ఆదివారం 29 నవంబర్ 2020
Warangal-rural - Nov 12, 2020 , 02:45:59

విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి కృషి

విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి కృషి

  • ఎలాంటి లోపాలున్నా ఫిర్యాదు చేయొచ్చు
  • పోస్టు ద్వారా కూడా పంపించవచ్చు
  • సీజీఆర్‌ఎఫ్‌ చైర్మన్‌ సత్యనారాయణ

నర్సంపేట: విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (సీజీఆర్‌ఎఫ్‌) చైర్మన్‌ పీ సత్యనారాయణ అన్నారు. పట్టణంలో బుధవారం విద్యుత్‌ సమస్యల పరిష్కార వేదిక సదస్సు నిర్వహించారు. ఇందులో విద్యుత్‌ వినియోగదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ పరిధిలోని పూర్వపు మూడు జిల్లాలైన వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం హెచ్‌టీ, ఎల్‌టీ వినియోగదారుల పరిధిలోని విద్యుత్‌ సమస్యలను పరిష్కరించేందుకు సీజీఆర్‌ఎఫ్‌-1 సంస్థ ఉందని గుర్తుచేశారు. విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి లోపాలున్నా ఫోరానికి ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. ఫిర్యాదును రాతపూర్వకంగా సర్వీసు కనెక్షన్‌ నంబర్‌, పూర్తి చిరునామాతో పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా ఆఫీసుకు వచ్చి అందించవచ్చని వివరించారు. 

ఎలాంటి రుసం లేకుండానే ఫిర్యాదు

ఫిర్యాదు కోసం ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని సత్యనారాయణ అన్నారు. ఫిర్యాదుదారుల నుంచి వివరాలు తెలుసుకునేందుకు అవసరమైతే ఫోరం సభ్యులు వినియోగదారుల వద్దకే వస్తారని స్పష్టం చేశారు. విద్యుత్‌ సరఫరాలో తరచూ వచ్చే అంతరాయాలు, హెచ్చుతగ్గులు, విద్యుత్‌ మీటర్‌ ఎక్కువగా తిరుగడం, ఆగిపోవడం, కాలిపోయినా, విద్యుత్‌ బిల్లులు ఎక్కువ రావడం, కొత్త సర్వీసులు, అదనపు లోడ్‌ ఇవ్వడం, జాప్యం తదితర అంశాలపై ఫిర్యాదు చేయొచ్చని ఆయన కోరారు. ఈ సందర్భంగా వినియోగదారులు, వ్యాపారులు, ప్రజాప్రతినిధులు హాజరై తమ సమస్యలను వివరించారు. సమావేశంలో సభ్యులు తిరుమల్‌రావు, చరణ్‌దాసు, డీఈ మృత్యుంజయరావు, ఏడీఈ అమృ, ఏఈ రాజు పాల్గొన్నారు.