సోమవారం 30 నవంబర్ 2020
Warangal-rural - Nov 14, 2020 , 02:12:11

బాలల హక్కులపై విస్తృత ప్రచారం చేయాలి

బాలల హక్కులపై విస్తృత ప్రచారం చేయాలి

  • కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు

హన్మకొండ, నవంబర్‌ 13: బాలల హక్కులపై విస్తృత ప్రచారం చేపట్టడంతో పాటు వారి హక్కులకు భరోసా ఇవ్వాలని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు అన్నారు. బాలల హక్కుల వారోత్సవాలను పురస్కరించుకుని బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన వాల్‌పోస్టర్‌ను శుక్రవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ బాలల హక్కుల్లో జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు అభివృద్ధి చెందే హక్కు, పాల్గొనే హక్కులు ప్రధానమైనన్నారు. అయితే, నిరక్ష్యరాస్యత, పేదరికం కారణంగా బాల్యం అంధకారమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సమాజ అభివృద్ధి కుంటుపడుతోందన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామ, మండల, డివిజన్‌ స్థాయిల్లో బాలల హక్కులపై విస్తృత అవగాహన సదస్సులు నిర్వహించి, బాలల పరిరక్షణ కమిటీలను బలోపేతం చేయాలన్నారు. బాలల హక్కులకు భంగం కలుగకుండా అందరూ సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ దీపావళి పండుగను జరుపుకోవాలని కలెక్టర్‌ సూచించారు. అలాగే, బాలబాలికందరికీ కలెక్టర్‌ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 

వారోత్సవాల షెడ్యూల్‌

బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా శనివారం నుంచి 21వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను చేపట్టనున్నారు. శనివారం బాలసదనంలోని పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలు, 16న ప్రభుత్వ సీకేఎం, జీఎంహెచ్‌లో ఊయల పునరుద్ధరణ, 17న డీఎంహెచ్‌వో కార్యాలయంలో గర్భస్థలింగ నిర్ధారణ చట్టంపై అవగాహన, 18న హన్మకొండ, వరంగల్‌, భీమదేవరపల్లి ప్రాజెక్టుల పరిధిలో బాలల హక్కులపై అవగాహన సదస్సులు చేపట్టనున్నా రు. అలాగే 19న అంతర్జాతీయ బాలల అక్రమ రవాణా వ్యతిరేకదినం సందర్భంగా పోలీస్‌ అధికారులతో సమీక్ష, భవిష్యత్‌ కార్యాచరణ, 20న ముగింపు కార్యక్రమాలు ఉంటాయి. ఈ సందర్భంగా ఎంపిక చేసిన పిల్లలకు స్పాన్సర్‌షిప్‌ కార్యక్రమం కింద చెక్కులు పంపిణీ చేస్తున్నట్లు ఐసీడీఎస్‌ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి ఎం శారద, సీడీపీవో ఎం విశ్వజ, బీఆర్‌బీ కోఆర్డినేటర్‌ అనిత, ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, ఎల్‌సీపీవో సతీశ్‌కుమార్‌, శిశు గృహ మేనేజర్‌ డీ నగేశ్‌, ఎక్సెన్షన్‌ ఆఫీసర్‌ సింధూరాణి, చైల్డ్‌లైన్‌ కోఆర్డినేటర్‌ కృష్ణమూర్తి, నోడల్‌ కోఆర్డినేటర్‌ ఎండీ ఇక్బాల్‌పాష, కౌన్సిలర్‌  మాధవి, సోషల్‌ వర్కర్‌ జీ సునీత, పీ విజయకుమార్‌, సుజాతాదేవి పాల్గొన్నారు.