గురువారం 26 నవంబర్ 2020
Warangal-rural - Nov 18, 2020 , 02:31:07

పార్కుల పనులు పూర్తిచేయాలి

పార్కుల పనులు పూర్తిచేయాలి

  • రూరల్‌ కలెక్టర్‌ హరిత
  • రాయపర్తి మండలంలో ఆకస్మిక పర్యటన

రాయపర్తి, నవంబర్‌ 17 : పల్లె ప్రకృతి వనాలను త్వరగా పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్‌ ఎం హరిత ఆదేశించారు. మండలంలోని పలు గ్రామాల్లో కలెక్టర్‌ మంగళవారం ఆకస్మికంగా పర్యటించారు. తొలుత మండలంలోని పానీష్‌ తండాకు కలెక్టర్‌ చేరుకున్నారు. సర్పంచ్‌ భూక్యా భద్రూనాయక్‌ నేతృత్వంలో జరుగుతున్న పల్లెప్రకృతి వనం ఏర్పాటు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పల్లె ప్రకృతి వనాలను ప్రతి పంచాయతీలో తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం మండలంలోని ఊకల్‌ గ్రామానికి చేరుకుని ఊర చెరువు సమీపంలో జరుగుతున్న డంపింగ్‌ యార్డు, వైకుంఠధామం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఊకల్‌లో పల్లె ప్రకృతివనం నిర్మాణ పనులను ఎందుకు చేపట్టడం లేదంటూ సర్పంచ్‌ కుంచారపు హరినాథ్‌ను కలెక్టర్‌ ప్రశ్నించారు. గ్రామంలో ప్రభుత్వ భూములు అందుబాటులో లేవని, సర్వే నంబర్‌ 13లో 0.28 గుంటల భూమిని తహసీల్దార్‌ కుసుమ సత్యనారాయణ పంచాయతీకి కేటాయించగా, కొందరు వ్యక్తులు అడ్డుకుంటున్నారని సర్పంచ్‌ తెలిపారు. అలాగే, గ్రామ ప్రవేశంలో నిరుపయోగంగా ఉన్న భూమిని పల్లె ప్రకృతివనానికి కేటాయించాలని కొందరు గ్రామస్తులు కోరుతుండగా అది మాజీ సైనికుడికి గతంలో ప్రభు త్వం కేటాయించిందని ఓ మహిళ కలెక్టర్‌ను వేడుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన కలెక్టర్‌ సమస్యాత్మక భూములను వెంటనే సర్వే చేసి, పరిష్కారం చూపాలని, ప్రభుత్వ భూములు అని తేలి తే ప్రజాఅవసరాలకు వినియోగించేందుకు చర్య లు తీసుకోవాలని ఆర్‌డీవో, తహసీల్దార్‌ను ఆదేశించారు. గ్రామస్తులంతా కలసికట్టుగా ఉంటూ అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ బైరి యాకయ్య, పంచాయతీ కార్యదర్శులు దామెరుప్పుల శాంతిరాజు, మహ్మద్‌ శంషోద్దిన్‌, కారోబార్‌ శ్రీనివాస్‌, సదా శ్రీను, వెన్నప్ప కృష్ణమూర్తి, రైతు కోఆర్డినేటర్‌ లెక్కల నారాయణరెడ్డి, రవీందర్‌రెడ్డి, కుందూరు యాదగిరిరెడ్డి, రావుల వెంకట్‌రెడ్డి  పాల్గొన్నారు. 

పనులను వేగవంతం చేయాలి 

మండలంలోని అన్ని గ్రామాల్లో పల్లె ప్రగతి పనులను వేగంగా పూర్తిచేయడానికి  అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని కలెక్టర్‌  పర్యటన అనంతరం మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో ఆమె ఆర్‌డీవో మహేందర్‌జీ, తహసీల్దార్‌ సత్యనారాయణ, ఎంపీడీవో కలికోట రామ్మోహనాచారి, ఎంపీవో తుల రామోహ్మన్‌, ఏపీవో దొనికుల కుమార్‌గౌడ్‌, మండల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలో పల్లె ప్రగతి పనుల నిర్వహణ, భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ, ఆస్తుల ఆన్‌లైన్‌ సర్వేలపై కలెక్టర్‌ పలు సూచనలు ఇచ్చారు.