బుధవారం 02 డిసెంబర్ 2020
Warangal-rural - Nov 18, 2020 , 01:19:46

శివనగర్‌ లోతట్టు ప్రాంతాల సమస్యకు శాశ్వత పరిష్కారం

శివనగర్‌ లోతట్టు ప్రాంతాల సమస్యకు శాశ్వత పరిష్కారం

అండర్‌ గ్రౌండ్‌ డక్ట్‌ నిర్మాణానికి డీపీఆర్‌

అగడ్త వద్ద రిటైనింగ్‌ వాల్‌

త్వరలో పనులు ప్రారంభం

వరంగల్‌ : దశాబ్దాల కాలంగా వాన వస్తే వణికిపోయే శివనగర్‌ వాసులకు భవిష్యత్‌లో వరద ముంపు గోస లేకుండా పటిష్ట ప్రణాళికతో గ్రేటర్‌ అధికారులు అడుగులు వేస్తున్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.మైసయ్యనగర్‌, శివనగర్‌ ప్రాంతాల ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపనున్నారు. ఈ మేరకు రూ. 41.50కోట్లతో 1250 మీటర్ల మేర అండర్‌గ్రౌండ్‌ డక్ట్‌(భూగర్భ వాహిక) నిర్మాణ పనులకు డీపీఆర్‌ రూపొందించారు. ఇటీవల నగరంలో కురిసిన ఎడతెరిపి లేని వర్షాలతో అనేక ప్రాంతాలు నీటి మునిగిన విషయం తెలిసిందే. నగరంలోని వరద ప్రాంతాల్లో పర్యటించిన పురపాలక శాఖ మంత్రి  కేటీఆర్‌ నాలాల విస్తరణకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో గ్రేటర్‌లోని నాలాల విస్తరణ పనులు అధికారులు మొదలుపెట్టారు. అయితే, వరంగల్‌లోని శివనగర్‌ ప్రాంతంతో నాలా విస్తరణతో అనేక మంది పేదలు ఇండ్లు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో స్థానిక ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ ప్రత్యేక శ్రద్ధ చూపి పేదల ఇండ్లకు నష్టం జరుగకుండా పటిష్ట ప్రణాళిక రూపొందించారు. మైసయ్య నగర్‌, శివనగర్‌ ప్రాంతాల ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకున్నారు. మంత్రి కేటీఆర్‌కు స్థానిక ప్రజల ఆర్థిక పరిస్థితిని వివరించారు. దీంతో పేదల ఇండ్లకు నష్టం కలుగకుండా ముంపు సమస్యకు పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. దీంతో  హైదరాబాద్‌కు చెందిన ఎస్‌కే అసోసియేట్స్‌ సంస్థతో డీపీఆర్‌ను తయారు చేయించారు.  ఎంత భారీ వర్షం కురిసినా శివనగర్‌ నీట మునగకుండా ముందు చూపుతో పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈ పనులకు టెండరు ప్రక్రియను పూర్తి చేసిన అధికారులు త్వరలో వాటిని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

రూ.41.50 కోట్లతో ప్రణాళిక

మైసయ్యనగర్‌, శివనగర్‌ ముంపు నివారణ కోసం రూ.41.50 కోట్లతో ప్రణాళికలు తయారు చేశారు. 1250 మీటర్ల పొడవు అండర్‌ గ్రౌండ్‌ డక్ట్‌ నిర్మించనున్నారు. ఇందుకు రెండు విడుతలుగా పనులు చేపట్టేలా అంచనాలు తయారు చేశారు. మొదటి ఫేజ్‌లో రూ.15.50 కోట్లతో, రెండో ఫేజ్‌లో రూ.26 కోట్లతో పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు తయారు చేశారు.  అండర్‌ బ్రిడ్జి రోడ్డు కల్వర్టు నుంచి అగర్తా వరకు మొత్తం 1250 మీటర్ల పొడవు అండర్‌ గ్రౌండ్‌లో డక్ట్‌ నిర్మించి, మైసయ్యనగర్‌, శివనగర్‌ ప్రాంతాలకు భవిష్యత్‌లో వరద ముంపు రాకుండా శాశ్వత పరిష్కారం చూపుతున్నారు. కాగా, ఆరు మీటర్ల విస్తీర్ణంతో ఈ అండర్‌గ్రౌండ్‌ డక్ట్‌ను నిర్మించనున్నారు. 3 మీటర్లకు చొప్పున రెండు వెంట్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 1977 నుంచి 2016 వరకు ఆ ప్రాంతంలో పడిన వర్షపాతాన్ని పరిగణలోకి తీసుకుని అక్కడ ముంపు నివారణకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 2500 క్యూసెక్కుల వరద నీరు వచ్చినా ఎలాంటి సమస్య రాకుండా ఉండేలా ఈ భూగర్భ వాహికలను నిర్మిస్తున్నారు. 5.64 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఆ ప్రాంతంలోకి వస్తున్న వరద నీటిపై అధ్యయనం చేసి డీపీఆర్‌ను రూపొందించారు. 

అగడ్త వద్ద 

రిటైనింగ్‌ వాల్‌

అగడ్త నుంచి వచ్చే వరద నీరు మైసయ్య నగర్‌ వైపు వెళ్లకుండా అగడ్త చెరువు వద్ద రిటైనింగ్‌ వాల్‌ నిర్మించనున్నారు. అగడ్త చెరువు నీటి సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు.  నుంచి వచ్చే వరద నీరు మైసయ్యనగర్‌ వెనుకవైపు నిర్మించే భూగర్భ వాహికలోకి మళ్లించేలా చర్యలు చేపడుతున్నారు. మొదటి ఫేజ్‌లో అండర్‌బ్రిడ్జి రోడ్డు కల్వర్టు నుంచి ప్రసాద్‌ దవాఖాన మీదుగా శివనగర్‌ మసీదు వరకు పనులు చేపట్టనున్నారు. ఈ మేరకు రూ.15.50 కోట్లు మంజూరు కాగా త్వరలో  పనులు ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే యంత్రాలు, 250 మంది కార్మికులు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారానికి 100 మీటర్ల అండర్‌గ్రౌండ్‌ డక్ట్‌ పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించారు. మొదటి ఫేజ్‌ పనులు పూర్తయిన వెంటనే రూ.26 కోట్లతో రెండో ఫేజ్‌ పనులు మొదలు పెడుతామని అధికారులు వివరించారు. 

ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం

దశాబ్దాల ముంపు కష్టాలు తీరనున్నాయి. రూ.41.50 కోట్లతో నిర్మించే అండర్‌గ్రౌండ్‌ డక్ట్‌తో శివనగర్‌ ప్రాంత ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. మంత్రి కేటీఆర్‌ స్వయంగా నాలాను పరిశీలించారు. సమస్య తీవ్రతను మంత్రి దృష్టికి తీసుకుపోయి ప్రత్యేక నిధులు తీసుకొచ్చా. వేగంగా పనులు పూర్తయ్యేలా శ్రద్ధ తీసుకుంటా. 40 ఏళ్ల వర్షపాతాన్ని పరిగణనలోకి తీసుకుని అండర్‌ గ్రౌండ్‌ డక్ట్‌కు డీపీఆర్‌ రూపొందించాం.  

- నన్నపునేని నరేందర్‌, తూర్పు ఎమ్మెల్యే