గురువారం 21 జనవరి 2021
Warangal-rural - Nov 29, 2020 , 01:43:16

జోరుగా ‘బెల్టు’ దందా

జోరుగా ‘బెల్టు’ దందా

  • నిబంధనలకు విరుద్ధంగా బెల్టుషాపులకు మద్యం విక్రయిస్తున్న వైన్‌షాపు యజమానులు 
  • మందుబాబుల హల్‌చల్‌తో ఇబ్బందులు పడుతున్న మహిళలు

వేలేరు, నవంబర్‌ 28 : మండల కేంద్రంలో బెల్టుషాపుల దందా జోరుగా సాగుతున్నది. మద్యం ఏరులై పారుతున్నది. సుమారు 25 నుంచి 30 వరకు బెల్టుషాపులు నిర్వహిస్తున్నారు. మండలంలో ఓకే వైన్‌షాపు ఉండడంతో పలు గ్రామాల్లో బెల్టుషాపులు పుట్టగొడుగుల్లా వెలిశాయి. నిబంధనలకు విరుద్ధంగా వైన్‌ షాపుకు వచ్చిన మద్యం స్టాక్‌ నుంచి సగానికి పైగా మద్యాన్ని ఎమ్మార్పీ కంటే రూ.10 నుంచి రూ.20 వరకు అదనంగా వసూలు చేసి బెల్టుషాపులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. బెల్టుషాపు నిర్వాహకులు మద్యం ప్రియుల నుంచి రూ.40 నుంచి రూ. 50 వరకు ఎక్కువగా వసూలు చేస్తూ వ్యాపారాన్ని మూడు పూలు ఆరుకాయలుగా కొనసాగిస్తున్నారు. గ్రామాల్లో దుకాణాలు, హోటళ్ల పేరుతో బెల్టుషాపులు నిర్వహిస్తున్నారు. బెల్టుషాపుల వల్ల కుటుంబాల్లో గొడవలు జరుగుతున్నాయి. చాలా మంది మద్యానికి బానిసలుగా మారుతున్నారు. బెల్టుషాపుల ప్రభావంతో యువత పెడదారిన పడుతున్నదనే ఆరోపణ వినిపిస్తున్నది. వేలేరులో ప్రధాన రహదారి పక్కనే వైన్‌షాపు ఉండడంతో మందుబాబులు రహదారిపై అడ్డదిడ్డంగా వాహనాలు పెట్టి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నారు.  

మద్యం మత్తులో 

అసాంఘిక కార్యకలాపాలు..

గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు కొనసాగుతుండడంతో కొందరు వ్యక్తులు అసాంఘిక కార్యకలపాలకు పాల్పడుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఓ వ్యక్తి మద్యం మత్తులో సామాజిక మాధ్యమాల్లో అశ్లీల వీడియోలు పంపడంతో అతడిపై పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. అలాగే ఓ వివాహితను కొందరు మద్యం మత్తులో హత్య చేశారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎక్సైజ్‌ అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదని ప్రజలు చెబుతున్నారు. తూతూ మంత్రంగా దాడులు నిర్వహిస్తున్నారే తప్ప కఠిన చర్యలు తీసుకోవడం లేదంటున్నారు. అధికారులు బెల్టుషాపులు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.   


logo