బుధవారం 02 డిసెంబర్ 2020
Warangal-rural - Nov 17, 2020 , 02:10:06

రాయితీ సంబురం

రాయితీ సంబురం

దీపావళి కానుకగా ఆస్తి పన్నులో 50శాతం రాయితీ

మున్సిపల్‌ కార్యాలయాలకు చేరిన ఉత్తర్వులు

నగర, పట్టణ ప్రజల్లో సంతోషం

(వరంగల్‌రూరల్‌-నమస్తేతెలంగాణ)

ఆస్తి పన్నులో 50శాతం రాయితీపై పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీపావళి కానుకగా ప్రభుత్వం తమకు రాయితీ ప్రకటించిందని మురిసిపోతున్నారు. 50శాతం రాయితీతో అధిక శాతం గృహ యజమానులకు ప్రయోజనం కలుగనుంది. ప్రధానంగా వందశాతం పేదలకు లబ్ధి చేకూరనుంది. ఆస్తి పన్నులో 50శాతం రాయితీ ఇచ్చేందుకు తమ ప్రభుత్వం నిర్ణయించిందని శనివారం మంత్రి కేటీ రామారావు ప్రకటించారు. 2020-21 సంవత్సరానికి సంబంధించి జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.15వేలు, ఇతర పట్టణాల్లో రూ.10వేల లోపు ఆస్తి పన్ను చెల్లించే గృహ యజమానులకు ఈ రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆస్తి పన్ను చెల్లించిన గృహ యజమానులకు వచ్చే ఏడాదికి రాయితీ సర్దుబాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఈ మేరకు జీవో నంబరు 611ను ప్రభుత్వం విడదల చేసింది. నగర పాలక సంస్థ, మున్సిపాలిటీ కార్యాలయాలకు ఈ జీవో అందింది. దీన్ని స్టడీ చేసిన అధికారులు సోమవారం నుంచి ఆస్తి పన్నులో 50శాతం రాయితీని అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో జీహెచ్‌ఎంసీ తర్వాత గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీడబ్ల్యూఎంసీ) అతి పెద్దది. రోజురోజుకీ ఇది విస్తరిస్తున్నది. దీంతోపాటు వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో తొమ్మిది మున్సిపాలిటీలు ఉన్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జీడబ్ల్యూఎంసీతో పాటు ఈ తొమ్మిది మున్సిపాలిటీల పరిధిలోని ప్రజల్లో అధిక శాతం మందికి ప్రయోజనం చేకూరుతుంది. ముఖ్యంగా వరంగల్‌ నగరం, ఇతర పట్టణాల్లోని వంద శాతం మంది పేదలకు రాయితీ వర్తిస్తుంది. 

పేదలందరికీ రాయితీ లబ్ధి

ఆస్తి పన్నులో 50శాతం రాయితీతో నూరు శాతం పేదలకు లబ్ధి చేకూరనుంది. కమర్షియల్‌, బహుళ అంతస్తుల భవనాలున్న వారికి మినహా ఇతరులందరికీ రా యితీ వర్తించనుంది. చిన్న మున్సిపాలిటీల్లో 90శాతం కుటుంబాలకు 50శాతం రాయితీ అమలు కానుంది. వర్ధన్నపేట వంటి పురపాలక సంఘం పరిధిలో రాయి తీ 90శాతం కుటుంబాలకు వర్తించనుందని అధికారు లు వెల్లడించారు. ఎందుకంటే కమర్షియల్‌ కాంప్లెక్స్‌ లు, బహుళ అంతస్తుల భవనాలు ఈ మున్సిపాలిటీ పరిధిలో చాలా తక్కువ. ఇక్కడ వర్ధన్నపేట మున్సిపాలిటీ ఆవిర్భవించినప్పటి నుంచి అసెస్‌మెంటు కూడా జరగలేదు. దీంతో సంవత్సరంలో ఆస్తి పన్ను రూ. 10వేల లోపు చెల్లించే కుటుంబాలు 90శాతం ఉంటాయని అధికారులు తెలిపారు. 50శాతం రాయితీ ఇక్క డ వందశాతం పేదలకు వర్తిస్తుందని చెప్పారు. కొత్తగా ఏర్పడిన మరిపెడ, డోర్నకల్‌ వంటి మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి. నర్సంపేట, పరకాల పురపాలికల్లో కూడా భారీ వాణిజ్య సముదాయాలు, బహుళ అంతస్తుల భవనాలు తక్కువే ఉన్నాయి. దీంతో నర్సంపేట, పరకాల పట్టణాల్లో రాయితీ సుమారు 70 నుంచి 75 శాతం కుటుంబాలకు వర్తించే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక్కడా పేదలకు మాత్రం వంద శాతం మందికి రాయితీ వర్తించనుండడం విశేషం. భూపాలపల్లి, మహబూబాబాద్‌, తొర్రూరు, జనగామ మున్సిపాలిటీల పరిధిలోనూ ఇదే పరిస్థితి ఉంటుందని విశ్లేషకులు అంచనా వేశారు. జీడబ్ల్యూఎంసీలో వాణిజ్య సముదాయాలు, బహుళ అంతస్తుల భవనాలున్న గృహ యజమానులకు మినహా ఇతర కుటుంబాలకు ఆస్తి పన్నులో 50శాతం రాయితీ వర్తించనుంది. వరంగల్‌ మహా నగరంలో కూడా వంద శాతం పేదలకు రాయితీతో లబ్ధి చేకూరనుంది. ఇక్కడ పేదలు ఏడాది చెల్లించే ఆస్తి పన్ను రూ.10 వేలలోపే. డబుల్‌, త్రిబుల్‌ బెడ్‌రూం ఇల్లు కలిగిన గృహ యజమానులు కూడా చెల్లించే సంవత్సరం ఆస్తి పన్ను రూ.10వేలలోపే ఉంటుంది. డబుల్‌, త్రిబుల్‌ బెడ్‌రూంలతో కూడిన గ్రౌండ్‌, ఫస్ట్‌ ఫ్లోర్‌ ఉన్న ఇళ్ల యజమానులూ రూ.పది వేలలోపే ఆస్తి పన్ను చెల్లిస్తున్నారు. ట్రైసిటీలో ఉన్న ఇలాంటి వారందరికీ ఆస్తి పన్నులో 50శాతం రాయితీ లభిస్తుంది. సోమవారం జీడబ్ల్యూఎంసీ, ఇతర మున్సిపాలిటీల పరిధిలో అనేక మంది ఆస్తి పన్నులో 50శాతం రాయితీని పొందారు.

వంద శాతం పేదలకు వర్తింపు

ఆస్తి పన్నులో 50శాతం రా యితీ వంద శాతం పేదల కు వర్తించనుంది. ఏడాదికి సంబంధించి రూ.10వేలు అంతకంటే ఎక్కువ ఆస్తి పన్ను చెల్లిస్తున్న వారిలో పేదలెవరు లేరు. కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు, మూడు నాలుగు కంటే ఎక్కువ అంతస్తుల భవనాలు ఉన్న గృహ యజమానులే రూ.10 వేలకుపైగా ఆస్తి పన్ను చెల్లిస్తున్న వారిలో ఉన్నారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడింది. ఇక్కడ అసెస్‌మెంటు జరుగకపోవడంతో గతంలో గ్రామ పంచాయతీగా ఉన్నప్పటి ఆస్తి పన్నులే అమలవుతున్నాయి. ఆస్తి పన్ను రూ.10 వేలలోపు చెల్లిస్తున్న వారిలో వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో 90శాతం మంది ఉంటారు. 

-రవీందర్‌, కమిషనర్‌, వర్ధన్నపేట మున్సిపాలిటీ