ఆదివారం 17 జనవరి 2021
Warangal-rural - Dec 02, 2020 , 01:27:21

పోలీసు శాఖలో పీడీఎస్‌ రైస్‌ కలకలం

పోలీసు శాఖలో పీడీఎస్‌ రైస్‌ కలకలం

  • దుర్గంపేట కేసుతో తెరపైకి అక్రమాల బాగోతం
  • ఎంత డబ్బు చేతులు మారిందనే విషయంపై చర్చ
  • ఎవరి పాత్ర ఎంత అనేది తెలుసుకుంటున్న సీపీ
  • టాస్క్‌ఫోర్స్‌ తీరుపై గుర్రు... రైస్‌ కేసులపై నజర్‌
  • అక్రమార్కుల్లో కలవరం

వరంగల్‌ రూరల్‌, నమస్తే తెలంగాణ: దుర్గంపేట పీడీఎస్‌ రైస్‌ కేసు పోలీసు శాఖలో కలకలం రేపుతున్నది. ముఖ్యంగా శాంతి భద్రతల విభాగంలోని పలువురు అధికారులతో పాటు టాస్క్‌ఫోర్స్‌ పనితీరుపై చర్చ తెరపైకి వచ్చింది. తమ స్వప్రయోజనాల కోసం వివిధ పోలీసు స్టేషన్లలోని అధికారులు అక్రమ వ్యాపారాలకు సహకరిస్తుండడాన్ని వరంగల్‌ పోలీసు కమిషనర్‌ ప్రమోద్‌కుమార్‌ తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇదే సమయంలో టాస్క్‌ఫోర్స్‌ వ్యవహార శైలిపైనా ఆయన గుర్రుగా ఉన్నారు. రూరల్‌ జిల్లా ఆత్మకూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని దుర్గంపేట వద్ద డీసీఎం వ్యాన్‌, బొలెరో వాహనంలో ఉన్న 130 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని స్థానిక లాఅండ్‌ఆర్డర్‌ పోలీసులతో కలిసి టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకోవడం, కొందరు పోలీసు అధికారులు ముడుపులు పుచ్చుకుని ఈ కేసు విచారణను నీరు గార్చడం, తన దృష్టికి రాగానే సీపీ ప్రమోద్‌కుమార్‌ ఆత్మకూరు ఇన్‌స్పెక్టర్‌ రంజిత్‌ను పిలిచి రీ ఇంక్వైరీకి ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో వరంగల్‌ ఏనుమాములలోని పౌరసరఫరాల సంస్థ గోడౌన్‌కు చేరిన దుర్గంపేట పీడీఎస్‌ రైస్‌ రీఅనాల్సిస్‌ కోసం ఆత్మకూరు ఇన్‌స్పెక్టర్‌ రంజిత్‌ సివిల్‌ సప్లయ్‌ వరంగల్‌ అర్బన్‌ జిల్లా మేనేజర్‌ (డీఎం) కృష్ణవేణికి లేఖ రాసి కేసు విచారణలో ముందుకు వెళ్తున్నారు. కేసు విచారణలో సహకరించాలని ఆయన దుర్గంపేటలో పీడీఎస్‌ రైస్‌ కొనుగోలు చేసిన రైస్‌మిల్లర్‌కూ నోటీసు జారీ చేశారు. రీఅనాల్సిస్‌ కోసం టెక్నికల్‌ అసిస్టెంట్‌(టీఏ)ను కేటాయించాలని తమ కమిషనర్‌ను కోరినట్లు డీఎం కృష్ణవేణి వెల్లడించారు.

ఎవరి పాత్ర ఎంత?

విశ్వసనీయ సమాచారం ప్రకారం దుర్గంపేట పీడీఎస్‌ రైస్‌ కేసు నమోదైన వెంటనే సంబంధిత రైస్‌ మిల్లర్‌ తరఫున ములుగు మండలానికి చెందిన ఓ వ్యాపారి టాస్క్‌ఫోర్స్‌లో పని చేస్తున్న అధికారుల్లో ఒకరిని కలిశాడు. అతను ములుగు, వరంగల్‌ రూరల్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో పీడీఎస్‌ రైస్‌ బిజినెస్‌ చేస్తున్నాడు. తనకున్న పరిచయాలతో ఈ ప్రావీణ్యుడు దుర్గంపేట కేసు విచారణ నీరు గార్చడంపై సదరు అధికారితో మాట్లాడాడు. అవగాహన కుదరడంతో రూ. 2.50 లక్షలు చేతులు మారినట్లు తెలిసింది. ఇది ముగ్గురు అధికారులకు అందినట్లు సమాచారం. ఈ ముగ్గురిలో లా అండ్‌ ఆర్డర్‌ అధికారులు ఇద్దరు ఉన్నట్లు తెలిసింది. సీపీ దృష్టికి వచ్చాక ముగ్గురిలో ఒకరు తాను పుచ్చుకున్న డబ్బును ఓ రైస్‌మిల్లర్‌ ద్వారా తిరిగి ఇచ్చినట్లు తెలిసింది. ఇతను రిటన్‌ ఇచ్చిందెంత?, మిగత ఇద్దరు అధికారులకు ముట్టిన డబ్బెంత? అనేది కూడా తన నెట్‌వర్క్‌ ద్వారా సీపీకి సమాచారం అందినట్లు తెలిసింది. ప్రస్తుతం దీనిపై పోలీసు శాఖలో హాట్‌ టాపిక్‌ నడుస్తున్నది. దుర్గంపేట కేసులో డబ్బు తీసుకున్న ముగ్గురు అధికారులపై వేటు పడనుందా? అనే కోణంలోనూ చర్చ జరుగుతున్నది.

టాస్క్‌ఫోర్స్‌ తీరుపై సీరియస్‌

పోలీసు శాఖలో కీలకమైన లా అండ్‌ ఆర్డర్‌ విభాగం చాలా పనులు చేయాల్సి వస్తున్నందున అక్రమ వ్యాపారాలు, అసాంఘిక కార్యకలా పాలను అడ్డుకునేందుకు ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు జరిగింది. నిషేధిత గుట్కా రవాణా, అమ్మకాలు, గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, పేకాట, వ్యభిచారం, బెట్టింగ్‌లు, ఇతర అక్రమ దందాల పై నిఘా ఉంచి పట్టుకోవడం టాస్క్‌ఫోర్స్‌ పని. గుడుంబా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం, పటికతో పాటు అక్రమంగా తరలిస్తున్న, నిల్వ చేసిన పీడీఎస్‌ రైస్‌ను, కల్తీ, నకిలీ విత్తనాలు, పురుగుమందులు, ఇతర వస్తువులను పట్టుకోవడం, చీకటి వ్యాపారాలకు చెక్‌ పెట్టడం, మాఫియాలకు కళ్లెం వేయడం, అసాంఘిక శక్తుల్లో గుండెల్లో నిద్రపోవడం వంటివి టాస్క్‌ఫోర్స్‌ లక్ష్యాలు. వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని టాస్క్‌ఫోర్స్‌ తమ లక్ష్యాలను పక్కనపెట్టి స్వప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు సీపీ భావిస్తున్నట్లు సమాచారం. టాస్క్‌ఫోర్స్‌లోని అధికారుల్లో కొందరు అక్రమ వ్యాపారులతో సంబంధాలు పెట్టుకోవడం, అవగాహన కుదుర్చుకుని చీకటి దందాలకు సహకరించడం వంటివి చేస్తున్నారని ఆయనకు సమాచారం అందినట్లు తెలిసింది. సీపీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రమోద్‌కుమార్‌ విధి నిర్వహణలో ఆరోపణలొచ్చిన పలువురు పోలీసులపై శాఖపరమైన చర్యలు తీసుకున్నారు. తాజా పరిణామాలతో టాస్క్‌ఫోర్స్‌, లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు పీడీఎస్‌ రైస్‌ పట్టుకుని నమోదు చేసిన కేసులన్నింటిపైనా సీపీ నజర్‌ పెట్టినట్లు తెలిసింది. కేసుల విచారణలో పురోగతి, పట్టుబడిన పీడీఎస్‌ రైస్‌ ఎక్కడివి, ఎవరివి, ఎక్కడకు వెళ్తున్నాయి, అరెస్టయిన వ్యక్తులెవరు, వాటి వెనక ఉన్న కథ ఏమిటి అనే వివరాలను తన నెట్‌వర్క్‌ ద్వారా ఆయన తెలుసుకుంటున్నట్లు సమాచారం.