శుక్రవారం 27 నవంబర్ 2020
Warangal-rural - Nov 12, 2020 , 02:46:01

రైతులకు మెరుగైన సేవల కోసమే ధరణి

రైతులకు మెరుగైన సేవల కోసమే ధరణి

  • కలెక్టర్‌ హరిత

చెన్నారావుపేట, నవంబర్‌ 11 : రైతులకు మరింత మెరుగైన సేవలు అందించడం కోసమే ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను ప్రవేశపెట్టిందని కలెక్టర్‌ ముండ్రాతి హరిత అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఆమె సందర్శించారు. ధరణి ప్రక్రియ ఏవిధంగా కొనసాగుతున్నదని పరిశీలించారు. ప్రతి రోజూ ఎంత మందికి ధరణి ద్వారా భూ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని తహసీల్దార్‌ ఫూల్‌సింగ్‌ చౌహాన్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు, మ్యుటేషన్ల కోసం రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, మీ సేవలో నిర్ణీత ఫీజులు చెల్లించి భూ యాజమాన్య హక్కు పత్రాలు పొందొచ్చన్నారు. చెన్నారావుపేట శివారు సర్వే నంబర్‌ 356/1లో భూములున్న రైతులకు పట్టా పాస్‌ పుస్తకాలు అందించాలని సొసైటీ డైరెక్టర్‌ జంగిలి రాజు, బర్ల దేవదాసు, బర్ల స్వామి, ప్రభాకర్‌, నర్మెట్ట సాంబయ్య కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో నర్సంపేట ఆర్డీవో పవన్‌కుమార్‌, డిప్యూటీ తహసీల్దార్‌ మధుసూదన్‌, గిర్ధావర్‌ స్వామి, ధరణి ఆపరేటర్లు సుధీర్‌కుమార్‌, సామ్రాట్‌ తదితరులు పాల్గొన్నారు.

పల్లె ప్రగతి పనుల్లో అలసత్వం వద్దు..

పల్లెప్రగతి పనుల్లో అలసత్వం వహించొద్దని కలెక్టర్‌ హరిత అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులతో పల్లెప్రగతి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాల కోసం ప్రభుత్వ స్థలాలను వెంటనే గుర్తించాలన్నారు. గుర్తించిన స్థలాల్లో విరివిగా మొక్క లు నాటించాలన్నారు. అసంపూర్తిగా ఉన్న డంపింగ్‌ యార్డులు, వైకుంఠధామాల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో చెత్తాచెదారం లేకుండా చూడాలని, సైడ్‌ డ్రైనేజీల్లో మురుగు నీళ్లు నిలువకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సమీక్షకు హాజరుకాని సర్పంచ్‌లు, కార్యదర్శుల జాబితాను పంపించాలని ఎంపీవో సురేశ్‌ను ఆదేశించారు.  కార్యక్రమంలో డీఆర్డీవో సంపత్‌రావు, ఆర్డీవో పవన్‌కుమార్‌, ఉపాధిహామీ ఏపీడీ సాయిచరణ్‌, జడ్పీటీసీ బానోత్‌ పత్తినాయక్‌, ఎంపీడీవో దయాకర్‌, ఏపీవో అరుణ, డిప్యూటీ తహసీల్దార్‌ మధుసూదన్‌ తదితరులు పాల్గొన్నారు.