శనివారం 23 జనవరి 2021
Warangal-rural - Nov 25, 2020 , 01:50:25

కార్మిక చట్టాల సవరణలను ఉపసంహరించాలి

కార్మిక చట్టాల సవరణలను ఉపసంహరించాలి

  • ప్రతి కార్మికుడు సమ్మెలో పాల్గొనాలి
  • టీఆర్‌ఎస్‌కేవీ జిల్లా అధ్యక్షుడు యువరాజు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రవి

నర్సంపేట: కార్మిక చట్టాల సవరణలను ఉపసంహరించుకోవాలని టీఆర్‌ఎస్‌కేవీ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి అనంతగిరి రవి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పట్టణంలో మంగళవారం మున్సిపల్‌ కమిషనర్‌ విద్యాధర్‌కు సమ్మె నోటీసును అందజేసి మాట్లాడారు. ఈ నెల 26న నిర్వహించ తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలకు సవరణలు చేయడం కేంద్రానికి తగదన్నారు. సార్వత్రిక సమ్మెలో ప్రతి కార్మికుడు పాల్గొనాలని కోరారు. తెలంగాణ మున్సిపల్‌ ఎంప్లాయీస్‌ అండ్‌ కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో సమ్మె నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌కేవీ జిల్లా నాయకుడు కొల్లూరి లక్ష్మీనారాయణ, సీఐటీయూ పట్టణ కార్యదర్శి గుజ్జుల వెంకన్న, మున్సిపల్‌ యూనియన్‌ అధ్యక్షుడు మాదాసి సారయ్య, బీ భాస్కర్‌, కార్యదర్శి ఎం నర్సింహారావు, గడ్డం సమ్మయ్య, అల్వాల రాజు పాల్గొన్నారు.

సమ్మెను విజయవంతం చేయాలి

గీసుగొండ: ఈ నెల 26న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బ్రహ్మచారి పిలుపునిచ్చారు. మండలకేంద్రంలో సమ్మె  పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని  డిమాండ్‌ చేశారు. రైతులు, కార్మికులపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో నాయకులు స్వామి, శ్రీను, అరుణాదేవి, ఉమాదేవి, రాజు తదితరులు పాల్గొన్నారు.

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

చెన్నారావుపేట: రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని తెలంగాణ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం జిల్లా క్యార్యదర్శి పరికి మధుకర్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ రంగయ్య, రైతు సంఘం జిల్లా కన్వీనర్‌ కోరబోయిన కుమారస్వామి డిమాండ్‌ చేశారు. ఈ నెల 26, 27న చేపట్టనున్న ‘గ్రామీణ బంద్‌'లో భాగంగా కేంద్ర కార్యాలయాల ఎదుట చేపట్టనున్న నిరసనలను విజయవంతం చేయాలని కోరుతూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన జీపుజాత ఉర్పరపల్లి మీదుగా మండలకేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులు, మధ్య తరగతి కుటుంబాలు, కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  కార్యక్రమంలో నాయకులు యాకుబ్‌, అశోక్‌, అనిల్‌, మధు, కృష్ణ, నర్సింహరావు, యాకయ్య, కొంరయ్య పాల్గొన్నారు.

దుగ్గొండికి చేరిన జీపుజాత

దుగ్గొండి: కేంద్రం అవలంబిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఎం  ఆధ్వర్యంలో చేపట్టిన  జీపుజాత మండలకేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా నేత ఇసంపల్లి బాబు మాట్లాడుతూ కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం కాలరాస్తూ కార్పొరేట్‌ సంస్థలకు లాభాలు చేకూర్చే ప్రయత్నం చేస్తున్నదని ఎద్దేవా చేశారు. ఈ నెల 26, 27న కేంద్ర కార్యాలయాల ఎదుట నిరసనలు తెలుపాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంఘటితంగా పోరాడాలి

నెక్కొండ: కేంద్ర ప్రభుత్వ విధానాలపై సంఘటితంగా పోరాడాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సీహెచ్‌ రంగయ్య కోరారు. మండలకేంద్రంలో జరిగిన జీపుజాతలో ఆయన పాల్గొని మాట్లాడుతూ మోడీ సర్కారు నియంతృత్వ విధానాలను అవలంబిస్తున్నదని విమర్శించారు. వ్యవసాయ కార్మికులకు నష్టం జరిగేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నూతన వ్యవసాయ బిల్లులను తెచ్చిందని ధ్వజమెత్తారు. ఈ నెల 26న  సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి కోరబోయిన కుమారస్వామి, జిల్లా ఉపాధ్యక్షుడు ఈదునూరి వెంకన్న, రైతు సంఘం మండల కార్యదర్శి లింగాల మల్లయ్య, ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు చందు, గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్‌, వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి చాగంటి వెంకటయ్య పాల్గొన్నారు.

వామపక్షాల బైక్‌ ర్యాలీ 

ఈనెల 26న నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో నెక్కొండ మండలకేంద్రంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఐఎఫ్‌టీయూ, ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో వర్తక, వ్యాపార సంఘల నాయకులను కలిసి మద్దతు కోరారు. ఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఆరెళ్లి కృష్ణ ర్యాలీని ప్రారంభించగా సీఐటీయూ రాష్ట్ర నాయకుడు చాగంటి వెంకటయ్య, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కందిక చెన్నకేశవులు, వ్యకాస జిల్లా నాయకుడు ఈదునూరి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. logo