మంగళవారం 26 జనవరి 2021
Warangal-rural - Nov 30, 2020 , 01:44:58

అవగాహనతోనో అంతం చేద్దాం

అవగాహనతోనో అంతం చేద్దాం

  • ప్రాణాంతక ఎయిడ్స్‌ను తరిమికొడుదాం
  • అవగాహనతో కట్టడి సాధ్యం
  • జిల్లాల్లో తగ్గుతున్న ఎయిడ్స్‌ కేసులు 
  • రేపు ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం  

నర్సంపేట రూరల్‌ : సమాజాన్ని పట్టిపీడిస్తున్న అంతుచిక్కని వ్యాధి (హెచ్‌ఐవీ)ఎయిడ్స్‌. దీని బారినపడి వేలాది మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. హెచ్‌ఐవీ (హ్యూమన్‌ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్‌) వల్ల ఎయిడ్స్‌ వ్యాధి సోకుతుంది. మనిషి ప్రాణాలను హరించే ఈ వ్యాధిని అవగాహనతో అంతం చేయా లి. ప్రాణాంతకమైన ఎయిడ్స్‌ను తరిమికొట్టేందుకు ప్రజలంతా నడుంబిగించాలి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో గత ఏడాది నుంచి ఇప్పటి వరకు నమోదైన కేసులు తక్కువే. జిల్లాల్లో ఎయిడ్స్‌ కేసులు తగ్గుముఖం పట్టాయని చెప్పడానికి అధికారులు తెలిపిన గణాంకాలే నిదర్శనంగా చెప్పవచ్చు. డిసెంబర్‌ 01న ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం నేపథ్యంలో ప్రత్యేక కథనం.. 

ఈ రోజు ఎలా వచ్చింది..

1981లో లాస్‌ఏంజిల్స్‌లో తొలిసారిగా ఎయిడ్స్‌ కేసును వైద్యులు గుర్తించారు. అప్పటి నుంచి దీనిపై పరిశోధనలు చేస్తున్న వైద్యులు మందును కనుగొనే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఇది విపరీతంగా వ్యాప్తి చెందడం, మరణాల సంఖ్య రోజుకోజుకూ పెరగడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిపై అవగాహన కల్పించాలని నిర్ణయించింది. 1988లో డిసెంబర్‌ 01ని ప్రపంచ ఎయిడ్స్‌ దినంగా ప్రకటించింది. ఈ రోజున అన్ని వర్గాల ప్రజలు ఎయిడ్స్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని డబ్ల్యూహెచ్‌వో సూచించింది. 

వ్యాధి ఎలా సోకుతుంది?

ఈ వ్యాధి నాలుగు విధాలుగా సోకుతుంది. ఇది ఒకరి నుంచి మరొకరికి లైంగిక చర్యల వల్ల, జాగ్రత్తలు పాటించకుండా చేసే రక్తమార్పిడి వల్ల, పుట్టినప్పుడు, పాలిచ్చినప్పుడు తల్లి నుంచి బిడ్డకు, వాడిన సిరంజీలనే వాడడం వల్ల సోకుతుంది. ఎక్కువగా లైంగిక చర్యల ద్వారానే వ్యాప్తి చెందింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 36మిలియన్ల మంది ఎయిడ్స్‌తో మృతి చెందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరో 34 మిలియన్ల మంది ఎయిడ్స్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. 

అవగాహనతో నివారించాలి

ప్రస్తుతం ఎయిడ్స్‌ను సమూలంగా నియంత్రించే మందుగానీ, టీకా గానీ మార్కెట్‌లోకి రాలేదు. దీనిపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. సురక్షితం కాని లైంగిక సంబంధాలను కొనసాగించొద్దు. ఎప్పటికప్పుడు ఫ్రెష్‌ సిరంజీలు, నీడిళ్లను వాడాలి.రక్త మార్పిడి చేసేటప్పుడు కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. నూతన, స్టెరిలైజ్డ్‌ నీడిల్స్‌ మాత్రమే ఉపయోగించాలి. ప్రభుత్వ ఆమోదిత బ్లడ్‌బ్యాంక్‌ (రక్తనిధి)నుంచి పొందిన రక్తాన్ని మాత్రమే ఉపయోగించాలి. గర్భిణులు విధిగా హెచ్‌ఐవీ పరీక్ష చేయించుకోవాలి. అంతేకాకుండా ఎయిడ్స్‌ వ్యాధి కట్టడికి ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. జాతీయ స్థాయిలో చైల్డ్‌ఫర్‌ ఇండియా అనే సంస్థ, ఎయిడ్స్‌ కంట్రోల్‌ బోర్డు, జిల్లా ఎయిడ్స్‌ నివారణ సంస్థలతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాయి. 

అందుబాటులో ఏఆర్‌టీ కేంద్రాలు

హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ బాధితులకు వైద్య సేవలందించడం కో సం ఏఆర్‌టీ కేంద్రాలు ఉన్నాయి. 350 అంతకంటే తక్కువ తెల్లరక్తకణాలు ఉన్న వారు, హెచ్‌ఐవీ ఉన్న గర్భిణులు, టీబీ, హెచ్‌ఐవీ ఉన్న వారు జీవితాంతం మందులు వాడాల్సి ఉం టుంది. హెచ్‌ఐవీతో బాధపడుతున్న తల్లులు, పిల్లలకు 28 వా రాల పాటు యాంటీ రిట్రోవైరల్‌ మందులు ఇవ్వడంతో ఇన్‌ఫెక్షన్లు తల్లి నుంచి బిడ్డకు సంక్రమించకుండా నివారించవచ్చును. ఎయిడ్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని డిసెంబర్‌ 01న జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించనున్నారు. 

జిల్లాలో కేంద్రాలు ఇలా..

జిల్లాలో ఐసీటీసీ కేంద్రాలు 3, ఎఫ్‌ఐ-ఐసీటీసీ కేంద్రాలు 19(పీహెచ్‌సీ-17, పీపీపీ-2), లింక్‌ ఏఆర్‌టీ ప్లస్‌ కేంద్రం-1,లింక్‌ ఏఆర్‌టీ కేంద్రాలు-2, విహాన్‌కేర్‌ అండ్‌ సపోర్ట్‌ కేం ద్రం-1,రక్త నిధి కేంద్రం-1, రక్తనిల్వ కేంద్రాలు-1 ఉన్నాయి. 

వరంగల్‌ రూరల్‌ జిల్లాలో...

2017ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 14,352 మందికి హెచ్‌ఐవీ రక్త పరీక్షలు చేయగా 97(0.68శాతం) మందికి హెచ్‌ఐవీ ఉన్నట్లుగా అధికారులు నిర్ధారించారు. 10,091 గర్భిణులు మందికి హెచ్‌ఐవీ రక్త పరీక్ష నిర్వహించగా ముగ్గురికి (0.03శాతం) హెచ్‌ఐవీ ఉన్నట్లు తేల్చారు. ప్రస్తుతం ఏప్రిల్‌ 2018 నుంచి గత అక్టోబర్‌ 2019-2020 వరకు 5,084 మందికి హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించగా 41(0.80శాతం)మందికి ఈ వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. గర్భిణులు 3,785 మందికి హెచ్‌ఐవీ పరీక్షలు చేయగా ఇద్దరికి (0.05శాతం) సోకినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో ప్రతి నెల కొత్తగా సుమారుగా 6 హెచ్‌ఐవీ కేసులు నమోదవుతున్నాయి. జిల్లాలో హైరిస్క్‌ ప్రవర్తన కలిగిన వ్యక్తులు సుమారు 1,695మంది ఉన్నారు. ఇందులో ఫిమేల్‌ 1,064, స్వలింగ సంపర్కులు 631మంది ఇప్పటికే నమోదయ్యారు.  

ప్రజల్లో అవగాహన ముఖ్యం 

ఎయిడ్స్‌ నిర్మూలనకు ప్రజల్లో అవగాహన ముఖ్యం. నివారణ, నియంత్రణలో భాగంగా వినూత్న కార్యక్రమాలతో అవగాహన కల్పిస్తున్నాం. ఎయిడ్స్‌ వ్యాధిపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి. ఎయిడ్స్‌ రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలి. 

- డాక్టర్‌ భూపేశ్‌, భాంజీపేట పీహెచ్‌సీ వైద్యాధికారి    logo