శనివారం 28 నవంబర్ 2020
Warangal-rural - Nov 22, 2020 , 02:33:51

పత్తి ధర తగ్గించడం హేయం: పెద్ది

పత్తి ధర తగ్గించడం హేయం: పెద్ది

నర్సంపేట : తెలంగాణలో సీసీఐ పత్తికి రూ.50 కోత విధించిందని, ఇది హేయమైన చర్య అని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇబ్బందుల్లో ఉన్న రైతులను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మరింత అవస్థలపాలు చేస్తున్నదని విమర్శించారు. రైతు ప్రయోజనాలపై ఇది గొడ్డలి పెట్టు అని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.5,825 ఉన్న క్వింటాల్‌ పత్తి ధరను రూ. 5775కు తగ్గించి ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. ‘అమ్మ పెట్టదు.. అడుక్కోనివ్వదు’ అన్న చందంగా బీజీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని ఎద్దేశా చేశారు. పత్తి రైతులకు నష్టం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. సన్నరకం ధాన్యం కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొస్తుంటే.. బియ్యాన్ని తాము కొనుగోలు చేయమని కేంద్రం ఆధీనంలో ఉన్న ఎఫ్‌సీఐ కొర్రీలు పెడుతున్నదని ఆరోపించారు. ఈ చర్యను ఖండిస్తున్నామని తెలిపారు. రైతులను కాపాడుకుంటామని, వారి కోసం పోరాటానికి సిద్ధంగా ఉన్నామని పెద్ది స్పష్టం చేశారు.