బుధవారం 02 డిసెంబర్ 2020
Warangal-rural - Nov 18, 2020 , 02:31:09

మక్క రైతులకు ‘మద్దతు’

మక్క రైతులకు ‘మద్దతు’

  •  ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి మార్క్‌ఫెడ్‌
  •  31 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు    నిర్ణయం
  •  ఇప్పటికే మూడు జిల్లాల్లో  12 సెంటర్లు ఓపెన్‌

వరంగల్‌ రూరల్‌, నమస్తే తెలంగాణ :  మక్కజొన్న రైతులకు ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఏడాది నియంత్రిత సాగు విధానాన్ని అమలులోకి తెచ్చిన ప్రభుత్వం వానకాలం, యాసంగి సీజన్లలో పంటల సాగు ప్రణాళికను ఖరారు చేసింది. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలకే ప్రాధాన్యమిచ్చింది. ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా మక్కజొన్న సాగు చేయకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచించారు. అయితే ఎక్కువ శాతం సర్కారు నిర్ణయాన్ని అనుసరించగా కొంతమంది మక్కజొన్న పంట సాగుచేశారు. దీంతో మార్కెట్‌లో డిమాండ్‌ లేకపోవడం వల్ల మక్క రైతులకు గిట్టుబాటు ధర లభించక నష్టపోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితిని గుర్తించిన సీఎం కేసీఆర్‌ కొద్ది రోజుల క్రితం వానకాలం మక్కలను ప్రభుత్వ మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. అయితే ఈ ఒక సీజన్‌లో మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మళ్లీ యాసంగిలో వేయొద్దని స్పష్టంచేశారు. ఈమేరకు మద్దతు ధరతో కొనుగోలు చేయాలని మార్క్‌ఫెడ్‌ సంస్థను ఆదేశించగా వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో 31 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.

అత్యధికంగా మహబూబాబాద్‌లో..

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మహబూబాబాద్‌, వరంగల్‌ రూరల్‌, వరంగల్‌ అర్బన్‌ జిల్లాల్లో రైతులు మక్కజొన్న పంట సాగు చేశారు. అత్యధికంగా మహబూబాబాద్‌ జిల్లాలో సుమారు 14వేల ఎకరాల విస్తీర్ణంలో పంట సాగైనట్లు రైతు సమగ్ర సమచారం పోర్టల్‌ ద్వారా గుర్తించారు. ఆ తర్వాత దాదాపు 4,200 ఎకరాలతో వరంగల్‌ రూరల్‌ జిల్లా రెండో స్థానంలో ఉంది. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 903 ఎకరాల్లో సాగు చేశారు. మహబూబాబాద్‌లో 24వేల నుంచి 25వేల టన్నులు, వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 8,500 టన్నులు, వరంగల్‌ అర్బన్‌లో 1,800 టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఈమేరకు మహబూబాబాద్‌ జిల్లాలో 26, వరంగల్‌రూరల్‌ జిల్లాలో 3, వరంగల్‌అర్బన్‌ జిల్లాలో 2 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం మార్క్‌ఫెడ్‌ సంస్థ అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఈ 31 కొనుగోలు కేంద్రాల్లో 12 సెంటర్లను ఇప్పటికే ప్రారంభించారు. మక్కలకు ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్‌కు గత ఏడాది రూ.1,760. దీనిపై ఈ ఏడాది ధర మరో రూ.90 పెరగడంతో మద్దతు ధర రూ.1,850కి చేరింది. రైతుల నుంచి వానకాలం మక్కలను పూర్తిగా కొనుగోలు చేసేలా, సెంటర్లలో రైతుల నుంచి కొన్న మక్కలను ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లు గోడౌన్లకు తరలించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. మహబూబాబాద్‌ జిల్లాలో కొనుగోలు చేసిన మక్కలను నిల్వ చేసేందుకు గీసుగొండ మండలంలోని ధర్మారం, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో 22వేల టన్నుల సామర్థ్యం గల గోడౌన్లను సిద్ధం చేశారు. వరంగల్‌ రూరల్‌, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో కొనుగోలు చేసే మక్కల నిల్వ కోసం గీసుగొండ మండలం ధర్మారం సమీపంలో 5వేల టన్నుల సామర్థ్యం ఉన్న ఓ గోడౌన్‌ సిద్ధం చేశారు.

కొనుగోలు కేంద్రాలు ఇవే..

మహబూబాబాద్‌ జిల్లాలో మహబూబాబాద్‌ మండలంలోని మహబూబాబాద్‌, నడికూడ, ముడుపుగల్‌ గ్రామం, బయ్యారం మండలంలో బయ్యారం, కాచన్‌పల్లి, కొత్తగూడెం, ఇసుకమెడ, జగ్గారావుపేట, ఆర్సీపురం, కంబాలపల్లి గ్రామాలు, కురవి మండలకేంద్రం, గూడూరు మండలంలోని గుండెంగ, బొద్దుగూడ, గూడూరుతో పాటు కేసముద్రం, నర్సింహులపేట మండల కేంద్రాలు, కొత్తగూడ మండలంలోని కొత్తగూడ, ఈదులపల్లి, బత్తులపల్లి, ఎంచగూడెం, గంగారం మండలంలోని గంగారం, కొమట్లగూడెం గ్రామాల్లో మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. వీటిలో మహబూబాబాద్‌, కేసముద్రం కేంద్రాలతో పాటు బయ్యారం, గూడూరు, కొత్తగూడ, గంగారం మండలాల్లో రెండేసి సెంటర్లను తాజాగా ప్రారంభించారు. 26 కొనుగోలు కేంద్రాల్లో వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లో పనిచేసే మహబూబాబాద్‌, కేసముద్రం సెంటర్లను ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు, ఇతర కేంద్రాలను పీఏసీఎస్‌లకు కేటాయించింది. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో గీసుగొండ మండలంలోని ఊకల్‌ గ్రామం, నర్సంపేట, చెన్నారావుపేట మండల కేంద్రాల్లో, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ఎల్కతుర్తి, ధర్మసాగర్‌ మండల కేంద్రాల్లో కేంద్రాల ఏర్పాటుకు మార్క్‌ఫెడ్‌ సంస్థ నిర్ణయించింది. వీటిలో ఊకల్‌ కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. నాలుగు రోజుల క్రితమే ఎల్కతుర్తి, ధర్మసాగర్‌ సెంటర్లు ప్రారంభమైనట్లు మార్క్‌ఫెడ్‌ సంస్థ జిల్లా మేనేజరు మహేశ్‌ వెల్లడించారు. నర్సంపేట సెంటర్‌ను ఒకటి రెండు రోజుల్లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరిగాయని ఆయన తెలిపారు. నర్సంపేట కొనుగోలు కేంద్రాన్ని ఓడీసీఎంఎస్‌కు, ఊకల్‌, చెన్నారావుపేట, ఎల్కతుర్తి, ధర్మసాగర్‌ సెంటర్లను పీఏసీఎస్‌లకు కేటాయించినట్లు మహేశ్‌ చెప్పారు.