నెలల క్రితం 12.04 ఎకరాల్లో తెలంగాణ ప్రభుత్వం గోదాం నిర్మాణానికి 4.30 ఎకరాలను తీసుకున్నది. ప్రస్తుతం ఈ స్థలంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మిగిలిన 8 ఎకరాల స్థలంపై అక్రమార్కుల కన్నుపడింది. ఈ భూమిని ఆనుకుని తమ వ్యవసాయ భూములు ఉన్న కొందరు రైతులు యథేచ్ఛగా దున్నేస్తున్నారు.  

రికార్డులు మార్చేందుకు యత్నం..

కొన్నేళ్లుగా అధికారులను మచ్చిక జేసుకుంటూ వచ్చిన కబ్జాదారులు భూ మి రికార్డులనే మాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తున్నది. రూ. కోటి విలువైన భూమిని తమ పే రిట చేసుకునేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. కాగా, భాంజీపేట, భోజ్యానాయక్‌తండా పంచాయతీ పాలకవర్గాలు పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఆ భూమికి హద్దులు నిర్ణయించనట్లు తెలుస్తున్నది.

డంపింగ్‌యార్డులకు స్థలం కరువు..

భాంజీపేట, భోజ్యానాయక్‌తండాలకు ప్రస్తుతం డంపింగ్‌యార్డు, శ్మశాన వాటికల నిర్మాణాలకు స్థలం కరువైంది. రెండు నెలల క్రితం సర్వే నంబర్‌ 492లోని ప్రభుత్వ భూమిని నర్సంపేట ఇన్‌చార్జి ఆర్డీవో, డీఆర్వో హరిసింగ్‌, తహసీల్దార్‌ వాసం రామ్మూర్తి పరిశీలించి వాటి నిర్మాణ పనులు చేపట్టాలని సర్పంచ్‌లు, కార్యదర్శులకు సూచించారు. అందుకుగాను ఈ స్థలం నుంచి అర ఎకరం స్థలాన్ని కేటాయించారు. దీంతో రెండు గ్రామాల పంచాయతీ పాలకులు పనులు మొదలుపెట్టారు. ఇటీవల రూ. లక్ష వెచ్చించి మొరం పోయించి చుట్టూ చదును చేశారు. కాగా, చుట్టుపక్కల భూముల రైతులు ఈ ప్రభుత్వ స్థలాన్ని కాజేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సర్వేయర్‌ నుంచి మొదలుకుని రెవెన్యూ అధికారుల కనుసన్నల్లోనే ఆక్రమణలు కొనసాగుతున్నాయని పలువురు ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. కలెక్టర్‌కు ఈ విషయంపై ఫిర్యాదు చేయనున్నట్లు ఇరు గ్రామాల సర్పంచ్‌లు తెలిపారు. 

అధికారుల మాటలు నీటి మూటలేనా?

‘నమస్తేతెలంగాణ’ దినపత్రిక ప్రభుత్వ భూమి ఆక్రమణను 2018 సెప్టెంబర్‌లోనే వెలుగులోకి తీసుకొచ్చింది. భాంజీపేట శివారులో ‘8 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణ’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి అప్పట్లో రెవెన్యూ అధికారులు స్పందించారు. సర్వేనంబర్‌ 492లో ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. కానీ భూమిని కబ్జా కోరల నుంచి కాపాడేందుకు చర్యలు మాత్రం తీసుకోలేదు. ఆ తర్వాత తహసీల్దార్‌ బదిలీ కావడంతో పట్టించుకోలేదు. కాగా, ఈ స్థలాన్ని సర్వే చేసి చుట్టూ హద్దులు ఏర్పాటు చేయిస్తామని తహసీల్దార్‌ చెప్పి సంవత్సరం దాటినా నేటికీ కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం రెవెన్యూ అధికారులు ధరిణి రిజిస్ట్రేషన్‌ పనిలో నిమగ్నమయ్యారు. ఇదే అదనుగా భావించిన కొందరు ఆక్రమార్కులు మూడు రోజులుగా ఈ భూమిని ట్రాక్టర్లతో చదును చేయిస్తున్నారు. 

మా దృష్టికి వచ్చింది..

- వాసం రామ్మూర్తి, తహసీల్దార్‌  

భాంజీపేట, భోజ్యానాయక్‌తండా గ్రామాల శివారులోని ప్ర భుత్వ స్థలాన్ని కొందరు ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే విషయం  ప్రజాప్రతినిధులు, గ్రామస్తుల ద్వారా మా దృష్టికి వ చ్చింది. ఆస్థలాన్ని పూర్తిగా పరిశీలిం చి ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే చూస్తూ ఊరుకోం. రెవెన్యూ సిబ్బంది ఎవరైనా అక్రమాలకు పా ల్పడితే చర్యలు తీసుకుంటాం.