మంగళవారం 01 డిసెంబర్ 2020
Warangal-rural - Nov 19, 2020 , 02:11:55

నర్సంపేటలో మక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

నర్సంపేటలో మక్కజొన్న  కొనుగోలు కేంద్రం ప్రారంభం

అన్నదాతలు అధైర్యపడొద్దు:   ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి

నర్సంపేట, నవంబర్‌ 18 : సన్నధాన్యం పండించిన రైతులు ఎట్టి పరిస్థితిలోనూ అధైర్య పడొద్దని,  రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నర్సంపేట వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన మక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన చట్టాలు, ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఆరు సంవత్సరాలుగా ఎలాంటి ఆంక్షలను విధించని కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాలతో తెలంగాణ రైతులు నష్టపోయిన ఈ సారే అనేక ఆంక్షలు విధించడం దుర్మార్గమన్నారు. రైతులను రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా ఆదుకుంటుందన్నారు. ఎంత క్లిష్ట పరిస్థితులు ఎదురైనా రైతుకు భరోసా ఇవ్వడం కేసీఆర్‌కే సాధ్యమన్నారు. 30 ఏండ్లు దేశాన్ని పాలించిన బీజేపీ, కాంగ్రెస్‌లు వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే ఇలాంటి దుస్థితి ఏర్పడిందన్నారు. తెలంగాణ అభివృద్ధి దిశగా పయనించడం ఆ పార్టీలకు ఏమాత్రం ఇష్టం లేదన్నారు. జస్టిస్‌ స్వామినాథన్‌ కమిషన్‌ నిర్ణయాలను ఇప్పటికీ అమలు చేయకపోవడం వల్లే రైతులు ఆర్థిక పరిపుష్టి సాధించలేకపోతున్నారన్నారు. గత సీజన్‌లో రూ.1760 మద్దతు ధర చెల్లించి మక్కలను కొనుగోలు చేయగా రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.900 నష్టపోయిందన్నారు. అయినా వెనుకడుగు వేయకుండా ఈ సీజన్‌లో రూ.1850 మద్దతు ధర పెంచి మరీ మక్కలను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఓడీసీఎంఎస్‌ చైర్మన్‌ గుగులోతు రామస్వామి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుంటి రజినీకిషన్‌, మార్కెట్‌ సెక్రటరీ ప్రసాదరావు,  మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ నాగెల్లి వెంకటనారాయణ గౌడ్‌, నాయిని నర్సయ్య పాల్గొన్నారు.