సోమవారం 23 నవంబర్ 2020
Warangal-rural - Nov 18, 2020 , 01:19:47

చిల్లర రాజకీయాలు చేయొద్దు: ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి

చిల్లర రాజకీయాలు చేయొద్దు: ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి

నర్సంపేట, నవంబర్‌ 17 : రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు చేస్తున్న అసత్య ప్రచారాలు సరికాదని, రైతులు పండించిన సన్నధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం నర్సంపేటలోని క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతుల కోసం ఏ సాయం అందించని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంపై చిల్లర మాటలు మానుకోవాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ రెండూ పేరుకే జాతీయ పార్టీలని, వాటికి ఎలాంటి స్పష్టత, సిద్ధాంతాలు లేవన్నారు. సంక్షేమం దిశగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు తగవన్నారు. సన్నధాన్యంపై ఏ రాష్ర్టాల్లో లేని ఆంక్షలను తెలంగాణలో ఎందుకు పెడుతున్నారో తెలపాలన్నారు.  తెలంగాణ రైతులను మాత్రమే దెబ్బతీయాలనే వక్రబుద్ధిని మానుకోవాలని హితవు పలికారు. మక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుంటి రజినీకిషన్‌, జడ్పీ వైస్‌చైర్మన్‌ ఆకుల శ్రీనివాస్‌, ఎంపీపీలు విజేందర్‌, జాటోతు రమేశ్‌, జడ్పీటీసీ పత్తినాయక్‌ పాల్గొన్నారు.

మున్సిపల్‌ కార్మికుల వేతనాల పెంపునకు కృషి

నర్సంపేట మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల వేతనాలను పెంచేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే పెద్దిసుదర్శన్‌రెడ్డి అన్నారు. నర్సంపేటలో ఎమ్మెల్యేను మున్సిపల్‌ కార్మికులు టీఆర్‌ఎస్‌కేవీ ఆధ్వర్యంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా కాలంలో పారిశుధ్య కార్మికుల సేవలను ప్రభుత్వం ఎన్నటికీ మరిచిపోదన్నారు. వేతనాల పెంపు విషయాన్ని మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానన్నారు. కార్మికులకు నిత్యావసర వస్తువులు అందించాలని కమిషనర్‌ విద్యాధర్‌ను ఫోన్‌లో కోరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌కేవీ గౌరవ అధ్యక్షుడు గోనె యువరాజు, గౌరవ సలహాదారు నల్లా భారతి, కొల్లూరి లక్ష్మీనారాయణ, అధ్యక్షుడు మాదాసి సారయ్య, బొచ్చు భాస్కర్‌, మాదాసి నర్సింహారావు, గడ్డం సమ్మయ్య, గజ్జల మహేందర్‌, అలువాల రాజు, యశోద, మరియా, ఉమ, దేవేందర్‌ పాల్గొన్నారు.