మంగళవారం 24 నవంబర్ 2020
Warangal-rural - Nov 16, 2020 , 01:58:13

సమస్యలు వస్తే ధైర్యంగా ఎదుర్కోవాలి

సమస్యలు వస్తే ధైర్యంగా ఎదుర్కోవాలి

అదనపు కలెక్టర్‌ మహేందర్‌రెడ్డి

నర్సంపేట: సమస్యలు వచ్చినప్పుడు బాలికలు ధైర్యంగా ఎదుర్కోవాలని అదనపు కలెక్టర్‌ ఆర్‌ మహేందర్‌రెడ్డి సూచించారు. నర్సంపేట పట్టణంలోని సంజీవని ఆశ్రమంలో శనివారం బాలల దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. బాలబాలికలు బాగా చదువుకుని ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. బాలలకు సమస్యలు వచ్చినప్పుడు జిల్లా అధికార యంత్రాంతం సహాయ సహకారాలు అందిస్తుందని సూచించారు. కొవిడ్‌-19 కారణంగా పాఠశాలలు మూతపడడంతో ఆన్‌లైన్‌ బోధన జరుగుతున్నదన్నారు. విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు. క్రమం తప్పకుండా వ్యాయమం చేస్తే ఆరోగ్యంగా ఉంటారన్నారు. బాలల సంక్షేమ జిల్లా అధికారి చిన్నయ్య మాట్లాడుతూ వయోజనులకు హక్కులు ఉన్నట్లే బాలలకు కూడా హక్కులు ఉన్నాయని గుర్తుచేశారు. ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల తీర్మానం ఒడంబడిక కూడా చేసిందన్నారు. బాలల కోసం 54 ప్రత్యేక హక్కులు ఉన్నాయని వివరించారు. జిల్లా బాలల సంరక్షణ అధికారి జీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాలు, బాల కార్మికులు, లింగవివక్ష ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే 1098కి ఫోన్‌ చేయాలని సూచించారు. దీంతో వారిని అధికారులు రక్షించి బాలల న్యాయచట్టం 2015 ప్రకారం చైల్డ్‌వెల్ఫేర్‌ కమిటీ ఆదేశానుసారం నిర్ణయాలు తీసుకుంటారని వివరించారు.  కార్యక్రమంలో చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అధికారి రాజు, కో ఆర్డినేటర్‌ వీరబాబు, ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్‌ మోహన్‌రావు, వినోద పాల్గొన్నారు.

ఉత్సాహంగా బాలల దినోత్సవ వేడుకలు

రాయపర్తి: సన్నూరు, వెంకటేశ్వరపల్లిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో బాలల దినోత్సవాన్ని అంగన్‌వాడీ టీచర్లు మహ్మద్‌ జాహెదాబేగం, బందు మంజుల, చెడుపాక శ్రీలత నేతృత్వంలో జరిపారు. ఈ సందర్భంగా జవహర్‌లాల్‌ నెహ్రూ చిత్రపటానికి చిన్నారులు పూలుచల్లి నివాళులర్పించారు. అనంతరం పిల్లలు ఆటపాటలతో ఆకట్టుకున్నారు.