శుక్రవారం 04 డిసెంబర్ 2020
Warangal-rural - Nov 21, 2020 , 01:03:32

పాస్‌ పుస్తకాల జారీలో నిర్లక్ష్యం వద్దు

పాస్‌ పుస్తకాల జారీలో నిర్లక్ష్యం వద్దు

  • అదనపు కలెక్టర్‌ మహేందర్‌ రెడ్డి

దామెర, నవంబర్‌ 20 :  రైతులకు పట్టాదారు పాస్‌ పుస్తకాలు జారీ చేయడంలో నిర్లక్ష్యం తగదని రెవెన్యూ అధికారులకు అదనపు కలెక్టర్‌ మహేందర్‌ రెడ్డి సూచించారు. శుక్రవారం తహసీల్‌ను అదనపు కలెక్టర్‌ సందర్శించి ధరణి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఇటీవల దామెరకు చెందిన కౌలు రైతు సదిరం రాంచందర్‌ మృతికి సంబంధించిన వివరాలు, రైతుల ధర్నా గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ధరణి రిజిస్ట్రేషన్లకు ఎంత సమయం పడుతున్నదని అడిగారు. స్లాట్‌లు బుక్‌ చేసుకున్న రైతులకు అరగంటలోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేస్తున్నట్లు తహసీల్దార్‌ రజిని అదనపు కలెక్టర్‌కు వివరించారు. దామెరకు చెందిన కౌలు రైతు సదిరం రాంచందర్‌ పాస్‌ పుస్తకం కోసం జనవరిలో దరఖాస్తు చేసుకుంటే ఎందుకు స్పందించలేదని తహసీల్దార్‌ రజిని, వీఆర్వో కృష్ణమూర్తిని ప్రశ్నించారు. రాంచందర్‌కు ఉన్న ఎనిమిది గుంటల భూమి నాన్‌ అగ్రికల్చర్‌ కింద ఉన్నదని, అందుకు సంబంధించిన ఫైల్‌ను అదనపు కలెక్టర్‌కు తహసీల్దార్‌ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన రిజిస్ట్రేషన్‌ చేసుకున్న పలువురికి పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డీటీ హేమ, సీనియర్‌ అసిస్టెంట్‌ మేఘన, జూనియర్‌ అసిస్టెంట్‌ లక్ష్మీనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.

కొనసాగుతున్న రిజిస్ట్రేషన్లు..    

నర్సంపేట రూరల్‌ : నర్సంపేట పట్టణంలోని తహసీల్‌లో ధరణి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చేపట్టారు. ఆన్‌లైన్‌ ద్వారా రైతుల సమగ్ర వివరాలు సేకరించి అర్హులైన వారికి రిజిస్ట్రేషన్‌ పత్రాలను తహసీల్దార్‌ వాసం రామ్మూర్తి అందించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ గునిగంటి రాజ్‌కుమార్‌, డీటీ ఉమారాణి, ధరణి ఆపరేటర్‌ శివ తదితరులు పాల్గొన్నారు.    

15 నిమిషాల్లోనే..

రాయపర్తి : తహసీల్దార్‌ కార్యాలయంలో అన్నదాతలకు అధికారులు 15 నిమిషాల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసి పట్టా కాగితాలను చేతిలో పెడుతున్నట్లు తహసీల్దార్‌ సత్యనారాయణ తెలిపారు. మండలంలోని మైలారం గ్రామానికి చెందిన కర్ణ శ్రీకాంత్‌గౌడ్‌ ఇటీవల మృతిచెందగా అతడి భార్య నిరోషా పేరుపై పట్టా చేసి రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్‌ ఆకుల సురేందర్‌రావు సమక్షంలో అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ పెద్దూరి శ్రీకాంత్‌, గిర్దావర్‌ మల్లయ్య, వీఆర్వోలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. 

వేగంగా.. 

సంగెం : ధరణి రిజిస్ట్రేషన్లు వేగంగా జరుగుతున్నాయి. శుక్రవారం 8 రిజిస్ట్రేషన్లు పూర్తిచేయగా ఇందులో ఒకటి గిఫ్ట్‌, 7 సేల్‌ డీడ్‌ రిజిస్ట్రేషన్లు ఉన్నట్లు తహసీల్దార్‌ నంగునూరి రమేశ్‌ తెలిపారు.