బుధవారం 20 జనవరి 2021
Warangal-rural - Dec 01, 2020 , 01:46:11

శాశ్వత పరిష్కారం

శాశ్వత పరిష్కారం

  •  రూ. 10 కోట్లతో డ్రైనేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు
  • సమస్యను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే చల్లా
  • సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి
  • అంచనాలు తయారు చేసిన సాగునీటి శాఖ
  • nత్వరలో ప్రభుత్వ ఆమోదం లభించే అవకాశం
  • తీరనున్న పరకాలలోని ‘ముంపు’ ప్రజల కష్టాలు

పరకాలలో దామెర చెరువు ఉంది. దీన్ని ప్రభుత్వం మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేస్తున్నది. ఇప్పటికే కొన్ని పనులు పూర్తి చేసింది. సుందరీకరణ పనులు చేయాల్సి ఉంది. వానకాలం భారీ వర్షాలు కురిస్తే ఈ చెరువు మత్తడి ద్వారా వరద నీరు ఇక్కడ ఉన్న శ్రీనివాసకాలనీ మీదుగా ప్రవహిస్తుంది. సమీపంలోని పైడిపల్లి చెరువులోకి వెళ్లేందుకు ఓ కాలువ, దీనిపై శ్రీనివాసకాలనీ వద్ద కల్వర్టులు ఉన్నాయి. ఏకదాటిగా భారీ వర్షాలు పడిన సమయంలో చెరువు మత్తడి ద్వారా వచ్చే వరద ఉధృతితో నీరు కాలవలో నుంచి శ్రీనివాసకాలనీలోకి చేరుతుంది. ఇళ్లలోకి నీరొచ్చి కాలనీ జలమయమవుతుంది. ఇటీవల ఇదే జరిగింది. ఆగస్టులో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో దామెర చెరువు మత్తడి ద్వారా వరద నీరు శ్రీనివాసకాలనీని ముంచెత్తింది. కల్వర్టులు నీట మునిగాయి. పరకాల- హుజురాబాద్‌ ప్రధాన రహదారిపైకి చేరింది. శ్రీనివాసకాలనీ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోయారు. ఈ కాలనీ ఆనుకుని ఉన్న మమతనగర్‌లోకి కూడా వరద నీరు చేరింది. ఇళ్లలో నిలిచిన వరద నీటిని బయటకు పంపేందుకు అధికారులు జేసీబీలను వాడారు. ఒక దశలో ప్రధాన రహదారిపై ఉన్న డివైడర్‌ను కూడా తొలగించారు. స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి స్వయంగా పరకాలలో వరద ముంపు ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. కాలినడన వరదలో క్షేత్రస్థాయి పరిస్థితిని పరిశీలించి చలించిపోయారు. సమస్యను ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటానని బాధితులకు భరోసా ఇచ్చారు. 

నిధుల మంజూరుకు సీఎం కేసీఆర్‌ హామీ

పరకాలలో వరద ముంపు సమస్య మళ్లీ ఎప్పుడూ తలెత్తకుండా తీసుకోవల్సిన చర్యలపై ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో చర్చించారు. శాశ్వత పరిష్కారం కోసం దామెర చెరువు మత్తడి ద్వారా బయటకు వచ్చే నీరు నేరుగా పైడిపల్లి చెరువులోకి వెళ్లేలా ప్రస్తుతం ఉన్న కాలవ, కల్వర్టులను విస్తరించడంతో పాటు అవసరమైన చోట కొత్తగా డ్రైనేజీ నిర్మించడం అనివార్యమని భావించారు. ఈ మేరకు ఆయన పరకాలలోని దామెర చెరువు వరద ముంపు సమస్యపై సీఎం కేసీఆర్‌ను కలిశారు. గత ఆగస్టులో ప్రజలకు ఎదురైన ఇబ్బందులను వివరించారు. శాశ్వత పరిష్కారం కోసం రూ.10 కోట్లు కేటాయించాలని కోరారు. సీఎం కేసీఆర్‌ సానుకూలంగా స్పందించి నిధుల మంజూరుకు  హామీ ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యే చల్లా సాగునీటి శాఖ ఇంజినీర్లతో సమావేశమై అంచనాలు వేయాలని చెప్పారు. ఈ మేరకు ఇంజినీర్లు పరకాలలోని దామెర చెరువు మత్తడి నీరు బయటకు వెళ్లేందుకు ప్రస్తుతం శ్రీనివాసకాలనీ మీదుగా ఉన్న కాలువలో పూడిన మట్టిని తొలగించి, మరింత విస్తరించేందుకు, కొత్తగా 9 మీటర్ల వెడల్పుతో 900 మీటర్ల పొడవున డ్రైనేజీ నిర్మించేందుకు అంచనాలు వేశారు. శ్రీనివాసకాలనీ వద్ద రెండు కల్వర్టులు, సమీపంలోని బంధం రోడ్డులో ఒక కల్వర్టు, శ్రీనివాసకాలనీ దగ్గరలో బసుడిపో వద్ద పూడిపోయే స్థితిలో ఉన్న కాలువను పునరుద్ధరించడంతో పాటు ఇక్కడ 5 మీటర్ల వెడల్పుతో 50 మీటర్ల పొడవున కొత్తగా డ్రైనేజీ నిర్మాణానికి అంచనాలు తయారు చేశారు. భారీ వర్షాలు కురిసినా దామెర చెరువు మత్తడి ద్వారా బయటకు వచ్చిన వరద నీరు కాలనీని ముంచెత్తకుండా నేరుగా పైడిపల్లి చెరువులోకి చేరుకునేలా ఎస్టిమేట్స్‌ రూపొందించారు. రూ.10 కోట్లతో డ్రైనేజీ నివేదికను కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే చల్లా ప్రభుత్వానికి అందజేశారు. ఆయన ప్రత్యేక చొరవ చూపడంతో, సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చినందున త్వరలోనే పనులకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. ఈ నిధులు మంజూరైన వెంటనే టెండర్ల ప్రక్రియ నిర్వహించి పనులు చేపట్టేందుకు సాగునీటి శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

పరకాల పట్టణంలో వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. డ్రైనేజీ నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాగునీటి శాఖ ఇంజినీర్లు తాజాగా రూ.10 కోట్లతో అంచనాలు తయారు చేశారు. వరద నీరు వెళ్లేందుకు ప్రస్తుతం ఉన్న కాలువలను విస్తరించడంతో పాటు అదనంగా కొత్త డ్రైనేజీ, కల్వర్టుల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రాగానే పనులు చేపట్టనున్నారు.  

-వరంగల్‌రూరల్‌, నమస్తే తెలంగాణ


logo