సోమవారం 25 జనవరి 2021
Warangal-rural - Nov 29, 2020 , 01:43:18

పోషణ లోపానికి చెక్‌

పోషణ లోపానికి చెక్‌

  • చిన్నారులకు బలవర్ధక ఆహారం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం
  • పోషణ లోపం ఉన్న పిల్లలకు అదనంగా పౌష్టికాహారం
  • రూరల్‌ జిల్లాలో 5,429 మంది చిన్నారుల గుర్తింపు

పరకాల : చిన్నారుల్లో పోషణ లోపం లేకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇప్పటికే అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా మాతా శిశు సంరక్షణకు చర్యలు తీసుకుంటూ గర్భిణులు, బాలింతలు, ఆరేళ్ల లోపు పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నది. కాగా, పోషణ లోపం ఉన్న చిన్నారులకు ఇకపై అదనంగా పౌష్టికాహారాన్ని అందించేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకు గాను పోషణ మాసోత్సవాల సందర్భంగా పోషణ లోపంతో బాధపడే చిన్నారులను గుర్తించారు. ఇక వారికి అందరి చిన్నారులతో సమానంగా పౌష్టికాహారాన్ని అందిస్తూనే పోషణ లోపాన్ని అధిగమించేందుకు అదనంగా పాలు, ఇతర పౌష్టికాహారాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పూర్వ ప్రాథమిక విద్యార్థులకు ఆట పాటలతో విద్యను అందించడంతో ఆరేళ్ల లోపు  చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహార లోపం లేకుండా చూస్తున్నారు. దీంతో పాటు చిన్నారులు వయసుకు తగ్గ బరువు, ఎత్తు ఉన్నారా లేదా తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు కొలతలు తీసుకుంటూ నివేదికలను ప్రభుత్వానికి పంపిస్తున్నారు.

పోషణ లోపం ఉన్న చిన్నారుల గుర్తింపు

వరంగల్‌ రూరల్‌ జిల్లా వ్యాప్తంగా పోషణ లోపం ఉన్న చిన్నారులను ఇప్పటికే గుర్తించారు. గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో గత సెప్టెంబర్‌లో పోషణ మాసోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి పోషణ ఆవశ్యకతను వివరించడంతో పాటు ఆయా గ్రామాల్లోని చిన్నారుల బరువు, ఎత్తు, భుజం చుట్టు కొతలను సేకరించి, అనారోగ్యంగా ఉన్నవారు, వయసుకు తగ్గ బరువు, ఎత్తు లేని చిన్నారులను గుర్తించారు. జిల్లాలో నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో నర్సంపేట ప్రాజెక్టు పరిధిలో ఆరేళ్ల లోపు చిన్నారులు 14,273 మంది ఉండగా 12,539 మంది వివరాలు సేకరించారు. అలాగే, పరకాల ప్రాజెక్టు పరిధిలో 9,509మంది ఉండగా 8,946 మంది చిన్నారులు, వర్ధన్నపేట పరిధిలో 14,668 మంది ఉండగా 12,607 మంది చిన్నారుల ఎత్తు, బరువు వివరాలు సేకరించారు. జిల్లాలో మొత్తంగా 38,450 మందికి 34,092మంది చిన్నారుల వివరాలు సేకరించారు.

5,429 మందికి అదనపు పౌష్టికాహారం

జిల్లా వ్యాప్తంగా 5,429 మంది చిన్నారుల్లో తీవ్ర పోషణ లోపం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో వయసుకు తగ్గ బరువు లేని వారు 895 మంది, ఎత్తుకు తగ్గ బరువు లేని వారు 1324 మంది, వయసుకు తగ్గ ఎత్తు లేని వారు 3210 మంది ఉన్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం వీరికి అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అదనపు పౌష్టికాహారాన్ని అందించే దిశగా ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ మేరకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా వీరికి సూపర్‌వైజరీ ఫీడింగ్‌ను అందించనున్నారు. తీవ్ర పోషణ లోపం ఉన్న చిన్నారులకు రోజుకు ఎనిమిది సార్లు ఆహారాన్ని అందించాల్సి ఉండగా రోజుకు ఐదు సార్లు అంగన్‌వాడీ కేంద్రాల వద్ద, మూడు సార్లు ఇంటి వద్ద ఆహారం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పాటు క్రమం తప్పకుండా ఆయా చిన్నారుల ఇండ్లను అండన్‌వాడీ టీచర్లు సందర్శించి ప్రత్యేక సూచనలు ఇచ్చేలా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ్ద

తీవ్ర పోషణ లోపం ఉన్న చిన్నారులకు అదనపు ఆహారాన్ని అందించేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇందులో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల వద్ద, ఇంటి వద్ద చిన్నారులకు అవసరమైన ఆహారాన్ని అందేలా చూడాల్సిన బాధ్యతను అంగన్‌వాడీ టీచర్లకు అప్పగించాం. వారికి రోజువారీగా అందే పౌష్టికాహరంతో పాటు సూపర్‌వైజరీ ఫుడ్‌ను అదనంగా అందిస్తూ ఆరోగ్యంగా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. 

- చిన్నయ్య, జిల్లా సంక్షేమ అధికారి, వరంగల్‌ రూరల్‌


logo